Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఇదే మా ఆహ్వానం

– ఏపీ పర్యాటకాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఢిల్లీలో జరుగుతున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ -2025 వేదికగా జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, సమగ్ర పర్యాటకాభివృద్ధే లక్ష్యంగా రానున్న ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బుధవారం ద్వారకా ఢిల్లీలోని యశోభూమిలో జరిగిన సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ -2025 (ఎస్ఏటీటీఈ) వేదికగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తనదైన శైలిలో ప్రసంగించి ఇన్వెస్టర్లను అమితంగా ఆకట్టుకున్నారు.

పర్యాటక రంగంలో ఉత్తేజం నింపేలా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిందని తద్వారా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటకరంగానికి కూడా వర్తింపజేస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఏపీలో పర్యాటకాభివృద్ధి కోసం నూతన టూరిజం పాలసీ 2024-29 తీసుకువచ్చామని వివరించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పీపీపీ) విధానం ద్వారా పర్యాటకాభివృద్ధి చేయాలని భావిస్తున్నామని, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు.

అని వివరించి ఇన్వెస్టర్లు, టూర్ ఆపరేటర్లు, ట్రావెలర్స్, ఔత్సాహికులను ఆహ్వానించారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు, వనరులున్న నేపథ్యంలో వాటన్నింటిని సమర్థవంతంగా వినియోగించుకొని పర్యాటక రంగంలో ఏపీని దేశంలో అగ్రపథాన నిలుపుతామన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటకాన్ని, పర్యావరణాన్ని సమ్మిళితం చేసి యువతకు ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు తొలి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను నిలబెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సుస్థిర, సమగ్ర పర్యాటకాభివృద్ధిలో భాగంగా పర్యాటకులకు విభిన్న పర్యాటక అనుభవాలను కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు.

ఈ క్రమంలో ఒకే తరహా పర్యాటకాభివృద్ధి కాకుండా జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలో టెంపుల్, అడ్వెంచర్, ఎకో, వెల్ నెస్, హెరిటేజ్, రిలీజియస్, అగ్రి, మెడికల్, క్రూయిజ్, బీచ్, కోస్టల్, సీప్లేన్, రూరల్, ఫిల్మ్ టూరిజంలను వృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. రాష్ట్ర సహజ, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ బాధ్యతాయుతమైన పర్యాటక పద్ధతులను అవలంభించాలని నిర్ణయించామన్నారు. హబ్ అండ్ స్కోప్ విధానంలో యాంకర్ హబ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తూ పర్యాటక రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. పర్యాటక రంగం ద్వారా 15 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు ఆహ్లాదంగా ఉంటూ ఎక్కువ రోజులు గడిపేలా మెరుగైన సేవలు, మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నామన్నారు.

LEAVE A RESPONSE