– ఉద్యోగులంతా విజయవాడ, గుంటూరులోనే ఉంటున్నారు
– విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని కోసం నిర్మాణాలు చేస్తే బాగుంటుందని జగన్ చెప్పారు
– రాజధాని అనేది పరిపాలన కేంద్రం. అక్కడ ఎవరూ పరిశ్రమలు పెట్టరు
అసలు లూలూ కంపెనీ అనేది ఒక పరిశ్రమనా?
– దాని వల్ల ఎక్కడైనా ఉద్యోగాలు వచ్చాయా?
– అది వేరే చోట్ల భూమి అద్దెకు తీసుకుని మాల్స్ నడుపుతోంది
విజయవాడలో ‘వే 2 న్యూస్ కాంక్లేవ్’. సదస్సులో పాల్గొన్న వైయస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
సజ్జల రామకృష్ణారెడ్డి, వైయస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్:
ఆ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం:
విజన్ ఎవరైనా చెబుతారు. ఎన్నైనా చెప్పొచ్చు. కానీ, వాస్తవంగా 5 ఏళ్లలో ఏమేం చేయవచ్చో, అవన్నీ చేసి చూపాం. ఎక్కడా అవినీతికి తావునివ్వకుండా, ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో పథకాలు అమలు చేశాం. పరిపాలన, పౌర సేవలు, పథకాల అమలులో దేశంలో ఎక్కడా లేని విధంగా పని చేశాం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. ఈ మూడు రంగాల్లో ఎవరికి వారు అద్భుతంగా రాణించేలా కృషి చేశాం. ఆ దిశలో గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియమ్ ప్రవేశపెట్టాం. సీబీఎస్ఈ మొదలు ఐబీ వరకు సిలబస్‌లో మార్పు తీసుకొచ్చాం. స్కిల్ డెవలప్ చేశాం.
ఉన్నత విద్యా రంగంలో కూడా పెనుమార్పులకు శ్రీకారం చుట్టాం. పేద విద్యార్థుల విదేశీ విద్య కోసం కోట్లు ఖర్చు చేశాం. మేము మొదలుపెట్టిన యజ్ఞం గత ఏడాది నాటికే కొన్ని ప్రయోజనాలు చూపింది. పిల్లలకు ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం వచ్చేలా చేయడంతో, 10 ఏళ్ల తర్వాత వారు ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడే స్థాయి వస్తుంది.
ఎన్నెన్నో అభివృద్ధి పనులు:
వ్యక్తిగత అభివృద్ధి వల్ల ఒక కటుంబం పురోగమిస్తుంది. దాని వల్ల దేశమే బాగుపడుతుంది. మానవ వనరులను అభివృద్ధి చేశాం. నైపుణ్యం పెంచాం. అయితే మా హయాంలో తొలి రెండేళ్లు కోవిడ్ రాకపోయి ఉంటే, ఇంకా అభివృద్ధి చూసి ఉండే వాళ్లం. ఏ రాష్ట్రానికి లేనంతగా మనకు దాదాపు 1000 కి.మీ తీర ప్రాంతం ఉంది. స్వాతంత్య్రానంతరం మనకు కృష్ణపట్నం, గంగవరం పోర్టులు రాగా, కాకినాడ చాలా చిన్న యాంకరేజ్ పోర్టు.
దీంతో మా ప్రభుత్వ హయంలో ప్రధాన పోర్టుల పనులన్నీ చేపట్టాం. కేవలం మూడేళ్లలో రామాయపట్నం దాదాపు పూర్తి చేశాం. భావనపాడు (మూలపేట) పోర్టు సగం పూర్తి చేశాం. మచిలీపట్నం పోర్టు పనులు మొదలుపెట్టాం. అవన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చగలిగే స్థాయిలో ఉన్నాయి.
ఇంకా 10 ఫిషింగ్ హార్బర్లు కట్టాం. మా ప్రభుత్వం రెండోసారి వచ్చి ఉంటే, మేము చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూరై్త ఉండేవి. 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టాం. వాటిలో 7 కాలేజీలు పూర్తి చేశాం. మిగిలిన వాటి పనులు పురోగతిలో ఉన్నాయి.
ఇంకా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనుకున్నాం. అవన్నీ జరిగితే, 2029 నాటికి రాష్ట్రం ఒక స్థాయిలో ఉండేది. అది కదా విజన్ అంటే. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి. దాన్ని విజన్ అంటారా? లేక లక్ష కోట్లు తెచ్చి, రాజధాని ప్రాంతంలో బహుళ అంతస్తుల్లో టవర్లు కడతామంటే విజన్ అంటారా?
ఒక్క పరిశ్రమ అయినా తరలిపోయిందా?:
మా మీద పారిశ్రామికవేత్తలకు నమ్మకం లేకపోతే, అన్ని పరిశ్రమలు ఎందుకు వస్తాయి? ఎంఎస్ఎంఈ రంగంలో అంత అభివృద్ధి ఎలా సాధ్యం? మా వల్ల ఒక్కటంటే ఒక్క కంపెనీ అయినా తరలి పోయిందా? ఉంటే చెప్పండి. అసలు లూలూ కంపెనీ అనేది ఒక పరిశ్రమనా? దాని వల్ల ఎక్కడైనా ఉద్యోగాలు వచ్చాయా? అది వేరే చోట్ల భూమి అద్దెకు తీసుకుని మాల్స్ నడుపుతోంది.
మాపై నాడు విపక్ష టీడీపీ విపరీతంగా దుష్ప్రచారం చేసింది. మేము రూ.14 లక్షల కోట్ల అప్పులు చేశామని నిందలు వేశారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని దుమ్మెత్తి పోశారు. కానీ, వాస్తవ అప్పు చాలా తక్కువగా ఉంది. ఆ వాస్తవాలు వెల్లడయ్యాయి.
ఔనన్నా, కాదన్నా.. రాష్ట్రంలో ఉన్నవి రెండే ప్రధాన పార్టీలు. వైయస్సార్సీపీ, తెలుగుదేశం. అయితే చెప్పింది చేయడంలో మాతో వారు సరికారు.
చంద్రబాబు ఏనాడూ తన హామీలు నిలబెట్టుకోలేదు. గత ఎన్నికల్లో కూడా మా కంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తామన్నారు. కానీ గెల్చాక, ఏ ఒక్కటీ అమలు చేయలేదు. అదే జగన్ చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు. చేసేదే చెప్పారు. చెప్పింది చేశారు.
మరోవైపు చంద్రబాబుకు ఏ మాత్రం విశ్వసనీయత లేదు. ఆయన ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదు. అలాగే ఏనాడూ ఆయన హామీలు నిలబెట్టుకోలేదు. నిజంగా మా హయాంలో పరిశ్రమలు ఏవైనా తరలి పోయాయా? ఉంటే చెప్పండి. ధైర్యంగా వివరించండి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మాపై నిందలు వేస్తూ, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇది దారుణం. మళ్లీ చెబుతున్నాను. లూలూ అనేది కంపెనీ కాదు. ఒక సూపర్‌మార్కెట్ మాత్రమే. రాజధాని అనేది పరిపాలన కేంద్రం. అక్కడ ఎవరూ పరిశ్రమలు పెట్టరు.
రాజధాని పేరుతో అప్పులు సరికాదు:
నాడు కూడా రాజధానిపై జగన్ క్లారిటీగా ఉన్నారు. ప్రభుత్వ భూమి ఉంటే, 30 వేల ఎకరాలు అయినా ఫరవాలేదన్నారు. ఇక్కడ రాజధాని అన్నారు కాబట్టే, ఆరోజు జగన్ ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నారు. కానీ, ఎప్పుడైతే ఇక్కడ నిర్మాణాలు మొదలుపెట్టారో.. ఎదురైన ఇబ్బందులు, దారుణంగా పెరుగుతున్న నిర్మాణ వ్యయం చూశాక పరిస్థితి అర్ధమైంది.
