– శ్రీ పద్మావతి పీడియాట్రిక్ కార్డియాక్ హాస్పిటల్ సేవలు అజరామరం
– గుండె సంబంధిత వ్యాధులతో జన్మించిన పేద పిల్లలకు వరం
– ఇప్పటికే 128 ఆపరేషన్లతో నిరుపేద చిన్నారులకు పునర్జన్మ
– పేద తల్లిదండ్రుల కళ్లలో ఆనందం
– ఈ ఆనందం రెట్టింపయ్యేలా మరో కీలక నిర్ణయం
– చిన్నారులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో ప్రత్యేక ఆసుపత్రి
– 350 పడకలతో నిర్మాణానికి ముందుకొచ్చిన టీటీడీ
– దక్షిణ భారతదేశంలోనే ప్రప్రథమంగా ఏర్పాటుకు సీఎం దిశా నిర్దేశం
తిరుపతి : వారు ముద్దులొలికే చిన్నారులు.. ఆడుతూ పాడుతూ ఆనందంగా ఎలాంటి అరమరికలు లేకుండా చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇదంతా పైకి కనిపించేది మాత్రమే. కానీ వారి గుండెలో ఎక్కడో ఏదో తేడా. పుట్టుకతోనే లోపంతో జన్మించారు. ఆ విషయం తెలిసిన తల్లిదండ్రుల గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏం చేయాలి దేవుడా.. అంటూ తల్లడిల్లిపోతున్నారు.
అదే సమయంలో తమ వద్దకు పాదయాత్రగా వచ్చిన వైఎస్ జగన్‌కు తమ కష్టం గురించి చెప్పుకున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం తమదని గోడు వెళ్లబోసుకున్నారు. సరిగ్గా ఇలాంటి పిల్లల కోసమే ప్రత్యేకంగా ఓ ఆస్పత్రి నిర్మించాలనేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కల.అయితే ఆయన
మన మధ్య నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు. పాదయాత్రలో తన కళ్లెదుట కనిపించిన చిన్నారుల హృదయావేదనలు, తండ్రి స్వప్నం.. వెరసి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఆ దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు ముందుకు వేశారు. తండ్రి కలను సాకారం చేశారు.
చిన్నారుల గుండె చికిత్సలకు చిరునామా
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని పాద పద్మముల చెంత తిరుపతిలో శ్రీ పద్మావతి పీడియాట్రిక్ కార్డియాక్ హాస్పిటల్‌కు అంకురార్పణ గావించారు.గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన మొట్టమొదటి పీడియాట్రిక్ కార్డియాక్ హాస్పిటల్‌ఇదే. సీఎం వైఎస్ జగన్ సూచనలతో టీటీడీ ఈ ఆస్పత్రి ఏర్పాటు బాధ్యతలను తన భుజాలకెత్తుకుంది.
గుండె సంబంధిత రుగ్మతలతో బాధపడే, ఖరీదైన మందులు కొనగలిగే ఆర్థిక స్థోమత లేని పిల్లలకు ఈ ఆస్పత్రి ఒక వరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేద చిన్నారులకు శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ శస్త్రచికిత్సలు చాలా ఖరీదైనవి కాబట్టి, చికిత్స ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా భరిస్తోంది.
చిన్నారుల బంగారు భవిష్యత్ లక్ష్యం
రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 10 వేల మంది పిల్లలు గుండె సంబంధిత సమస్యలతో పుడుతున్నారు. వారిలో 1/3 వంతు మంది పిల్లలది క్లిష్టమైన పరిస్థితి. ఈ పిల్లలకు సకాలంలో చికిత్స అందించకపోతే వారు తమ మొదటి పుట్టిన రోజును కూడా జరుపుకోలేరు. రాష్ట్ర విభజన తర్వాత పిల్లల ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా ఆస్పత్రి లేదు. ఈ లోపాన్ని అధిగమించి ఈ తరహా చిన్నారులకు మంచి జీవితాన్ని ఇవ్వాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనోభావాలకు అనుగుణంగా ఈ ఆస్పత్రి ఏర్పాటైంది. తద్వారా వ్యాధిగ్రస్తులైన పిల్లలకు కచ్చితంగా కొత్త జీవితం లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
70 పడకలతో అత్యాధునిక పరికరాలు
తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రి పాత బ్లాక్‌లో తాత్కాలికంగా పని చేస్తున్న ఈ పీడియాట్రిక్ కార్డియాక్ హాస్పిటల్ కోసం ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తున్న టీటీడీ సుమారు రూ.25 కోట్లు ఖర్చు చేసింది. ఆస్పత్రిలో 70 పడకల సామర్థ్యంతో అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. ఇందులో 40 ఐసీయూ పడకలు, 3 లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్నారులకు రోజుకు దాదాపు 5,6 సర్జరీలు చేస్తున్నారు. వ్యాధిగ్రస్త చిన్నారులు, వారి తల్లిదండ్రులు వేచి ఉండే ప్రాంతంతో పాటు అవుట్ పేషెంట్ బ్లాక్‌లో ఐదు కన్సల్టేషన్ సూట్‌లు ఉన్నాయి. పది మంది రెగ్యులర్ స్పెషలిస్ట్‌లతో పాటు, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి విజిటింగ్ నిపుణులు ప్రతి వారం ఇక్కడకు వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు.
అనతి కాలంలోనే 128 ఆపరేషన్లు
గుండె సంబంధిత రుగ్మతలతో బాధ పడుతున్న పిల్లలకు అధునాతన వైద్యం అందించడానికి దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ (తక్కువ రేడియేషన్ ఇంటెన్సిటీతో) ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల అవసరాలు, వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రిలో
వసతులు కల్పించారు. 2021 అక్టోబర్ 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఆస్పత్రిలో, ఇప్పటి వరకు 128 గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. రోజుల వయసు నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలకు విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించారు. రోగుల వెంట వచ్చిన వారికి కూడా ఉచితంగా వసతి సౌకర్యం కల్పిస్తున్నారు.చిన్నారుల గుండె చికత్స లను పూర్తిగా ఉచితంగా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం దేశం మొత్తం మీద మనదే కావడం గమనార్హం
మరో ముందడుగుతో సూపర్ స్పెషాలిటీ సేవలు
జాతికి భవిష్యత్తు మూల స్తంభాలైన చిన్నారుల ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్ సూచన మేరకు టీటీడీ శాశ్వతంగా 350 పడకల తో, 14 సూపర్ స్పెషాలటీ డిపార్ట్‌మెంట్‌లతో, దేశంలోనే అత్యుత్తమమైన సూపర్ స్పెషాలిటీ పీడియాట్రిక్ ఆస్పత్రిని నిర్మిస్తోంది. కార్డియాక్ ట్రీట్‌మెంట్ మాత్రమే కాకుండా ఇతర సబ్–స్పెషాలిటీలకు సంబంధించి 14 ఇతర విభాగాలు కూడా ప్రారంభిస్తున్నారు.
న్యూరోసర్జరీ, జెనెటిక్ డీసీజెస్, మాలిక్యులర్ స్టడీస్, డెవలప్‌మెంటల్ పీడియాట్రిక్స్, నెఫ్రాలజీ (కిడ్నీ వ్యాధులు), గ్యాస్ట్రోఎంటరాలజీ, సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, గుండె, మూత్రపిండాలు, కాలేయానికి సంబంధించి మొదలైన స్పెషాలిటీ సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఎయిర్ అంబులెన్స్ సౌకర్యం కల్పించేందుకు కూడా ప్రణాళిక సిద్దం చేశారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిరుపేద పిల్లలకు కొత్త జీవితాన్ని అందించడంలో అగ్రగామిగా ఉండాలన్న ఉదాత్త ఉద్దేశంతో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆస్పత్రి రూపుదిద్దుకుంటోంది. పేదలకు అత్యుత్తమ వైద్యం అందించడంలో భాగంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మానవసేవే మాధవ సేవగా భావించి.. ముందు వరుసలో నిలిచింది.
శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ సర్జరీ çఫర్ ది డిసేబుల్డ్ (బర్డ్) – ఇదొక ప్రత్యేకమైన ఆర్థో హాస్పిటల్ ఈ కోవలేనివే. ఈ ఆస్పత్రులు చాలా మందికి కొత్త జీవితాన్ని అందించాయి. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్గనిర్దేశంతో ఇతోదికంగా సేవలందిస్తున్నాయి.