Suryaa.co.in

Andhra Pradesh

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యం

– దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు – గ్రామాభివృద్ధి తోనే దేశాభివృద్ధి
– త్రాగు,సాగు నీటి ఎద్దడి లేకుండా చూస్తాం.. ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
– కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం

కాజులూరు : రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే అంతిమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని కూటమి పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అన్నారు.

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నందున మంత్రి ఆదేశాల మేరకు గ్రామాల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రామచంద్రపురం నియోజవర్గం కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో జరిగిన మన గ్రామం – మన మంత్రివర్యులు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని, గ్రామాల అభివృద్ధి తోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందన్నారు. గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించి ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు స్థానికులు మాట్లాడుతూ గ్రామంలో వేసవిలో త్రాగు, నీటికి ఇబ్బంది పడుతున్నామని, అలాగే శివారు ఆయకట్టుకు సాగునీటి ఎద్దడి కూడా ఉందని పలువురు రైతులు సత్యం దృష్టికి తీసుకువచ్చారు.

అర్హులైన వారికి పింఛన్లు, వ్యక్తిగత కుళాయిలు మంజూరు చేయాలని, రేషన్ కార్డులు మంజూరు చేయాలని, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. త్రాగునీటికి సంబంధించి ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు వివరిస్తూ గొల్లపాలెం గ్రామానికి త్రాగునీరు కోసం జల జీవన్ మిషన్ ద్వారా రూ.1.30 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, ట్యాంకు నిర్మాణం పూర్తి చేసి ప్రస్తుతం 430 కుళాయిలు వేసామని, రెండున్నర కిలోమీటర్లు మేర పైప్ లైన్ వేయాల్సి ఉందని, పనులు వేగవంతం చేసి సమస్య వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని తెలిపారు.

సమస్యలన్నిటిని మంత్రి సుభాష్ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానని సత్యం హామీ ఇచ్చారు. రైతులకు సాగు నీటి ఎద్దడి లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి జె. రాంబాబు, హౌసింగ్ ఏఈ శ్రీనివాస్,గ్రామ సర్పంచ్ పోతురాజు ప్రసన్న మౌనిక, వివిధ శాఖలకు చెందిన పలువురు అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE