Suryaa.co.in

Political News

లొంగుబాటు సిద్ధాంతం!

ఇక్కడ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా..!?
అతను మా వైపుకు రావాలి, మా యందు భక్తితో మెలగాలి, మాకు పూర్తిగా లొంగి ఉండాలి. మా ముందు ఒంగి ఉండాలి.
మావాడు అని మేము అనుకుంటే బ్యాంకులను లూటీ చేసిన సరే ఖండాంతరాలను దాటనిస్తాం.మావాడు అని మేము అనుకుంటే దేశంలోని ఆస్తులను, వనరులను వాడికి కట్టబెడతాం.
మావాడు అని మేము అనుకుంటే వాడు ఎంతటి తప్పటోడైనా, ఎంతటి నేరగాడైనా, ఎన్ని కేసులు ఉన్నా సరే.. దర్జాగా బయటకు తిరగనిస్తాం, కేసుల నుండి ఉపశమనం కలిగిస్తాం, చూసి చూడనట్టు వదిలేస్తాం.
********************

మాకు ఎదురు తిరిగినా లేదా మమ్మల్ని లెక్క చేయకపోయినా మా తడాఖా చూపిస్తాం.
మా వైఫల్యాలను ఎత్తి చూపినచో, మీ చిన్న తప్పు నైనా సరే భూతద్దంలో చూస్తాం, ప్రజలకు చూపిస్తాం.
మమ్మల్ని ప్రశ్నిస్తే సిబిఐ, ఈడీలను పంపిస్తాం. ఏ విధంగానైనా మిమ్మల్ని లొంగదీసుకుని తీరుతాం.
మాకు సవాలుగా మీరు మారితే నిరాధారమా/ఆధారమా మాకు అనవసరం. ఆరోపణలు మాత్రం మీ మీద ఉంటాయి, మీపై కేసులు సిద్ధంగా ఉంటాయి ‘సామ దాన భేద దండోపాయాలను’ ఉపయోగిస్తాం.

*************************
ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ అతడు మాకు లొంగడం లేదు. సానుకూలంగా ఉంటున్నట్లు ప్రవర్తిస్తున్నాడే గాని, మాకు పూర్తిగా అతనిపై నమ్మకం కలగడం లేదు. రేపటి రోజున దేశ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేయగలడు. భారతదేశంలోనే సీనియర్ నాయకుడు, ప్రపంచమే మెచ్చిన నాయకుడు.

అందరినీ లొంగదీసుకునేందుకు మేము వేసే వేషాలు, చేసే పనులు అతని పట్ల చేస్తే.. యావత్తు దేశంలోనే నమ్మకాన్ని కోల్పోతాము, కొరివితో తల గోక్కున్నట్టే. అందుకే… అదే రాష్ట్రంలో మన దత్తపుత్రుడు అధికారంలో ఉన్నాడు. దత్తపుత్రుడిని అడ్డం పెట్టుకుని ఆటాడుకుందాం. 73 ఏళ్ల వయసులో ఇబ్బందులు పెడదాము, 42 సంవత్సరాల రాజకీయ చరిత్రలో లేని మచ్చను అంటగడదాము. మాకు శరణు కోరితే స్పందిద్దాం. లేదా చోద్యం చూస్తూ ఉందాం.

ఓ నా ప్రియమైన దత్తపుత్రా.. నీ కేసుల నుండి నీకు ఉపశమనం కలిగించాము, నీవు చేస్తున్న తప్పులకు సహకరించాము, రాష్ట్రాన్ని వల్లకాడులా చేస్తున్నా చూసి చూడనట్టు ఉన్నాము, నీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాము. దానికి బదులుగా మీ రాష్ట్రంలోని కొన్ని ఆస్తులను, రాష్ట్ర వనరులను మాత్రమే మా వాళ్లకి అప్పగించేలా చేసాము.
అందుకే నా ప్రియమైన దత్తపుత్రా.. నీ మనసులో ఏదైతే ఉందో.. ఒక మహోన్నతమైన వ్యక్తిని చెరసాల వెనకాల చూడాల న్న నీ చిరకాల వాంఛను తీర్చుకో.. మాకు కూడా అది సమ్మతమే.
******************

పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ.. ప్రపంచం తనని చూడడం లేదు అనే విధంగా వీరి చేతులకు మసి అంటుకోదు, వీరిపై ఎటువంటి నింద ఉండదు అని భావిస్తున్నారు.
సగటు రాష్ట్ర పౌరునికి, సామాన్యమైన ప్రజానికానికి కుట్ర కోణాలు అర్థమయ్యాయా..?
ఎందుకు అర్థం కావు ? రాష్ట్ర ప్రజలు పిచ్చివారు కాదు కదా?!

– కంకణాల శ్రీనివాస్

LEAVE A RESPONSE