Suryaa.co.in

Andhra Pradesh

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైసీపీ ప్రభుత్వంలో ఒక మిధ్యే

– స్థానిక సంస్థలలో సమాంతర వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాటిని సర్వనాశనం చేస్తున్నారు
– అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ జపం చేస్తున్న జగన్ రెడ్డి అభివృద్ధిపై ఖర్చు పెట్టాడో చెప్పగలడా?
– మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

జగన్ రెడ్డి చెబుతున్నదొకటి చేస్తున్నది మరోటి. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న అభివృద్ధి వికేంద్రీకరణ ఒక హాస్యాస్పదంగా తయారైంది. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నామంటూ సచివాలయాలను ఏర్పటు చేసిన జగన్ రెడ్డి ఆ సచివాలయాల్లో నిధులు లాక్కోవడం దుర్మార్గం. 14, 15 వ ఆర్ధిక సంఘం నిధులు రూ.7500 కోట్లు, పంచాయతీల సాధారణ నిధులు రూ. 3,500 కోట్లు మొత్తంగా దాదాపు రూ.11,000 కోట్లు దారిమళ్లించడం ఆర్ధిక నిబంధనల ఉల్లంఘన కాదా?

స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు లేకుండా వాటి ద్వారా పౌర సేవలు అందించడం ఏ విధంగా సాధ్యపడుతుంది. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలు, నగర పాలక స్థానిక సంస్థల అభివృద్ధి, పరిపాలన గురించి రాజ్యాంగంలో 73, 74 వ రాజ్యాంగ సవరణలతో ఏర్పాటు చేసిన ఆర్టికల్ 243 G, 243 W ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తుంగలో తొక్కారు.

వైసీపీ ప్రభుత్వం 11, 12 వ షెడ్యూల్స్ లో ప్రస్తావించిన అంశాలను కూడా బుట్టదాఖలు చేసింది. 73, 74 రాజ్యాంగ సవరణలు స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తి కోసం ఏర్పాటు చేశారనే విషయం జగన్ రెడ్డికి తెలుసని నేను అనుకోవడం లేదు. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ఆర్ధిక సంఘాలు జాతీయ స్తాయిలోని కానీ, రాష్ట్ర స్తాయిలో కానీ ఆయా కన్సాలిడేటెడ్ నిధులను స్థానిక సంస్థలకు పంపకాలు చేయాలి. ఆర్టికల్ 243 (I) గ్రామ పంచాయతీలకు, ఆర్టికల్ 243 (Y) అర్బన్ లోకల్ బాడీలకు ఆర్ధిక సంఘం నిధులు కేటాయించాలని చాలా స్పష్టంగా చెబుతున్నాయి.

రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలనే ప్రాధమిన నిబంధనను వైసీపీ ప్రభుత్వం కాలారాసింది. స్థానిక సంస్థల చట్టాలను, రాజ్యాంగ నిబంధనలను అమలు చేయకుండా అభివృద్ది వికేంద్రీకరణ ఏ విధంగా సాధ్యమో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పాలి. స్థానిక సంస్థల పరిపాలనను నాశనం చేస్తూ వాటి స్థానంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం అప్రజాస్వామికం.

స్థానిక సంస్థలకు చెందాల్సిన నిధులను లాక్కోవడం, వాటి అభివృద్దిని అడ్డుకోవడం జగన్ రెడ్డి నియంత పాలనకు నిదర్శనం. ప్రజలపై చెత్తపన్ను వేసి వారిపై మోయలేని భారాలు వేయడం తప్పా వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు చేసిందేమి లేదు. స్థానిక సంస్థలకు పరిపాలన స్వేచ్చా, ఆర్ధిక స్వావలంభన లేకుండా మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమేనా? గ్రామ స్వరాజ్యం అనే గాంధీజీ కల వైసీపీ ప్రభుత్వంలో ఒక మిధ్య గానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది.

జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలను, వాటి ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులను అపహాస్యం చేసింది. స్థానిక సంస్థలలో బడుగు, బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నాయకత్వం ఎదగకుండా జగన్ రెడ్డి రాజకీయ అడ్డంకులు సృష్టిస్తున్నారు. స్థానిక సంస్థలలో ఈ వర్గాలకు స్థానం లేకుండా చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఈ వర్గాల నుంచి నాయకత్వం ఎదిగే పరిస్థితి ఉండదు. అభివృద్ది వికేంద్రీకరణ అంటే స్థానిక సంస్థలపై వాలంటీర్ల పెత్తనం నియమించడం కాదు. జగన్ రెడ్డి తన సొంత మనుషులను పెట్టుకుని స్థానిక సంస్థలపై పెత్తనం చెలాయించడం మాని బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాల నాయకత్వం ఎదిగేందుకు అవకాశం కల్పించాలి.

వైసీపీ ప్రభుత్వం ప్రజలచేత ఎన్నుకోబడిన సర్పంచులు, చైర్మన్ లు, మేయర్లు హక్కులను కాలరాస్తూ వారికి సమాంతరంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం దుర్మార్గం. స్థానిక సంస్థల నిధులను పీడీ ఖాతాలకు మళ్లించుకుంటూ ప్రభుత్వం అజమాయిషీ చేస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణపై మాట్లాడే నైతిక హక్కు జగన్ రెడ్డికి లేదు. అభివృద్ధి అంటే మూలధన వ్యయం చేయడం. జగన్ రెడ్డి మూడేళ్లలో క్యాపిటల్ వ్యయం పై రూ. 20 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు.

క్యాపిటల్ వ్యయం చేయనప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని ఏ విధంగా చెబుతుంది?. బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు నివసించే ప్రాంతాలలో మౌళిక సదుపాయాల కల్పనకు కేటాయించిన వేల కోట్ల నిధులు దారిమళ్లించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి నిధులు కూడా నవరత్నాలకు మళ్లించుకుంటూ ఈ వర్గాలను నిలువు దోపిడీ చేస్తున్నారు. మూడేళ్లలో ఆ వర్గాల కార్పొరేషన్ల నుంచి ఒక్క రూపాయి లోను ఇచ్చిన దాఖలాలు లేవు.

ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్డానాలను నెరవేర్చాలంటే స్థానిక సంస్థలకు ఆర్ధిక స్వావలంభన చాలా అవసరం. స్థానిక సంస్థలకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు వారి హక్కులను, వారి నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలంటే ఇకనైనా ముందుకొచ్చి వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై పోరాటం చేయాలి.

LEAVE A RESPONSE