ఇంకా ఇప్పుడు కూడా రాజధాని కోసం ఆ స్థాయిలో అప్పులు కాకుండా, కేంద్రం నుంచి నిధులు సమీకరించి, అవసరమైన నిర్మాణాలు చేయొచ్చు. ఇప్పటికే లక్ష కోట్ల అప్పు చేశారు. ఇంకా లక్ష కావాలి. అవన్నీ ప్రజలపై పడే భారమే కదా? అసలు మనకు ఉన్న ఆదాయ వనరులెన్ని? అప్పు ఎలా తీరుస్తారు? భూములు అమ్ముతామంటున్నారు. అంత ధరకు ఎవరు కొంటారు? ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు.
అందుకే విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని కోసం నిర్మాణాలు చేస్తే బాగుంటుందని జగన్ చెప్పారు. నాడు మూడు రాజధానులు అన్నప్పుడు కూడా, ఇక్కడ అమరావతిని పూర్తిగా విడిచిపెట్టలేదు. ఇక్కడే రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు అవసరం లేదు. అందుకే విశాఖ, కర్నూలును ప్రస్తావించారు. అవి కూడా మన రాష్ట్రంలోనే ఉన్నాయి కదా?
నిజానికి మా హయాంలోనే రోడ్ల నిర్మాణం జరిగింది.
జగన్ స్పష్టంగా చెప్పారు. లక్షల కోట్ల అప్పు చేసి రాజధాని పేరుతో అమరావతిలో ఖర్చు చేయొద్దు. అది ప్రజలపై భారం వేస్తుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బ తీస్తుందని.. అందుకే విజయవాడ–గుంటూరు మధ్య డెవలప్ చేయొచ్చని చెప్పారు. కానీ, ఆ పని చేయకుండా ఐకానిక్ టవర్స్ అంటూ లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు. మరోవైపు నిర్మాణ వ్యయం దారుణంగా పెంచారు. గతంలో ఉన్న సంస్థలకే ఆ పనులు అప్పగించారు.
ఈ విషయంలో చంద్రబాబు ఆలోచన సరికాదు. ఆయన రాష్ట్రంపై చాలా అప్పుల భారం వేస్తున్నారు. నిజానికి అమరావతిలో రాజధాని అంటున్నా, అక్కడ ఎవరూ ఉండడం లేరు. ఉద్యోగులంతా విజయవాడ, గుంటూరులోనే ఉంటున్నారు. నిజానికి మా ప్రభుత్వ హయాంలోనే విజయవాడ చాలా అభివృద్ధి చెందింది. నగరంలో ఫ్లైఓవర్లు నిర్మించాం. కృష్ణా నదికి రీటెయిన్ వాల్ కట్టాం.
అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి:
2024 ఎన్నికల తర్వాత, ఒక్క ఏడాదిలోనే చంద్రబాబు పాలనతో పాటు, ఆయన చేసిన విధ్వంసాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. తమను ఆయన దారుణంగా మోసం చేశారని ప్రజలు చాలా గట్టిగా నమ్ముతున్నారు. అందుకే కేవలం ఒక ఏడాదిలోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత కనిపిస్తోంది. యూరియా దొరక్క రైతులు రోడ్డెక్కుతున్నారు. అన్ని వర్గాల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తగదు:
మా ప్రాధాన్యాలకు సంబంధించి మాకు స్పష్టత ఉంది. అలాగే మెడికల్ కాలేజీల విషయంలో కూడా. ప్రజలకు విద్య, వైద్యం కీలకం. అవి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఎక్కువగా ఉండాలి. అందుకే జగన్‌గారు 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి, 7 కాలేజీలు పూర్తి చేసి చేతిలో పెడితే, వాటిని ప్రైవేటుపరం చేస్తామంటే నష్టపోయేది ఎవరు? ప్రజలు కదా? అందుకే జగన్‌గారు చాలా స్పష్టంగా చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామని. అడ్డుకుంటామని.
అందుకే అలా మాట్లాడాల్సి వస్తోంది:
ఇంకా పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో చూడండి. ఎంత దారుణంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. అరెస్టు చేస్తున్నారో చూడండి. చంద్రబాబు కక్ష కట్టి వ్యవహరిస్తున్నారు. దానికి పోలీసులు వంత పాడుతున్నారు. అందుకే అనివార్య పరిస్థితుల్లో అలా మాట్లాడాల్సి వస్తోంది.
