మంత్రి హరీశ్ రావు
ఉన్నత ఆశయాల కోసం మీ సంఘం పని చేయాలని కోరుతున్నాను.
గురువు లేనిదే విద్య లేదు.. విద్య లేనిదే జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోతే.. ఈ లోకం మనుగడే ఉండదు..అంతటి గొప్పతనం గురువులదని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. వనస్థలిపురంలో నిర్వహించిన స్టేట్ టీచర్స్ యూనియన్ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకులు కూనంనేని సాంభశివ రావు, చాడ వెంకట్ రెడ్డి, టీచర్ సంఘం అధ్యక్షులు సదానందగౌడ్, ఇతర నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు ఏమన్నారంటే.. బాధ్యత గల పౌరులను సమాజానికి అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. అందరం కలిసి కట్టుగా పని చేద్దాం.మీ ఆకాంక్షలను ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చుతుంది. కేంద్రం మోడల్స్ స్కూల్స్ విషయంలో చేతులు ఎత్తితే ప్రభుత్వం నడిపిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యధికం ప్రాధాన్యం ఇచ్చింది. కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తుంటారు.
తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్రంలో కేవలం 298 రెసిడెన్షియల్ విద్యాలయాలు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం దశల వారీగా సంఖ్యను పెంచుతూ 1201 కి చేర్చింది. అంటే ఐదు రెట్లు పెంచింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో గురుకులాల కోసం కేటాయించిన బడ్జెట్ 385 కోట్లు మాత్రమే,తెలంగాణ ప్రభుత్వం 2022-23 నాటికి 3,250కోట్లకు పెంచింది. అంటే గురుకుల విద్య కోసం కేటాయించిన నిధులను సుమారు పది రేట్లు పెంచింది. బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు చెందిన పేదవిద్యార్థుల విద్యావికాసం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ గారికి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు ఇది నిదర్శనం. 2014లో 1,12,667 మంది విద్యార్థులు మాత్రమే ఈ గురుకులాల్లోచదువుకునేవారు.నేడు వారి సంఖ్య 5,40,366 కి పెరిగింది. ఈ గణాంకాలు ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో విద్యారంగంపై పని చేస్తోందో చెప్పడానికి. గురుకులంలో చదువుకున్న విద్యార్థుల్లో 486 మంది ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీట్లు సాధించారు. 786 మంది నిట్, ట్రిపుల్ ఐటీ ఇంకా పేరొందిన విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. 791 మందికి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు.
అటవీ శాఖలో దేశంలోనే తొలిసారి యూనివర్సిటీ పెట్టాం
మన ఊరు మన బడి ద్వారా రూ. 7289 కోట్లతో 26 వేల ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసుకునే కార్యక్రమం ప్రారంభించాము. తెలంగాణ వచ్చాక 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించాము. రాష్ట్రం వచ్చిన నాడు ఎంబిబిఎస్ సీట్లు 850 మాత్రమే ఉంది అది ఇప్పుడు 2950కి పెరిగినయ్ అంటే అది కేవలం ముఖ్యమంత్రి గారి ఆలోచన ముందుచూపు వల్లే సాధ్యమైంది. వైద్య ఆరోగ్యశాఖలో అనేక వైద్య విద్య కోర్సులు ఉంటాయి డాక్టర్లు నర్సులు బీఫార్మసీ ఎం ఫార్మసీ దంత వైద్య కోర్సులు ఇట్లా అనేకమైన కోర్సుల్లో విద్యని రాష్ట్రంలో అందరికీ అందించాలని ముందుకు వెళుతున్నాము. అటవీ విశ్వ విద్యాలయం, గిరిజనుల కోసం ప్రత్యేకంగా లా రెసిడెన్షియల్ కాలేజ్, అగ్రికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీ, విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్లు.. ఇలా అనేక మార్గాల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యపై ఖర్చు చేస్తున్నది. కానీ 5 శాతం మాత్రమే బడ్జెట్లో పెట్టినట్లు మాట్లాడటం సరికాదు. మొత్తంగా చూస్తే బడ్జెట్లో 10శాతం కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. 2014-15 లో అన్ని శాఖల ద్వారా విద్యపై చేసిన ఖర్చు 9518 కోట్లు కాగా ఈ ఏడాది నవంబర్ వరకు 17500 కోట్లు ఖర్చు చేసింది. బడ్జెట్ లో పెట్టుకున్న 25,250 కోట్లు ఖర్చు చేసేందుకు సరైన ప్లాన్ తో ఉన్నాం.ఒక్క విద్య వైద్య రంగాల్లోనే కాదు తెలంగాణ అని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
ఇక ఉద్యోగుల విషయంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ ప్రభుత్వం. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్య వచ్చినా ఇప్పటివరకు మా ప్రభుత్వమే పరిష్కరించింది. ఇకపై కూడా పరిష్కరించేది మా ప్రభుత్వమే. కరోనా పరిస్థితులు, కేంద్రం సహాయ నిరాకరణ వంటి కారణాల వల్ల కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని సీఎం గారు చూసుకుంటున్నారు.
