Suryaa.co.in

Telangana

పొంకనాలు కొట్టుడు కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి రా!

– అసెంబ్లీకి రా లెక్కలు చెబుతాం
– కేసీఆర్ కాలం చెల్లిన వెయ్యి నోటు
– సరిగ్గా నిలబడటం నేర్చుకో
– అచ్చోసిన ఆబోతుల్లా కొడుకు, అల్లుడిని ఊరిమీదకు వదిలిండు
– మార్చి 31 లోగా రూ.10 వేల కోట్లు రైతు భరోసా వేస్తాం
– కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్

అసెంబ్లీ ఎన్నికలను అడ్డు పెట్టుకుని రైతు బంధు ఎగ్గొట్టిన చరిత్ర కెసిఆర్ ది. ఆయన ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల ఖాతాలో వేశాం. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ కేవలం రూ.18వేల కోట్లు మాత్రమే. ఇందులో మిత్తికి పోగా నికరంగా ఆయన చేసిన రుణమాఫీ కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే.

కానీ మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 21వేల కోట్లు రుణమాఫీ చేశాం. మేం రుణమాఫీ చేయలేదంటున్న కేసీఆర్ ఫాం హౌస్ కు వచ్చినోళ్లకు జోలి చెప్పుడు కాదు. అసెంబ్లీకి రా లెక్కలు చెబుతాం. రైతుల జాబితాతో సహా మేం చేసిన రుణమాఫీ లెక్కలు చూపిస్తాం. నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా. నీలా ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి పంగనామాలు పెట్టిన చరిత్ర నాది కాదు. ఆయన గంభీరంగా చూస్తున్నడట…ఎవరిని చూస్తున్నావ్?

అచ్చోసిన ఆబోతుల్లా కొడుకు, అల్లుడిని ఊరిమీదకు వదిలిండు. జహంగీర్ పీర్ దర్గాకు, వేములవాడ రాజన్నకు నిధులు ఇస్తానని మోసం చేసినవ్. పాలమూరును ఎరవేసి ఎండబెట్టిన దుర్మార్గుడు కెసిఆర్. మా ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ జరిగింది, రైతు భరోసానూ ఇస్తున్నం. మార్చి 31 లోగా రూ.10 వేల కోట్లు రైతు భరోసా వేస్తాం. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తాం.

మొదటి ఏడాదిలోనే 55142 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిది. నీ నాయకత్వంపై నీకు నమ్మకం ఉంటే అసెంబ్లీకి రా. కొడితే బలంగా కొట్టడం సంగతి పక్కకు పెడితే, సరిగ్గా నిలబడటం నేర్చుకో. ట్విట్టర్ లో ఈయనకు లైకులు ఎక్కువ వచ్చాయని చెప్పుకుంటుండు.

పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సోషల్ మీడియాలో లైకులు వచ్చాయని చెప్పుకుంటుండు అంటే ఆయన మానసిక స్థితి ఎట్లుందో అర్థం చేసుకోండి. కేసీఆర్.. ముందు నీ కొడుకును, అల్లుడిని దారిలో పెట్టుకో. బీసీ కులగణన, మాదిగ వర్గీకరణపై ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ పెడుతున్నాం. పొంకనాలు కొట్టుడు కాదు. దమ్ముంటే అసెంబ్లీకి రా మాట్లాడుకుందాం. ఫాం హౌస్ లో ఉన్న కెసిఆర్ కు ప్రజలతో బంధం తెగిపోయింది. కెసిఆర్ కాలం చెల్లిన వెయ్యి నోటు. కేసీఆర్ ..మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే, ఫామ్ హౌస్ లోనే పడుకో.

LEAVE A RESPONSE