Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకం

– పోలీస్ యూనిఫాం కోసం మహిళా పోలీసులకు జంట్స్ టైలర్ తో కొలతలు తీయించడం దారుణం
– యూనిఫాం కుట్టేందుకు లేడీ టైలర్స్ లేరా?
-తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత

వైసీపీ పాలనలో మహిళలకే కాదు…మహిళా పోలీసుకూ రక్షణ కరువైంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళల ఆత్మ గౌరవానికి ఎంతలా భంగం కలిగిస్తోందో తెలిపేందుకు నెల్లూరు జిల్లాలో మహిళా పోలీసులకు జరిగిన అవమానమే ఉదాహరణ. నెల్లూరు, కావలి, ఆత్మకూరు డివిజన్లలోని మహిళా పోలీసులకు యూనిఫాం కుట్టించేందుకు జంట్స్ టైలర్ తో కొలతలు తీసుకోవడం దారుణమైన చర్య. కొలతలు తీసుకోడానికి నెల్లూరు జిల్లా మొత్తంలో లేడీస్ టైలర్లు లేరా? మీకు దొరకలేదా?

పోలీసు వృత్తిలోకి వచ్చిన మహిళల పట్ల ఇలాగేనా వ్యవహరించేది? యూనిఫామ్ అనే ఒక్క కారణంటో మహిళా పోలీసుల పట్ల వ్యవహరించిన తీరు సరిగా లేదు. ఇదేమీ చిన్న ఇష్యూ కాదు. ఆడపిల్లల ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. మహిళా భద్రతే మా ధ్యేయమంటూ మీడియా ముందు భారీ

ప్రకటనలు, సాక్షిలో ఫ్రంట్ పేజీ ప్రకటనలు ఇచ్చుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై ఏం సమాధానం చెబుతారు? ఇంగిత జ్ఞానంలేని ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ వల్లే మహిళలకు ఇన్ని అవమానాలు జరుగుతున్నాయి. ఆడపిల్లల భద్రతను గాలికొదిలేసిన పాలకుల మధ్య బ్రతకావాల్సి రావడం బాధాకరం.

పోలీస్ విభాగంలో పనిచేసే వారికే రక్షణ కల్పించలేని మీరు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఏం భరోసా ఇస్తారు? అందర్నీ సమానంగా చూడాల్సిన ప్రభుత్వమే మహిళల పట్ల వివక్ష చూపిస్తే ఎలా? మీకు ఎలాగూ రాష్ట్రంలోని మహిళలపై అఘాయిత్యాలను, దాడులను ఆపడం చేతకాలేదు. కనీసం మహిళా పోలీసులకు కూడా రక్షణ కల్పించలేని నిస్సహాయత మీది. ఆడవారికి భద్రత కల్పించండి. మీ చేతకాని, చేవలేని చర్యలతో వారి జీవితాలతో ఆడుకోవద్దు. వారి ఆత్మాభిమానంపై దెబ్బకొట్టొద్దు. ఇప్పటికైనా మహిళలను గౌరవించడం నేర్చుకోండి.

LEAVE A RESPONSE