మొన్న శని , ఆది , సోమ (6,7,8 తేదీలు )వారాలు యూకేలో సెలవులు. బయటకు వెళ్లి, వారి జీవన శైలిని గమనించే అవకాశం కలిగింది.
* లండన్ నుంచి ఈడెన్బెర్గ్ (స్కాట్ ల్యాండ్ ముఖ్య పట్టణం ) , గ్లాస్గో , విండెర్ మీర్ , వెంబ్లీ వంటి ప్రదేశాలకు ఆ మూడు రోజుల్లో దాదాపు 2 వేల కిలో మీటర్ల దూరం టూరిస్టు బస్సు లో తిరిగాను . కొన్ని వేల కార్లు , ట్రక్కులు , బస్సులు ఆ సమయంలో మమ్మల్ని దాటుకుంటూనో .. ఎదురుగానో ప్రయాణించి ఉంటాయి . కానీ హార్న్ శబ్దం అనేది వినపడలేదు. ఒక్క సారి అంటే ఒక్క సారి కూడా వినపడలేదు .
* ఏ ఇద్దరూ …. ఏ విషయం పై అయినా రోడ్ మీద గానీ , పబ్లిక్ ప్లేస్ లో గానీ , ఫుట్ పాత్ మీద గానీ ఘర్షణ పడడం చూడలేదు . అలాగే రోడ్ మీద నిలబడి మాట్టాడడం కూడా కనిపించలేదు.
* నడిచే వాళ్ళు… ఖచ్చితంగా…100 శాతం ఫూట్ పాత్ మీదే నడుస్తూ కనిపించారు. పెంపుడు కుక్కలు తప్ప, వీధి కుక్క ఒక్కటీ కనిపించలేదు.
* మార్గ మధ్యంలో కొన్ని వందల ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఉన్నాయి . మనుష్య సంచారం పెద్దగా లేని ప్రాంతాలలో కూడా ట్రాఫిక్ లైట్లే . రెండు రోడ్లు కలిసే చోటు ఉంటే చాలు – అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ తప్పని సరి .
ఈ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ కనపడితే ….; అది ఏ రకమైన మోటారు వాహనం అయినప్పటికీ , నిశ్శబ్దంగా ఆగిపోతుంది . గ్రీన్ లైట్ పడితేనే వాహనాలు తిరిగి బయలు దేరుతాయి . క్యూ లో ఆగి , క్యూ లోనే బయలు దేరుతాయి. వెనుక ఉన్న వాహనాల వారు హోర్న్స్ మోగించడం , ముందు వాహనాలను క్రాస్ చేసుకుంటూ వచ్చి ముందు పెట్టడం కనిపించలేదు.
* రెండు వేల కిలోమీటర్ల ప్రయాణ మార్గంలో గానీ , షాప్ లు , రెస్టారెంట్ల వద్ద గానీ , ఇతర పబ్లిక్ ప్లేస్ లలో గానీ ఒక్కటంటే ఒక్క ఫ్లెక్సీ కూడా కనిపించలేదు .
*లాంగ్ వీకెండ్ కావడంతో వేలాది మంది బ్రిటిష్ పౌరులు, వివిధ దేశాల నుంచి టూరిస్టులుగా వచ్చిన వారు ఈ విహార యాత్రలో కనిపించారు . ఒకరి పట్ల ఒకరు అమర్యాదగా ప్రవర్తించిన వారు కనిపించలేదు . ‘రాజకీయ ప్రముఖులు ‘ అనే కేటగిరీ అస్సలు కనిపించలేదు. అందరూ పౌరులే . వారిలో ఎటువంటి ఎటువంటి హెచ్చు తగ్గులు కనిపించలేదు .
* ఈ మొత్తం ప్రయాణంలో ‘పోలీసు ‘ అనే ప్రాణి కనిపించలేదు.మూడు రోజులపాటు ….2 వేల కిలోమీటర్ల పైబడిన ప్రయాణంలో ఒక్క పోలీసు గానీ , ‘పోలీసు వారి హెచ్చరిక ‘ గానీ కనిపించలేదు .
* వారు కనిపించకపోవడం వల్ల , యాత్రికులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగలేదు .
*రోడ్లు అద్దాల్లా ఉన్నాయి . లండన్ లో గానీ , ఈడెన్ బర్గ్ లో గానీ , గ్లాస్గోలో రోడ్లు అద్దాల లాగ ఉన్నాయి కదాని ఇష్టారాజ్యంగా కార్లు , బస్సులు తోలరు . ప్రతి రోడ్ కు రెండు వైపులా ఫుట్ పాత్ లు ఉంటాయి గానీ , వాటి మీద పానీ పూరి బళ్ళు …, చిల్లర వ్యాపారాలు, పళ్ళ దుకాణాలు ఉండవు . ఖచ్చితంగా నడిచే వారి కోసమే వీటిని వాడుతున్నారు . మరి నడిచే వారు రోడ్ దాటాలి అంటే …?
* ఫుట్ పాత్ పై ఓ సిగ్నల్ బాక్స్ ఉంటుంది . అందులో ఉండే ఒకే ఒక బటన్ నొక్కితే, WAITఅని మనకు కనపడుతుంది . ఒక నిముషం లో గ్రీన్ లైట్ వెలుగు తుంది , అప్పుడు దర్జాగా రోడ్ క్రాస్ చేయ వచ్చు అన్నట్టుగా . ఆ క్షణం లో రెండు వైపులా ట్రాఫిక్ ఆగిపోతుంది. రోడ్ దాట దలుచుకున్న వారు …. అటూ, ఇటూ దాటిన తరువాతే , ట్రాఫిక్ తిరిగి మొదలు అవుతుంది.
* బ్రిటన్ అనే కాదు , అమెరికా లోనూ పౌర జీవనం ఇలాగే ఉంటుంది . యూరప్ లో ఉన్న 23 దేశాల్లోనూ ఇలాగే ఉంటుంది . సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల లోనూ పౌర జీవనానికి ఇంత గౌరవం లభిస్తుంది .
*అందుకే , అవి నాగరిక సమాజాలు అయ్యాయి .