-కేంద్ర జాబితాలో చేర్చకుండా ఓబీసీ కులాల ప్రయోజనాలను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
– తూర్పు కాపులకు అన్యాయం
– ఇది ఓబీసీ కులాలకు ద్రోహం అన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 146 కులాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (బీసీల) రాష్ట్ర జాబితాలో చేర్చబడ్డాయి. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కోసం బీసీల సెంట్రల్ జాబితాలో 107 కులాలు మాత్రమే చేర్చబడ్డాయి.మిగిలిన 39 కులాలను కేంద్ర జాబితాలో చేర్చకపోవడానికి, కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండటానికి గల కారణాలకు సంబంధించిన వివరాలను పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోసం కేంద్ర జాబితాలో వెనుకబడిన కులాలను చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సిఫారసు లేదా అభ్యర్థన చేయలేదని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి లిఖిత పూర్వక సమాధానంలో బహిర్గతం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యర్థనలు చేయనందున, వెనుకబడిన కులాలను కేంద్ర బీసీల జాబితాలో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఏమీ లేదని కేంద్ర మంత్రి తెలిపారు.
ఈ అంశంపై ఎంపి జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, వైసీపీ, టీడీపీ ప్రభుత్వాల నిర్లక్ష్య కారణంగా బీసీల రాష్ట్ర జాబితాలో ఉన్న 39 బీసీ కులాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు కేంద్ర విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల ప్రయోజనం లేకుండా పోయింది. వైసీపీ, టీడీపీ రెండూ బీసీలకు అనుకూలమని చెప్పుకుంటున్నా రెండూ బీసీల ప్రయోజనాలకు ద్రోహం చేశాయని అన్నారు.
తూర్పు కాపులకు అన్యాయం
తూర్పు కాపులను కేంద్ర జాబితాలో కేవలం మూడు జిల్లాలో బిసిలుగా గుర్తించటం జరిగింది. అన్ని జిల్లాలలో తూర్పు కాపులకు కేంద్రంలో రిజర్వేషన్లు ఇవ్వమని ఏ ప్రతిపాదన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి వెళ్ళలేదు.
“తూర్పు కాపులకు ఇటు రాష్ట్ర జాబితాలో, కేంద్ర బీసీల జాబితాలో మూడు జిల్లాలకే పరిమితం చేయడం అన్యాయమని, ఈ విషయంపై తాను కేంద్ర ప్రభుత్వ మంత్రితో చొరవ తీశుకుని మాట్లాడతానని ఎంపీ జీవీఎల్ అన్నారు.
అనేక సందర్భాల్లో వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి తూర్పు కాపుల విషయంలో మాట్లాడామని చెప్పటం కేవలం డ్రామా అని ఎంపీ జీవీఎల్ అభివర్ణించారు. వారికి నిజం చిత్తశుద్ధి ఉంటే తూర్పు కాపులకు ఆంధ్ర ప్రదేశ్ అన్ని జిల్లాలో రిజర్వేషన్లు అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని సవాల్ విసిరారు.