Suryaa.co.in

Editorial

నాడు రాహుల్‌.. నేడు బాబు

– పరాజితులను విమర్శించడంపై హుందాతనం చూపిన నేతలు
– బాబు ఓడిన తర్వాత ఆయనపై వైఎస్‌ విమర్శల వర్షం
– శరపరంపరగా కాంగ్రెస్‌ నేతల యుద్ధం
– వైఎస్‌ సహా అందరినీ వారించిన రాహుల్‌
– బాబును విజనరీ అని కీర్తించిన రాహుల్‌
– రాజనీతిజ్ఞుడని ప్రశంసించిన రాహుల్‌
– బాబును విమర్శించవద్దని హెచ్చరించిన వైనం
– హుందాతనంగా ఉండాలని క్లాసు
– ఇప్పుడు అదే బాటలో చంద్రబాబు
– ఓడిన వారిని విమర్శించవద్దని హితవు
– హుందాగా వ్యవహరించాలని పిలుపు
– ఆధునిక రాజకీయాల్లో కనిపించని హుందాతనం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆధునిక రాజకీయాల్లో హుందాతనం కరువయి.. దానిస్థానంలో కక్ష-కార్పణ్యాలు రాజ్యమేలుతున్న ఈ కాలంలో, కొద్దిగా ఊరట కలిగించే ఘటనలు మెరుపులా మెరిసి మాయమవుతుంటాయి. ఎడారిలో ఒయాసిస్సు మాదిరిగా! అలాంటిదే ఇది కూడా. అదేమిటో చూద్దాం రండి.

తెలంగాణను పదేళ్లు ఏకబిగిన పాలించిన బీఆర్‌ఎస్‌, తాజా ఎన్నికల్లో పరాజయం పాలయింది. సీఎం కేసీఆర్‌ కూడా ఒకచోట ఓడి, మరోచోట గెలిచారు. మంత్రుల్లో చాలామంది ఓటమిపాలయ్యారు. ఇక బీఆర్‌ఎస్‌ ప్రత్యర్ధులు ఆ పార్టీని, కేసీఆర్‌ను ఆడేసుకోవడం ప్రారంభించారు. మీ లెక్కలు తేలుస్తామని, మింగినవన్నీ కక్కిస్తామని హెచ్చరికలు జారీ చేయడం మొదలెట్టారు. అహంకారానికి ఆత్మగౌరవం ఇచ్చిన తీర్పు అని వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్‌ ఫ్యామిలీకి చిప్పకూడు తప్పదన్న మాటల వరకూ వెళ్లారు.

దానిని కాంగ్రెస్‌ నేతలవెవరూ నివారించే ప్రయత్నం చేయలేదు. అఫ్‌కోర్స్‌.. ఎన్నికల ముందు కేసీఆర్‌ ఫ్యామిలీ తలబిరుసు వ్యాఖ్యలు కూడా, దానికి తగినట్లే ఉన్నాయనుకోండి. కానీ ఓటమిపాలైన వారిని ఇంకా కుంగదీయడం నైతికం కాదు కదా?

ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫలితాల అనంతరం బాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘‘ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిద్దాం. గెలిచిన వారిని అభినందించండి. ఓడిన వారిని పలుచన చేయవద్దు. ఓడిన వారిని పలచల చేసేలా వ్యాఖ్యానించవద్దు. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం’ అని ట్విట్టర్‌ ద్వారా, తెలంగాణ తమ్ముళ్లకు సందేశం ఇచ్చారు. బాబు వ్యాఖ్యలు అటు కాంగ్రెస్‌ను అభినందిస్తూనే, ఇటు ఓడిన బీఆర్‌ఎస్‌కు ఓదార్పు సందేశం ఇచ్చినట్లు కనిపిస్తోంది.

నిజానికి చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యారు. ఆ సమయంలో వైఎస్‌ సహా చాలామంది యువనేతలు చంద్రబాబుమీద, పార్టీ మీద విమర్శల వర్షం కురిపించారు. వెటకారం చేశారు. అయితే దానిని వైఎస్‌ సహా సీనియర్లు ఎవరూ వారించలేదు.

ఆ సమయంలో కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ దిద్దుబాటకు దిగారు. ‘‘చంద్రబాబు రాజనీతిజ్ఞుడు. విజనరీ పర్సన్‌. రాజకీయాల్లో ఓడినంత మాత్రాన వ్యక్తిగత విమర్శలు హుందాతనం అనిపించుకోదు. మీరెవరూ చంద్రబాబు ఓటమిపై వ్యాఖ్యలు చేయవద్దని’’ విస్పష్టమైన ఆదేశాలివ్వడంతో కాంగ్రెస్‌ నేతల నోళ్లు బందయిపోయాయి. ఏదేమైనా తాజా గెలుపు ఓటమిపై చంద్రబాబు వ్యాఖ్యలు.. భూతద్దం పెట్టి వెతికినా కనిపించని రాజకీయాల్లో హుందాతనం కనిపించడం లేదని వాపోయే వారికి కొద్దిగా ఊరట.

LEAVE A RESPONSE