సనాతన వైదిక ధర్మ సంస్కృతి వ్యతిరేకులారా!జరా బుద్ధితో అలోచించండి?

ఇటీవల కాలం లో శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి పేరిట సనాతన ధర్మం యొక్క ఉనికిని ప్రశ్నించే వారు అధికమైపోయారు.వారికి వంత పాడుతూ తమ స్థాయిని పెంచుకునేలా, కొన్ని దృశ్య శ్రవణ ప్రసార మాధ్యమాలు కూడా ఇలాంటి చర్యలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న విషయం మనం అందరం చూస్తూనే ఉన్నాము.ఈ సందర్భముగా కొన్ని ముఖ్య విషయాలను విశ్లేషించదలచుకుందాము.

1. సనాతనధర్మం యొక్క ఉనికి ని ప్రశ్నించే వారు ముందు వారు ఏ ధర్మం పట్ల విశ్వాసం కలిగి యున్నారో స్పష్టత ఇవ్వాలి.
2. అసలు సనాతన ధర్మాన్ని సరిగ్గా అవగాహన చేసుకున్నారా లేక విమర్శించే వారి స్వీయ కల్పనా అన్నది కూడా స్పష్టత ఇవ్వాలి.
3. కొంత మంది ముందు ఒక సారి వెనుక ఒక సారి మను ధర్మ శాస్త్రం లో అలా వుంది ఇలా వుంది తప్పు కాదా అని గొప్పగా ప్రశ్నిస్తున్నారు. అసలు నిజానికి వీరు చదివే ఆ మను ధర్మ శాస్త్రం ఎవరు రాశారు వారి నిబద్దత ఏమిటో అంటే సమాధానం ఉండదు.
4. కొంతమంది మరో ముందడుగు వేసి అసలు వేదాలలో జ్యోతిష్యం లేదు అంటారు. దీని పుట్టుక అంతా మరొక చోట , ప్రస్తుతం మనం దాన్ని దొంగిలించి వాడుకుంటున్నాము అన్నట్లు గా మాట్లాడుతున్నారు. మళ్ళీ దీనికి ఆధారం ఏంటి అంటే అదుగో అక్కడ చరిత్ర అంటారు.
అంటే కొన్ని వందల సంవత్సారాల క్రితం ఎవరి చేతో వ్రాయబడి పరంపర లో చరిత్ర గా మారినప్పుడు ఆ చరిత్ర వీరికి సైద్ధాంతిక ఆధారం అయినప్పుడు , ఎవరి చేత వ్రాయబడక ప్రణవం నుండి అపౌరుషేయం గా పుట్టిన వేదాలు మాత్రం చరిత్ర గా మాత్రం వీరికి కనబడవు. కనబడినా దాన్ని కప్పేసి కావాలని వాటిపై రచ్చ చేస్తూ ఉంటారు.
5. ఇక పురాణాల లో కుల దూషణ ఉంది అని మరొక వాదన. అదెక్కడో చూపమంటే మాత్రం నీళ్లు నములుతారు. అష్టాదశ పురాణాలలో గానీ , చతుర్వేదములలో గానీ ఎక్కడా వర్ణ దూషణ లేదు అన్నది చాలా స్పష్టం.
6. ఇక పోతే ప్రతీ దానికి రామాయణం, మహాభారతం, భాగవతం ఇత్యాది ఇతిహాసాల లో పేర్కొన్న కొన్ని జరిగిన సంఘటనలను వక్రీకరించి , దానికి తమ స్వీయ మేధస్సు జోడించి చిత్తానుసారం పేర్కొనే సందర్భాలు కోకొల్లలు.

ఇలాంటి వారికి తెలియంది ఏమిటంటే ఇతిహాసం అనగా ఇది ఇలాగే జరిగింది అని , ఆయా కాలాలలో కూడా ధర్మాధర్మాల మధ్య తీవ్ర సంఘర్షణ జరిగింది అని , అంతిమంగా ధర్మమే విజయం సాధించింది అని.

