Suryaa.co.in

Andhra Pradesh

దొంగ ఏడుపులు.. దొంగ రాజకీయాలు!

(చాకిరేవు)

భద్రత కల్పిస్తోన్నా.. లేదు లేదంటూ జగన్ బుకాయింపులు
ప్రతిపక్ష నేత హోదా లేకున్నా.. మాజీ సీఎంగా జగన్ను గుర్తిస్తున్న కూటమి ప్రభుత్వం
ప్రోటోకాల్ ప్రకారం జగనుకు భద్రత కల్పిస్తున్న పోలీసులు
ఇవిగో జగన్ భద్రతా లెక్కలంటోన్న ఏపీ ప్రభుత్వం
పరదాలు కావాలా..? చెట్లు నరకాలా.. అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో వ్యంగ్యాస్త్రాలు
రప్పా రప్పా కామెంట్లకు జగన్ సమర్ధన
లా అండ్ ఆర్డరుకు విఘాతం కల్పిస్తే చూస్తూ ఊరుకోద్దని స్పష్టం చేసిన ప్రభుత్వ పెద్దలు

అమరావతి, జూన్ 24: ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనే సామెతను మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన విధానంగా మార్చుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి మొదలుకుని.. ఇప్పటి వరకు వైసీపీది ఇదే పంథా. ప్రతి సందర్భంలోనూ డ్రామాలు.. ప్రతి విషయంలోనూ నాటకాలే. మొన్నటి బాబాయ్ వివేకా హత్య మొదలుకుని.. ఇటీవల భధ్రత తనకు కల్పించలేదంటూ జగన్ చేస్తున్న బూటకపు ఆరోపణల వరకు అంతా బుకాయింపులే.

తాను మాజీ సీఎంనని.. తనకు ప్రొటోకాల్ ఉంటుందని.. తనకు కల్పించాల్సిన భద్రతను కూడా కల్పించలేదంటూ జగన్ మోహన్ రెడ్డి నంగనాచి కబుర్లు చెబుతున్నారు. దొంగ ఏడుపులు ఏడుస్తూ ట్వీట్లు చేస్తున్నారు. జగన్ పర్యటనలు చూస్తుంటే.. జగనుకు భద్రత కాదు.. జగన్ నుంచి.. ఆయన సైకో మూక నుంచి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకున్నా.. ఆయనకు మాజీ సీఎం హోదా ఉంది కాబట్టి.. కూటమి ప్రభుత్వం ప్రొటోకాల్ పాటిస్తోంది. అలాగే ప్రజాస్వామ్యంలో నిరసనలకు అవకాశం ఇవ్వాలనేది మూల సిద్దాంతం. దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ పర్యటనలకు ఆయనకు ఇవ్వాల్సిన భద్రతను కల్పిస్తున్నాం. సైకో మూకలను వెంటపెట్టుకుని వెళ్తోన్నా.. బ్లేడ్, గంజాయి, బెట్టింగ్ ముఠాలను పరామర్శించేందుకు వెళ్తూ.. రెచ్చగొడుతున్నా.. ప్రభుత్వం సంయనం పాటిస్తోంది.

కేడరును రెచ్చగొడుతూ.. సైకోలను వెంటేసుకుని తిరుగుతూ.. తన కారు కిందే తన కార్యకర్తను తొక్కించుకుంటూ వెళ్లిన జగన్.. తాను చేసిన పనికి సిగ్గు పడాల్సింది పోయి.. పశ్చాత్తాపం చెందాల్సింది పోయి.. మారు మనస్సు పొందాల్సింది పోయి.. కన్ఫెషన్ బాక్సులోకి వెళ్లి చేసిన తప్పులు ఒప్పుకోవాల్సింది పోయి.. తిరిగి ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తనకు రక్షణ కల్పించలేదని బుకాయిస్తూ.. పిల్లి కూతలు కూస్తున్నారు. జగన్ చేస్తున్న ప్రతి పర్యటనకు వందల సంఖ్యలో భద్రత కల్పిస్తోంది ప్రభుత్వం. తన పర్యటనలకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వకున్నా మాజీ సీఎంకు ప్రొటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన భధ్రతను కూటమి ప్రభుత్వం కల్పిస్తూనే ఉంది. పరదాలు, చెట్లు కొట్టే సంస్కృతికి స్వస్తి పలకడమే కాదు.. ప్రత్యర్ధి పార్టీల హౌస్ అరెస్టులు, ప్రతిపక్ష నేత ఇంటి గేట్లకు తాళ్లు కట్టే సంస్కృతికి కూటమి ప్రభుత్వం వ్యతిరేకమనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. జగన్ చేపడుతున్న ప్రతి యాత్రకు పర్మిషన్లు ఇవ్వడమే కాకుండా.. దానికి తగ్గ భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది.

రాప్తాడు, సత్తెనపల్లి, తెనాలి, పొదిలి, గుంటూరు మిర్చియార్డు, కడప, పులివెందుల, సత్యసాయి జిల్లాల్లో జగన్ పర్యటనకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో భద్రత కల్పించింది. అలాగే త్వరలో జగన్ చేపట్టబోయే నెల్లూరు పర్యటనకు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది. సెక్టార్ వైజ్ రూట్ ప్రకారం పోలీస్ యంత్రాంగం బందోబస్తు చేపడుతోంది. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి నుంచి హోం గార్డు స్థాయి ఉద్యోగుల వరకు జగన్ పర్యటనలకు డ్యూటీలను కేటాయిస్తోంది. జగన్ రాప్తాడు పర్యటనకు వెళ్లినప్పుడు.. 506 మంది పోలీస్ సిబ్బంది.. ఐదు స్పెషల్ పార్టీ టీంలు, రెండు ఏపీఎస్పీ బెటాలియన్ల టీములను కేటాయించింది. సత్తెనపల్లికి పర్యటనకు వెళ్లినప్పుడు 679 పోలీస్ సిబ్బంది.. 15 రోప్ పార్టీలను పెట్టింది. ఇక మిర్చియార్డ్ పర్యటన చేసినప్పుడు.. 123 మంది పోలీసులను, రెండు రోప్ పార్టీల టీములను పెట్టింది. తెనాల పర్యటనకు 122 మంది పోలీసులతోనూ.. రోప్ పార్టీలతోనూ భద్రత కల్పించింది. ఇక పొదిలి పర్యటనకు 156 మంది సిబ్బంది.. రోప్ పార్టీ టీంలతో భధ్రత కల్పించింది. సత్యసాయి జిల్లాలో జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే.. 394 మంది సిబ్బందితో భద్రత ఇచ్చింది. చివరకు పులివెందులలో ఆయనింటికి వెళ్లినా.. 71 పోలీస్ సిబ్బందిని.. రోప్ పార్టీలను ఏర్పాటు చేసింది. ఇదే కాకుండా.. జగన్ త్వరలో నెల్లూరు పర్యటన చేపట్టబోతున్నారు. దీనికి అవసరమైన భధ్రత కల్పిస్తామని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వం ఈ స్థాయిలో జగన్ పర్యటన కోసం.. ప్రొటోకాల్ ప్రకారం భద్రత కల్పిస్తోంటే.. సైకో మూకలతో పర్యటనలకు వెళ్తోన్న జగన్ మాత్రం మిర్చి టిక్కిలు తొక్కిస్తున్నారు. పొగాకు బేళ్లను నాశనం చేస్తున్నారు. సైకో మూకలతో భద్రతకు వచ్చిన పోలీసులపై రాళ్లతో దాడులు చేయిస్తున్నారు. అంతే కాకుండ.. సామాన్య మహిళల పైనా దాడులు చేస్తున్నారు.

రప్పా, రప్పా నరికేస్తాం అంటూ రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు పెడుతున్నారు.. ఆ ఫ్లెక్సీలు పెడితే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. కత్తులు పట్టుకుని వీరంగం వేస్తున్నారు. అవి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వం సంయమనం పాటిస్తోంటే.. వైసీపీ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది.

పద్దతి ప్రకారం.. ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వం వ్యవహరిస్తోంటే.. శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా చేస్తోందని ప్రభుత్వం సీరియస్సుగా ఉంది. రాజకీయంగా కామెంట్లు చేస్తే కొంత వరకు సహించవచ్చు కానీ.. శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

LEAVE A RESPONSE