-దొరికితే పోలీసులమని బుఖాయింపు
-రివర్స్ కేసులు నమోదు
-నన్ను చంపడానికి రెక్కీ వేశారు
-ప్రతి దానికి హత్య పరిష్కారమని భావించే సీఎం ఉండడం దురదృష్టకరం
-ప్రతిపక్ష నేతలు స్పందించాలి
-నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి ఎత్తుకెళ్లి చంపడానికి పథక రచన చేశారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు. రెక్కీ నిర్వహించిన వారు దొంగ పోలీసులని, దొరికితే పోలీసులమని చెప్పి బుకాయించి, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సహకారంతో రివర్స్ కేసులను పెడుతున్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఇప్పటికే లేఖ రాశానని, కెసిఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు. కెసిఆర్ పై తనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉందని చెప్పారు. తన మకాం ఢిల్లీలో పెట్టినప్పటికీ సీఎం కేసీఆర్ పరిపాలనపై నమ్మకంతోని అప్పుడప్పుడు హైదరాబాదుకు వెళ్లి వస్తున్నానని వివరించారు. తాను స్టీఫెన్ రవీంద్ర వ్యవహారంపై ముఖ్యమంత్రికి లేఖ రాసి, ఆ విషయాన్ని సీఎంఓ కార్యాలయ కార్యదర్శి నర్సింగ్ రావు తో, రాజ్యసభ సభ్యుడు సంతోష్ దృష్టికి తీసుకు వెళ్లేందుకు, ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశానని తెలిపారు. పోలీసుల వ్యవహార శైలిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్న ఆయన, న్యాయస్థానాలు ఉన్నాయని, తన అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. ఏ అక్రమాలకైనా రెడీగా ఉండే సునీల్ కుమార్, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, 32 కేసుల్లో ఉన్న ముఖ్యమంత్రి కలిసి, స్టీఫెన్ రవీంద్ర తో కలిసి తనను హత్య చేయడానికి కుట్రపన్నారని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాను హైదరాబాదులో ఉండగానే అర్థరాత్రి నెంబర్ ప్లేట్ లేని వాహనంలో రెక్కీ నిర్వహించారని తెలిపారు. రెక్కీ నిర్వహించిన వాహనం గురించి తెలుసుకునేందుకు సీసీ ఫుటేజ్ కోరగా, గచ్చిబౌలి ఇన్ స్పెక్టర్ సురేష్ ఇవ్వవద్దని చెప్పాడని, ఎమ్మార్ ప్రాపర్టీస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తెలిపారని రఘురామ పేర్కొన్నారు. వై కేటగిరి, తాత్కాలిక జెడ్ కేటగిరి భద్రత కలిగిన, వీఐపీ ప్రాణరక్షణకు భద్రత కల్పించాల్సింది పోయి, సీసీ ఫుటేజ్ ఇవ్వద్దని ఒక ఇన్ స్పెక్టర్ వారించడం ఏమిటని నిలదీశారు. తన ఇంటి వద్ద తచ్చాడుతున్న అనుమానాస్పద వ్యక్తిని, తన రక్షణ సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగిస్తే తాము చేసిన ఫిర్యాదు పై కేసు నమోదు చేయడం మాని, అనుమానాస్పద వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు తో తమపైనే కేసు నమోదు చేయడం ఏమిటోనని విస్మయం వ్యక్తం చేశారు. తనకు తానే కానిస్టేబుల్ అని చెప్పిన సదరు వ్యక్తి, ఐడి కార్డు చూపించమంటే మీడియాకు ముఖము చూపించకుండా దాచుకున్నారన్నారు. అటువంటి వ్యక్తిని తాను కర్రతో కొట్టినట్లుగా, డొక్కలో గుద్ది ఐడి కార్డు లాక్కొని, ఉంగరం, పర్సు గుంజుకున్నానని చెప్పి ఫిర్యాదు చేయగానే సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడంపై రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై స్కాష్ పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు.
సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కనుసన్నలలో గచ్చిబౌలి సీఐ సురేష్ కుమార్ ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, స్టీఫెన్ రవీంద్రలు చిన్ననాటి స్నేహితులని, స్టీఫెన్ రవీంద్ర గతంలో రాయలసీమలో కూడా పనిచేశారన్నారు. అతన్ని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించాలని జగన్మోహన్ రెడ్డి శతవిధాలుగా ప్రయత్నించారని తెలిపారు. అయితే ప్రభుత్వ నిబంధనలు అంగీకరించకపోవడంతో, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన సహకారంతో… ఏపీ పోలీసుల అండదండలతో తనని డైరెక్ట్ గా చంపడానికే ప్లాన్ వేశారన్నారు. ప్రతిదానికి హత్య పరిష్కారమని భావించేవాడు మన ముఖ్యమంత్రి అయ్యాడని ఆందోళన వ్యక్తం చేశారు. చూద్దాం… హత్యా రాజకీయాలు ఎన్నాళ్లు కొనసాగిస్తాడో నని వ్యాఖ్యానించారు. పోలీసులతో ఎలాగో హత్య చేయించాలని చూస్తున్నారని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు, తాను అప్రమత్తంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ నరహంతకుడు… పోలీసు హంతకులతో కలిసి నాకేదైనా హానీ తల పెడితే… ఈ ఉన్మాదిని ఏమి చేయాలన్నది ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. ప్రజలే న్యాయ నిర్ణేత లన్న ఆయన, ఈ విషయంలో ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించాలని కోరారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా, ఇతర విపక్షాల నాయకులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ప్రజాస్వామ్యవాదులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలను ఖండించాలని విజ్ఞప్తి చేశారు.
రైలు బోగీ దహనం చేయాలన్నది వారి ప్లాన్
సత్తెనపల్లి వద్ద తాను ప్రయాణించే రైలు బోగీని 1000 మంది తన సామాజిక వర్గం వారికి పురమాయించి, దహనం చేసి తన హత్యకు ప్లాన్ చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ నరహంతకులు ఎంత కైనా తెగిస్తారని తెలిసే, తన జాగ్రత్తలు తాను తీసుకున్నట్లు తెలిపారు.. తన మతాన్ని తాను ప్రేమించడం తప్పా? అంటూ ప్రశ్నించారు. మీ మతాన్ని ద్వేషించడం లేదు కదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రలు కలిసి తనను భౌతికంగా నిర్మూలించేందుకు కుట్ర చేశారని వెల్లడించారు.
స్కూళ్ళు కనబడటం లేదని విద్యార్థుల గగ్గోలు
తమ స్కూలు కనబడటం లేదు బాబోయ్ అంటూ విద్యార్థులకు గగ్గోలు పెడుతున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈ ముఖ్యమంత్రి టీచర్లకు జీతాలు ఇవ్వలేక, వారి పోస్టులను కుధిస్తున్నారని చెప్పారు. చిన్నారులు చదువుకుంటేనే దేశం భవిష్యత్తు బాగుంటుందని ప్రవచనాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా స్కూళ్లు, టీచర్ పోస్టులను ఎత్తివేయడం ఏమిటంటూ మండిపడ్డారు. పాఠశాలలను ఎత్తివేసి, పాఠశాలల భవనాలు, స్థలాలను అమ్ముకుంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. రేపు ఉంటుందో లేదో తెలియని బైజుస్ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకుని, నాణ్యమైన విద్య కోసమే ఖర్చుకు వెనుకాడకుండా బైజుస్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బైజుస్ సంస్థ పబ్లిక్ ఇష్యూ కోసం, ముఖ్యమంత్రి ఇదంతా చేస్తున్నారని… ఓటేశాం కాబట్టి ఈ దరిద్రపు, కక్షపూరిత పాలనను అనుభవించక తప్పదన్నారు.
పత్రికా ప్రకటనలే కాకుండా… సాక్షికి అలవెన్స్లు కూడానా?
గత మూడేళ్లలో సాక్షి దినపత్రికకు 300 కోట్ల రూపాయల పత్రికా ప్రకటనలను ఇచ్చారని, జిల్లా ఎడిషన్ లలో ప్రకటనలు అదనమని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ప్రభుత్వంతో ఏదైనా పని చేయించుకున్న వారు నేరుగా డబ్బులు ఇవ్వలేకపోతే, వారితో జిల్లా ఎడిషన్లలో ప్రకటనలు ఇప్పించుకొని డబ్బులు సంపాదించారని చెప్పారు. ఇక ఇప్పుడు మూడు లక్షల మంది వాలంటీర్లకు 200 చొప్పున ప్రభుత్వ నిధులను కేటాయించి, ఆ నిధుల ద్వారా సాక్షి దినపత్రిక కొనుగోలు చేసేలా ప్లాన్ చేశారని వెల్లడించారు.