– కరెంటు కోతలు మోపైనయి.. మంచి నీళ్లు వస్తలే. . ఇట్లనే ఉంటదా రాజ్యం ?
– రిటైర్ మెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా ఇస్తలేరు
– ప్రతి ఒక్కరికీ మేలు జరిగే వరకు బి ఆర్ ఎస్ పార్టీ రక్షణ కవచంలా నిలుస్తుంది
-రూపాయి ఆదాయం లేకపోయినా రైతు బంధు ఆపకుండా ఇచ్చినం
– సర్వే లో 75శాతం మంది బి ఆర్ ఎస్ పాలనే బాగుందని అన్నరు
– ప్రజా పోరాటాల్లో నేను కూడా పాల్గొంటా
మళ్ళీ తెలంగాణలో వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే
– బి.ఆర్.ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు
ఎర్రవెల్లి: తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఉదృతంగా ప్రత్యక్ష ప్రజాపోరాటాలు లేవదీయాల్సిన సమయం ఆసన్నమైందని బి.ఆర్.ఎస్ అధినేత , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బి ఆర్ ఎస్ అని , రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు జరిగే వరకు బి ఆర్ ఎస్ పార్టీ రక్షణ కవచంలా నిలుస్తుందని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం జరాసంగం మండలం మేదపల్లి గ్రామం నుండి వందలాది మంది ఉద్యమ కారులు, బి ఆర్ ఎస్ నాయకులు , అభిమానులు కేసీఆర్ ని కలవడానికి గత ఐదు రోజులుగా 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, శుక్రవారం ఎర్రవెల్లి లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు . ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశానికి బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ హాజరై ప్రసంగించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 14 నెలలు ఓపిక పట్టామని , వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు పాలనతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ళ పాటు ఉద్యమాలు చేసి పోరాడితే తెలంగాణ వచ్చిందని, ఆ వచ్చిన తెలంగాణను పదేళ్లలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి అన్ని రంగాలను అభివృద్ధి చేసి ఒక గాడిలో పెట్టిందని గుర్తు చేశారు. బి.ఆర్.ఎస్ హయాంలో దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపితే … కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనలో తెలంగాణను నాశనం చేస్తూ, ప్రజలను అరిగోస పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ వచ్చిన ఆరేడు నెలల్లోనే బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ప్రజలకు 24 గంటల కరెంటు సరఫరా చేసిందని , పెద్ద పెద్ద సిపాయిల్లాగా భావించే కాంగ్రెస్ వాళ్ళు గతంలో ఆ పని ఎందుకు చేయలేకపోయారని కేసీఆర్ ప్రశ్నించారు .
“ప్రాజెక్టుల ద్వారా సాగు నీళ్లు , మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగు నీళ్లు ఇచ్చుకున్నం . నీటి తీరువా రద్దు చేసినం . చెరువులు బాగు చేసినం, మల్లన్న సాగర్ వంటి ఎన్నో రిజర్వాయర్లు నిర్మించుకున్నం . రైతు బీమా వంటి పథకం పెట్టి ఒక గుంట భూమి రైతు చనిపోయినా అతని కుటుంబాన్ని ఆదుకున్నం. గొర్రెల కాపరులకు గొర్లు పంపిణీ చేసినం. కరోనా వంటి సమయంలో కూడా రూపాయి ఆదాయం లేకపోయినా రైతు బంధు ఆపకుండా ఇచ్చినం . రైతుల కోసమే నాలుగైదు మంచి పథకాలు పెట్టి ఆదుకున్నం. తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ మనోళ్లే అని అనేక సంక్షేమ పథకాలతో కంటికి రెప్పలా చూసుకున్నం. ఇప్పుడు అన్నీ పోయినయి. కాంగ్రెస్ పాలనలో మళ్ళీ మొదటికి వచ్చింది. వాళ్ళు ఇప్పుడు అన్ని రంగాలను నాశనం చేస్తున్నరు . ” అని బి.ఆర్.ఎస్ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు.
బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఏటా పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది. ఇప్పుడు పదమూడు వేల కోట్ల ఆదాయం తగ్గిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ ) నివేదిక వెల్లడించింది . ఇంకా కొంత కాలం గడిస్తే రాష్ట్రం తీవ్ర ఆర్ధిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని ఆర్ధిక నిపుణులు తెలియజేస్తున్నరు . రిటైర్ మెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా సరిగా ఇస్తలేరు ” అని బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు .
“అన్ని వర్గాల పేద పిల్లల కోసం గురుకులాలు ఏర్పాటు చేస్తే వాటి నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది . ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నరు . కాంగ్రెస్ పార్టీ ముస్లిం ల ఓట్లు వేయించుకుంది కానీ వాళ్ళ బాగోగులను గుర్తించలేదు . ఇమామ్ లు మౌజం లకు కనీసం వేతనాలు ఇవ్వాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ వాళ్లకు రాలేదు. మళ్ళీ పాత కాంగ్రెస్ మోపైంది . కరెంటు కోతలు మోపైనయి . మంచి నీళ్లు వస్తలే . ఇట్లనే ఉంటదా రాజ్యం ” అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు .
గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకున్నం , మంచి నీళ్లు తెచ్చుకున్నం . జహీరాబాద్ నియోజక వర్గంలో సంగమేశ్వర , బసవేశ్వర లిఫ్టులను బి ఆర్ ఎస్ ప్రభుత్వం మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పనులు ఆపి రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నది … రైతులకు నష్టం జరుగుతుంటే ఆ జిల్లా మంత్రి ఏం చేస్తున్నడని ప్రశ్నించారు. రైతులను భారీ స్థాయిలో సమీకరించి ఉద్యమం చేపట్టాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావుకు కేసీఆర్ సూచించారు .
“తెలంగాణ సాధించిందే గులాబీ జెండా . ప్రభుత్వంలో ఉండి దేశంలో ఎవరూ చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది బి ఆర్ ఎస్ ప్రభుత్వం . ఇక ప్రజల సమస్యల విషయంలో నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షమించేది లేదు . ఇటీవల కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సర్వే చేస్తే పోలింగ్ లో 75 శాతం మంది బి ఆర్ ఎస్ పాలనే బాగుందని అన్నరు . తెలంగాణ శక్తి ఏందో చూపెట్టడానికి ఫిబ్రవరి నెలలో బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనను సమీక్షిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు . అందరూ కేసీఆర్ నే యాది చేస్తున్నారని మైనార్టీ సోదరులు కూడా చెబుతున్నారు.
కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు పడిపోతున్నయి . బి ఆర్ ఎస్ హయాంలో మారుమూల ప్రాంతంలో కూడా ఎకరానికి 40-50 లక్షలు విలువ ఉండే . ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తరు . వీళ్ళ మెడలు వంచాల్సిందే . ప్రజా పోరాటాల్లో నేను కూడా పాల్గొంటా ” అని కేసీఆర్ పేర్కొన్నారు .
జహీరాబాద్ నుండి 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వచ్చిన పార్టీ నాయకులు , అభిమానులు పాదయాత్ర చేసి ఎర్రవెల్లి కి వచ్చారంటే.. బి ఆర్ ఎస్ పార్టీ తెలంగాణలో ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు . ఇలాంటి బిడ్డలే తెలంగాణ జాతిరత్నాలు . బి ఆర్ ఎస్ కు పట్టుగొమ్మలు . మీ కష్టం వృధాపోదు . మళ్ళీ తెలంగాణలో వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే . బి ఆర్ ఎస్ విజయం కేవలం పార్టీ విజయం కాదు. బి ఆర్ ఎస్ విజయం తెలంగాణ రైతుల విజయం. తెలంగాణ పేద ప్రజల విజయం ” అని బి ఆర్ ఎస్ అధినేత పేర్కొన్నారు .
ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వహించిన మాజీ సర్పంచులు పరమేశ్వర్ పాటిల్ , బోయిని చంద్రయ్య , బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సంగమేశ్వర్ నాయకులు ప్రశాంత్ , బోయిని శ్రీనివాస్ , ప్రదీప్ తదితరులు బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గారిని శాలువాతో సత్కరించి కేతికి సంగమేశ్వర స్వామి ఆలయ ప్రసాదం అందజేశారు.
కేసీఆర్ సార్ ను చూడాలని , వారిని కలవాలని , వారితో మాట్లాడాలని 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీ నాయకులు , అభిమానులు రావడం అభినందనీయమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాణిక్ రావు , సునీతా లక్ష్మారెడ్డి , చింతా ప్రభాకర్ , మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి , డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు .