– భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు
– త్వరలోనే నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం
– మహిళల కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
కసుమూరు: వెంకటాచలం మండలం కసుమూరులో శ్రీ మస్తానయ్య దర్గాను సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ సందర్శించి, ప్రార్థనలు చేశారు. దర్గా ప్రాంగణాన్ని పరిశీలించి భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఆరా తీసి నూతనంగా ఏర్పాటు చేసిన దాతల విశ్రాంతి గది, బేబీ ఫీడింగ్ రూమ్ లను ఇద్దరు నాయకులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడారు. కసుమూరులోని మస్తానయ్య దర్గా మతసామరస్యానికి ప్రతీక… కులమతాలకు అతీతంగా దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. దేశంలోనే పేరుగాంచిన దర్గా మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండటం మనందరి అదృష్టమన్నారు. కసుమూరులోని కల్యాణ మండపాన్ని పునర్నిర్మించి సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పలు హామీలు ఇచ్చిన అజీజ్ భాయ్ కు ధన్యవాదములు.
భక్తులకు వసతికల్పించేందుకు గదుల నిర్మాణం చేపడతామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. వసతులు కల్పించేందుకు అదనంగా స్థలం అవసరమైనా సేకరించి భక్తులకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. మరుగుదొడ్లకు రుసుం వసూలు చేసే స్వస్తి పలికి ఉచితంగా ఉపయోగించుకునే సౌకర్యం తెస్తామన్నారు. త్వరలోనే రోజూ మధ్యాహ్నం భక్తులకు అన్నదానం ప్రారంభించేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమానికి మా వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.
అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కసుమూరు దర్గాలో అవసరమైన అన్ని పనులు చేపట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాం. త్వరలోనే నిత్యాన్నదానం ప్రారంభించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో 26 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం..అందులో ఒకటి కసుమూరులో పెడతాం.
ఏఐ, కంప్యూటర్, టాలీ వంటి డిజిటల్ స్కిల్స్ తో పాటు సంప్రదాయ స్కిల్స్ ను మహిళల్లో పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా 100 మంది మహిళల కోసం సర్వేపల్లి నియోజకవర్గంలోని కసుమూరులో ప్రారంభించబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఏఎస్ పేట దర్గాతో పాటు నెల్లూరు బారాషహీద్ దర్గాల్లో భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో పాటు నెల్లూరులో నాలుగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.