మొదటి సారి 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వగా, 11వ వేతన సవరణ ద్వారా 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటించాము. మన పక్కన ఉన్న ఏపిలో కంటే ఇది ఎక్కువ. కేజీబీవీల్లో సమస్యలను ప్రభుత్వం పరిష్కరించింది. ఇంకా కూడా వారి సమస్యలను పరిష్కరిస్తాం.ఒకటో తారీఖు జీతం వస్తలేదంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. 17వేల కోట్లకు కోత పెట్టింది. బాయిలకాడ మీటర్లు పెట్టము అంటే 12000 కోట్లకు కోత పెట్టింది. 15వ ఆర్థిక సంఘం చెప్పినా కూడా 5300 కోట్లు ఆపింది. ఇలా మొత్తం 40 వేల కోట్లు హక్కుగా వాటాగా రావాల్సింది నిలిపి వేసింది.
భారత దేశంలో అతి ఎక్కువ జీతాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు. ఏకపక్షంగా 40వేల కోట్లను కేంద్రం కోత పెట్టింది. కొంత మంది మాట్లాడుతుంటారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం వచ్చింది అని. ఏ పల్లెకు పోయినా, ఏ కుగ్రామానికి పోయినా స్వచ్ఛమైన నీరు, కరెంట్, రోడ్లు , ప్రకృతి వనాలు ఇలా అనేకం కనిపిస్తాయి. రాష్ట్రం ఏర్పడకముందు కోటి 34 లక్షల సాగు భూమి ఉంటే, 2 కోట్ల 3 లక్షలకు విస్తరించాం. భూమికి బరువు అయ్యే పంట పండుతున్నది తెలంగాణలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు మాకు బియ్యం ఇవ్వండనీ అడుగుతున్నాయి.
ఒకప్పుడు ఏపీ అన్నపూర్ణ అన్నారు. కాని సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దక్షిణ భారతానికి ధాన్యాగారం మారింది. నాడు 68 లక్షల టన్నుల ధాన్యం పండితే, ఇప్పుడు 2.49 కోట్ల టన్నుల ధాన్యం పండింది. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, మిషన్ భగీరథ ఇలా అనేక కార్యక్రమాల వల్ల ఈ అభివృద్ధి జరిగింది. 33 జిల్లాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల వద్దకే పరిపాలన వచ్చింది. విద్యాశాఖలో అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం. ప్రమోషన్లు, బదిలీల విషయంలో సీఎం గారు సానుకూలంగా ఉన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో మీరు పని చేయాలని కోరుతున్నాను.మన పథకాలు కేంద్ర ప్రభుత్వానికి ఆదర్శమయ్యాయి.మిషన్ కాకతీయ అమృత్ సరోవర్ అన్నారుమిషన్ భగీరథను హర్ ఘర్ కో జల్ అన్నారు. రైతు బంధును పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అన్నారు. పశువుల కోసం అంబులెన్స్ పెడితే కేంద్రం కూడా ప్రారంభించింది.
జిల్లాకు ఒక మెడికల్ అంటే, కేంద్రం కూడా జిల్లాకు ఒక కాలేజీ అంటున్నది.తెలంగాణ ఏం ఆచరిస్తుందో, నేడు దేశం అదే ఆచరిస్తున్నది.ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది..అందరం కలిసి రాష్ట్రం కోసం పని చేద్దాం. కేంద్రం చేస్తున్న వివక్షకు వ్యతిరేకంగా పని చేద్దాం. మీ సమస్యలు పరిష్కరించేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.