ఐపీఎల్-2024 చాంపియన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ అవతరించింది. విజేతగా నిలవాలన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలు నెరవేరలేదు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్లో పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ అన్ని రంగాల్లో విఫలమైంది.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ టైటిల్ సమరంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ స్వల్ప స్కోరును కాపాడుకునేందుకు సన్ రైజర్స్ విఫలయత్నం చేసింది.
114 పరుగుల విజయలక్ష్యాన్ని కోల్ కతా జట్టు 10.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ విధ్వంసక ఇన్నింగ్స్ తో కోల్ కతా విజయంలో కీలకపాత్ర పోషించాడు. వెంకటేశ్ అయ్యర్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మరో ఎండ్ లో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. గుర్బాజ్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 39 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 6 (నాటౌట్) పరుగులు చేశాడు. అంతకుముందు, ఓపెనర్ సునీల్ నరైన్ 6 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
ఈ విజయంతో కోల్ కతా నైట్ రైడర్స్ పదేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ టైటిల్ గెలవడం కోల్ కతాకు ఇది మూడోసారి. కేకేఆర్ జట్టు గతంలో 2012, 2014లోనూ ఐపీఎల్ చాంపియన్ గా అవతరించింది. కాగా, విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు రూ.20 కోట్లు, రన్నరప్ గా నిలిచిన ఎస్ఆర్ హెచ్ జట్టుకు రూ.13 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది.
కన్నీటి పర్యంతమైన కావ్యా మారన్
తమ జట్టు ఫైనల్ మెట్టు వరకు వచ్చి ఓటమిపాలవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్యా మారన్ కన్నీటిపర్యంతమయ్యారు. ఉబికి వస్తున్న కన్నీటిని దాచలేక, ఆమె కెమెరాలకు కనిపించకుండా ఉండేందుకు అవతలి వైపుకు తిరిగి నిలుచున్నారు. కన్నీటిని తుడుచుకుంటూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.