Suryaa.co.in

Andhra Pradesh

ఇది మరో కోడి కత్తి డ్రామా

– అంతమందిలో జగన్ ఒక్కరిపైనే రాయి ఎలా విసిరారు?
– డీజీపీ, సీఎస్, ఇంటలిజన్స్ చీఫ్, విజయవాడ పోలీసు కమిషన్‌ను సస్పెండ్ చేయాలి
– అంబటి విమర్శలు అమాయకత్వానికి నిదర్శనం
– సొంత పార్టీ ప్రభుత్వంలోనే రక్షణ లేకపోతే ఆ వైఫల్యం ఎవరిది అంబటి?
– అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయలేదంటే అది మరో కోడికత్తి డ్రామానే
– కేసును సీబీఐకి అప్పగించాల్సిందే
– టీడీపీ నేత, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ

సీఎం జగన్మోహన్‌రెడ్డిపై విసిరిన రాయి, అంతమందిలో అది ఆయనకు ఒక్కడికే తగలడం, వైద్యచికిత్స అంతా మరో కోడికత్తి డ్రామానే అని మాజీ మంత్రి, సతె్తనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. దీనికి బాధ్యులైన డీజీపీ, సీఎస్, ఇంటలిజన్స్ చీఫ్, విజయవాడ పోలీసు కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయాల్సిన మంత్రి అంబటి రాంబాబు.. దానిని ఆంధ్రరాష్ట్ర ప్రజలపై దాడి అనడం ఆయన అమాయకత్వానికి నిద ర్శనమన్నారు. సొంతపార్టీ ప్రభుత్వంలో ఒక సీఎంకే రక్షణ లేదంటే, ఇక సామాన్యులకు ఈ ప్రభుత్వం ఏపాటి రక్షణ కల్పిస్తుందో ప్రజలు అర్ధం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామాతో సానుభూతి పోగుచేసుకున్న జగన్.. ఈసారి ఓడిపోతానన్న భయంతోనే రాయిదాడి నాటకానికి తెరలేపారని విమర్శించారు.

ఇంకా కన్నా ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఆగంతకులు విసిరిన రాయి ఎక్కడి నుంచి వచ్చిందో విచారించాలి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ముఖ్యమంత్రి కి సొంత పార్టీ ప్రభుత్వం లోనే రక్షణ లేకపోవడం సిగ్గుచేటు. దీనికి బాధ్యత వహిస్తూ డిజిపి సీఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ విజయవాడ కమిషనర్ పై తక్షణం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సొంత ప్రభుత్వం లోనే ముఖ్యమంత్రికి భద్రత లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి అన్న భయాందోళన కలగడం సహజం.

ఇది ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట. ఒకవైపు చాలా రోజుల నుంచి మరో కోడి కత్తి దాడి జరగబోతుందన్న వార్తలు వస్తున్నప్పటికీ, దానిని పోలీసు వ్యవస్థ ముందుగా కనిపెట్టలేకపోవడం వారి వైఫల్యానికి నిదర్శనం. కానీ అంతా చీకటిలో కూడా ఆగంతకుడు ముఖ్యమంత్రిని ఒక్కరినే టార్గెట్ చేయడం, ఆ రాయి ఆయన కంటికి తగలడం ఏమిటో ఆశ్చర్యంగా ఉంది. ఈ ఆశ్చర్యకర సంఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తే తప్ప, నిజాలు తెలిసే అవకాశం లేదు. పరదాలు దాటి బయటికి వచ్చిన ముఖ్యమంత్రికి ఇది ఎన్నికల ముందు అపశకునమే.

దీనికి బాధ్యులుగా డిజిపి ఇంటెలిజెన్స్ ఏ డి జి పోలీస్ కమిషనర్ ను గుర్తించి వారిని ఆ పదవుల నుంచి తప్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని ఎన్నికల ప్రచారానికి వెళ్ళనున్న జగన్ మోహన్ రెడ్డి పర్యటనలను సమీక్షిస్తున్న పోలీసు శాఖ అధికారులు, వైసీపీ నేతలను విచారించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. ఏదేమైనా కోడి కత్తి కేసు ఇంకా తేలకముందే దాదాపు అలాంటి సంఘటన జరగటం ఇలాంటి దాడులు జరుగుతాయని ముందే ఊహిస్తున్న నేపథ్యంలో, పోలీసులు జాగ్రత్తలు తీసుకోకపోవడం విచారకరం.

ఈ విషయంలో మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ఆశ్చర్యంగా ఉంది. అసలు ముఖ్యమంత్రి రక్షణ కల్పించడంలో విఫలమైన సిఎస్, డిజిపి, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీస్ కమిషనర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయాల్సింది పోయి.. చంద్రబాబు నాయుడు మూల్యం చెల్లించుకుంటారు అనటం అవివేకం. ఇది తెలుగు ప్రజలపై దాడి అని అంబటి అనుకోవటం ఆయన అమాయకత్వానికి నిదర్శనం.

LEAVE A RESPONSE