చనిపోయిన పార్టీ మాకు డెడ్ లైన్లు పెట్టడమేంటి

– పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు భయపడే వ్యక్తులు ఇక్కడ ఎవరూ లేరు
– ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీకి పెట్టొచ్చు కదా
– ‘జానీ’లు చూపిస్తే భయపడతారేమో చూడమనండి
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, నవంబర్ 2: రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు భయపడే వ్యక్తులు, శక్తులు ఎవరూ లేరని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జ్ఞానోదయం కలిగిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నేపథ్యంలో ఉద్యమం చేయడానికి ఇప్పటికైనా ముందుకు వచ్చారని, పవన్ కళ్యాణ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డెడ్ లైన్లు పెట్టడం కాదన్నారు. చనిపోయిన పార్టీ జనసేన మాకు డెడ్ లైన్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్ళి నరేంద్రమోడీకి డెడ్ లైన్లు పెట్టమనండంటూ సలహా ఇచ్చారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వారం రోజుల్లో ఆపకపోతే ఏదో ఒకటి చేస్తానంటూ గతంలో నటించిన జానీ వంటి పాత సినిమాలను వాళ్ళకు చూపించాలన్నారు. వాటిని చూసి నరేంద్రమోడీ భయపడతారేమో చూడాలన్నారు. జనసేన చచ్చిపోయిన పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ డెడ్ లైన్లు పెట్టుకుంటాడన్నారు. అది డెడ్ పార్టీ కదా, రెండు చోట్ల పోటీ చేసి ఆయనే గెలవలేదని అన్నారు. చచ్చిన పార్టీ డెడ్ లైన్లు పెట్టక ఏ లైన్లు పెడుతుందని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.