మాది ఒక్కటే స్పష్టమైన అభిప్రాయం. వ్యక్తి అభివృద్ధి చెందితే, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదే వైయస్సార్సీపీ లక్ష్యం, ఉద్దేశం. అంతేతప్ప, అప్పు చేసి టవర్లు, బిల్డింగ్స్ కట్టడం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
అప్పులు ఎక్కువ అనడం సరికాదు: బుగ్గన రాజేంద్రనాథ్
ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగింది. దీంతో విభజిత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం మీదే ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సర్వీస్ సెక్టర్, పారిశ్రామిక రంగం ఎక్కువగా హైదరాబాద్‌లో ఉండి పోయింది. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 35 శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉండగా, అది 5 ఏళ్లలో 40 శాతానికి చేరింది. అదే సమయంలో సర్వీస్ సెక్టర్ వాటా తగ్గింది.
2019–2021 వరకు చూస్తే, కేంద్రం కూడా చాలా అప్పు చేసింది. అప్పుడు కేంద్ర అప్పు జీడీపీలో దాదాపు 60 శాతానికి చేరింది. కాబట్టి, రాష్ట్రం అప్పులు ఎక్కువ చేసిందని చెప్పడం సరికాదు. ఇంకా 2015–19 వరకు చూస్తే మనకు కేంద్రం నుంచి 3.7 శాతం వాటా రాగా, ఆ తర్వాత 2019–24 మధ్య అది కేవలం 3 శాతమే వచ్చింది. అది కొన్ని వేల కోట్లకు సమానం.
మరోవైపు కేంద్రం అప్పులు చూస్తే.. స్థూల ఉత్పత్తిలో ఎప్పుడైనా 50 శాతం కంటే తక్కువగా ఉంటుంది. కానీ, అది 2020–21లో ఏకంగా 60.7 శాతానికి చేరింది. అదే సమయంలో అన్ని రాష్ట్రాలు ఎక్కువ అప్పు చేశాయి. ఇంకా కేంద్రం నుంచి పన్నులు, ఇతర ఆదాయాల్లో మనకు 2014–19 మధ్య 47 శాతం వాటా రాగా, ఆ తర్వాత 5 ఏళ్లలో 2019–24 మధ్య 46 శాతమే వచ్చింది.
ఆ 5 ఏళ్లు ఆర్థిక క్రమశిక్షణ లేదు:
ఎప్పుడైనా పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలి 10 ఏళ్లు చాలా కీలకం. కానీ మన రాష్ట్రంలో తొలి 5 ఏళ్లు ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఆ తర్వాత 2019–24 మధ్య మా ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల అభివృద్ధి కోసం పని చేశాం. కానీ, ఆ సమయంలో అప్పు ఎక్కువ పెరిగిందన్న ప్రచారం అవాస్తవం. నాడు మా ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి, చాలా ఖర్చు చేశాం. దాని వల్ల చాలా వేగంగా ఫలితాలు వస్తాయి. ఆ దిశలో మేము పని చేశాము. పిల్లల మీద మేం చేసిన ఖర్చు, ఒక పెట్టుబడి లాంటిది. దాని వల్ల భవిష్యత్తు బాగుంటుంది.
ఇప్పుడు దారుణ అప్పులు:
ఈ ప్రభుత్వ నిర్ణయాలు, ప్రాధాన్యం చూస్తే, అప్పు చాలా చేస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఆ 5 ఏళ్లలో మేము చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, ఈ ప్రభుత్వం కేవలం 15 నెలల్లో చేసిన అప్పు ఏకంగా రూ.1,91,361 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 57.5 శాతం, చంద్రబాబు కేవలం ఈ 15 నెలల్లోనే చేశారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం, ఎప్పుడు ఏం చెప్పినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెబుతూనే, లక్షల కోట్ల అప్పుతో నగర నిర్మాణం చేస్తోంది.