యూరియా బస్తాల కోసం జుట్లు పట్టుకున్న మహిళలు
– నిన్న బస్సుల్లో సీట్ల కోసం.. నేడు యూరియా బస్తాల కోసం ముష్ఠి
మహబూబాబాద్: మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం పంచాయతీ పెట్టుకోవడం.. జుట్లు, జట్లు పట్టుకొని కొట్టుకోవడం చూసాం. కానీ, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో యూరియా బస్తాల కోసం ఇద్దరు మహిళలు జుట్లు, జుట్లు పట్టుకొని పొట్టు.. పొట్టుగా కొట్టుకున్నారు..
ప్రధాన రహదారిపై పొర్లాడుతూ కొట్టుకోవడం అందర్నీ విస్మయపరిచింది. చుట్టు పక్కల వారు ఆపుతున్నా ఆగకుండా కొట్టుకున్నారు. చివరకు ఇద్దరు వ్యక్తులు ధైర్యం చేసి ఆ ఇద్దరు మహిళలను బలవంతంగా ఆపారు.
మహబూబాబాద్ పట్టణం లోని వివేకానంద సెంటర్ లో గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ముందు మహిళలు, పురుషులు ఆధార్ కార్డు జిరాక్స్ లు పట్టుకొని పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఒకరికొకరు నెట్టు కోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ సమయం లోనే ఇద్దరు మహిళలు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు వాట్సప్ లో వైరల్ గా మారాయి.