ప్రస్తుత జీవనంలో మనం అప్పటి జీవన విధానాన్ని పరిశీలన చేసుకుని అందులో ఉన్న మంచిని ఆదర్శం గా ముందుకు తీసుకు వెళ్లేలా అవి మనకు గొప్ప దిక్సూచి అని మాత్రం అనుకోరు.
అయిన దానికి , కానీ దానికి ప్రతీ విషయంలో ఏదో వంక.అలాగే సైన్సు అంటారు .అసలు సైన్సు అంటే శాస్త్రం అని, ఈ శాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందడానికి పడిన పునాది ఇప్పటిది కాదు , వేద కాలం నుండి ఉంది అంటే నిరూపించమంటారు, పోనీ మీకేంటి ఆధారం అంటే అదుగో ఫలానా వాడు అంటారు.అణు సిద్ధాంతం, పరమాణు సిద్ధాంతం కనిబెట్టామని గొప్పలు చెప్పుకునే వీళ్ళు , మన జీవన కాలం వందేళ్లు కంటే పెంచే సిద్ధాంతం ఏమన్నా ఉందా అంటే అది చెప్పలేరు.

అదే కాదు ఈ అనంత విశ్వం లో కోట్లాది పాలపుంతల మధ్య ఏ ఆధారం లేకుండా ఈ భూమిని నిలిపింది ఎవరో, ఈ భూమి పై ఇన్ని లక్షల జీవరాశుల ఉనికి ఎలా సాధ్యమో చెప్పలేరు.అభివృద్ధి చెందిన వైద్య శాస్త్రం తమ మందులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి , వాటి ప్రయోగాలకు మాత్రం కొన్ని జీవాలను హింసిస్తే అది ఒప్పు, మరి ఎటువంటి హింస లేకుండా ప్రకృతి లో లభ్యమయ్యే సాధనాలతో మన జబ్బును నయం చేసే అతి ప్రాచీన విధానం మన వేదాలలో ఉంది అంటే మాత్రం నిరూపణ కావాలంటారు.

అంతెందుకు మనిషి రాసుకున్న న్యాయ వ్యవస్థ అందరికీ సమానం కదా, చట్టం రూపు దిద్దుకున్నది న్యాయం సంరక్షించబడటానికే కదా.మరి అటువంటప్పుడు తెలిసి కూడా చోరుల తరపున వాదించి నిజాన్ని అబద్దం గా నమ్మించి న్యాయవస్థను కూడా, భ్రష్టు పట్టించే విధానం ఏమంటారో చెప్పండి అంటే సమాధానం ఉండదు.అంతిమంగా చెప్పదలచుకున్నది ఏమిటంటే.. నేను నమ్మిన సనాతన ధర్మం నాకెప్పుడూ సత్యాన్ని అన్వేషణ చేసి , ధర్మాన్ని ఆచరించమన్నదే తప్ప ధర్మ వ్యతిరేకం గా పనులు చేయమని ఉద్భోధించలేదు.

మరొక్క విషయం. ఈ ఉపనిషత్తులు, పురాణాలు , ఇతిహాసాలు మన ధార్మిక నడవడికను నిర్దేశిస్తాయి తప్ప అనైతిక చర్యలను ప్రోత్సహించవు.ఈ ధార్మిక ఉద్గ్రంథాలు లేని నాడు , అవి మరుగున పడిన నాడు యావత్ సృష్టి తలక్రిందులవుతుంది. పాపభీతి లేక ప్రతీ ఒక్కరు అధర్మాల పట్ల ఆకర్షితులై సృష్టి వినాశనానికి పాల్పడే ప్రమాదం ఉంది.ఎవరో అనామకులు, అల్ప జ్ఞానులు అయిన కొందరు తమకు తాము గురుస్వరూపాలు గా చెప్పుకుని మిడిమిడి జ్ఞానం తో భోదించే అసంబద్ద విషయాలను మాత్రమే పరిశీలనకు తీసుకుంటూ సనాతన ధర్మాన్ని విమర్శించడం మీ అత్మ సాక్షికైనా తగునా?

ధర్మాన్ని రక్షిస్తే అది మనలని రక్షిస్తుంది.భగవంతుడు ఏ రూపంలో ఉన్నా , అది ఏ ధర్మమైనా మంచినే బోధిస్తుంది.అందుకే ఇప్పటికీ మానవత్వపు పరిమళాలు ఈ అవనీతలం పై శాశ్వతం విస్తరిస్తున్నాయి.
కొందరి అధార్మిక, అనైతిక , అసంబద్ధ చర్యల వల్ల ఈ మానవ జీవన సమాజం మధ్య విద్వేషాగ్నులు రగలకుండు గాక .విశ్వమానవ సౌభ్రాతృత్వానికి ప్రతీ ఒక్కరి సహకారం అవసరమని విశ్వసిస్తూ
ధర్మో రక్షతి రక్షితః

Leave a Reply