Suryaa.co.in

Telangana

పేదలపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష

– అస్సైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు ఆపేయడం దుర్మార్గం
– సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో వైయస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజం

హైదరాబాద్‌: రాష్ట్రంలో పేదలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌ రావు ఆక్షేపించారు. ప్రభుత్వం అసైన్‌ చేసి 20 ఏళ్లు పూర్తయిన అసైన్డ్‌ భూములపై అసైనీలకు పూర్తి హక్కులు కల్పిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు ఆ అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు ఆపాలంటూ ఆదేశాలివ్వడం అత్యంత దుర్మార్గమని ఆయన స్పష్టం చేశారు.

దీర్ఘకాలంగా భూములు సాగు చేసుకుంటున్నా, ఆ రైతులకు వాటిపై ఎలాంటి హక్కు లేక, నానా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో 20 ఏళ్లు నిండిన అసైన్డ్‌ భూములపై, వాటిని సాగు చేసుకుంటున్న రైతులకు పూర్తి హక్కులు కల్పించాలని నాడు సీఎం వైయస్‌ జగన్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని జూపూడి వెల్లడించారు. ఒరిజినల్‌ అసైనీ ఎవరో వారి పేరుపై మాత్రమే రిజిస్టర్‌ చేసి వారికి మాత్రమే అమ్ముకునే అవకాశం ఇచ్చారని ఆయన తెలిపారు.

ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షలాది రైతుల పరిస్థితి గందరగోళంగా మారిందని, వారు మరిన్ని ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చిందని జూపూడి చెప్పారు. ఆ అసైన్డ్‌ భూములపై ఇప్పటికే అధికార పార్టీ నాయకులు కన్నేశారని, పలు చోట్ల వారు పేదలను బెదిరిస్తున్నారని, ఆ విధంగా భూములు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

చుక్కల భూములకు సంబంధించి చంద్రబాబు హయాంలో 22ఏ జాబితాలో పెడితే వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని తొలగించిందని జూపూడి గుర్తు చేశారు. 97 వేలకు పైగా కుటుంబాలకు చెందిన 2,06,171 ఎకరాలకు సంబంధించిన చుక్కల భూములను, వారికి పూర్తి హక్కులు కల్పించడం జరిగిందని ఆయన ప్రస్తావించారు.

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయలేక, ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు, ఈ విధంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆక్షేపించిన జూపూడి ప్రభాకర్‌రావు, పేదల పక్షాన తమ పార్టీ పోరాడుతుందని వివరించారు.

LEAVE A RESPONSE