– దాతృత్వం చాటుకున్న జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్
– గుంటూరు యానాది కాలనీలో చిన్నారులు, మహిళలకు దుస్తులు, స్వీట్లు పంపిణీ
– రూ.50 వేలు సొంత ఖర్చులు వెచ్చించిన జేసీ
– పేదల తమ జీవితాల్లో వెలుగులు నింపారన్న నిరుపేదలు
అది గుంటూరులోని శ్రీనగర్లో యానాది కాలనీ. అక్కడ నిత్యం ఆకలి పేగులపై పస్తుల డప్పులు మోగుతుంటాయి. అభివృద్ధి ఆనవాళ్లు కాలనీకి దూరంగా విసిరివేయబడతాయి. సంక్షేమ ఫలాలు వారి గుమ్మం వద్దే ఆగి వారి బతుకులను వెక్కిరించాయి. అక్షరాలు దిద్దాల్సిన చిట్టి చేతులు చిత్తు కాగితాల లెక్కల్లో పడి నిరక్షరాస్యత పులుముకున్నాయి. వారి శరీరాన్ని అంటుకుని ఉన్న చిరిగిన దుస్తులు ఛిద్రమైన వారి జీవితాలకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.. సమాజంలోనే ఉన్నాసమాజానికి దూరంగా సమస్యలకు దగ్గరగా వారి బతుకులు నిత్యం పేదరికపు చీకట్లో మగ్గుతున్నాయి. ఇలాంటి నిరుపేదల కుటుంబాల్లో్కి చీకట్లను చీల్చేందుకు వెలుగు రవ్వై ముందుచ్చారు జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్.
ఎండిన డొక్కలకు గంజి నీళ్లు కూడా దిక్కులేని వీరికి రేషన్ కార్డు కూడా లేదనే విషయం తెలుసుకుని చలించిపోయారు. నిలువ నీడ కూడా లేని వారి నిస్సహాయతను చూసి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు వారి ఇంట ప్రకాశింపజేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇకపై వారి జీవితాల్లో ఒక్క పూట కూడా పస్తులనే మాట వినిపించకూడదని నిశ్చయించుకున్నారు.
కాలనీలోని 40 కుటుంబాల వారి వివరాలను తెప్పించుకున్నారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయించారు. ఇప్పటి వరకు వారి నట్టింట తిష్ట వేసిన ఆకలిని తరిమికొట్టారు. గూడులేని వారి గోడును మనసుతో ఆలకించి అర్హులైన 40 కుటుంబాలకు జగనన్న ఇళ్ల పథకం కింద ఇళ్ల పట్టాలు ఇప్పించారు. ఇప్పుడా పట్టా భూమిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ప్రతి ఏటా దీపావళి పండుగనాడు ఆకాశానికి ఎగిరే వెలుగు రవ్వలను చూసి చప్పట్లు కొట్టి ఆనందించే వారి కళ్లలో ఈ సారి దీపాల కాంతులు చూడాలని ఆకాంక్షించారు.
ప్రతి మోములోనూ దీపాల కాంతులు..
గురువారం ఉదయం 11 గంటలకు యానాది కాలనీలోకి అడుగు పెట్టారు. వస్తూవస్తూనే చిరునవ్వుల చిచ్చుబుడ్లు వెలిగించారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కుటుంబాల్లో వెలుగు నింపేందుకు నిత్యం కృషి చేస్తుందని, సంక్షేమాన్ని మీ ముంగిటకే తీసుకొస్తుందని వారికి ధైర్యం చెప్పారు. రేషన్ సరుకులు సమయానికి వస్తున్నాయా ? తినడానికి వీలుగా ఉంటున్నాయా ? అంటూ వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఒక పూరి పాకలోకి వెళ్లి అక్కడ ఉన్న వారితో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం తన వెంట తీసుకొచ్చిన నూతన దుస్తులను ఒక్కొక్కరి పంపిణీ చేశారు. ఐదేళ్ల చిన్నారుల నుంచి 15 ఏళ్ల పిల్లల వరకు సుమారు 50 మందికి నూతన దుస్తులు బహూకరించారు. ఆ కాలనీలో ఉన్న నిరుపేద 30 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నూతన దుస్తులను జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్ తన సొంత నిధులు రూ.50 వేలతో కొనుగోలు చేసి తీసుకొచ్చారు.
నూతన దుస్తుల్లో చిన్నారుల సంబరం..
నూతన దుస్తులు అందుకున్న చిన్నారులు వాటిని ధరించి ఉత్సాహంగా మళ్లీ జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్ దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో ఆ చిన్నారుల మోముల్లో సంతోషాల తారాజువ్వలు ఆకాశాన్ని తాకాయి. కల్మషంలేని ఆ మహిళల నవ్వుల్లో మతాబుల వెలుగు కనిపించాయి. నాది ఎరుపు గౌను అని ఒకరు, నాది కొత్త డిజైన్ అని మరొకరు చిన్నారుల ఆనందంగా చెప్పుకుంటుంటే జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్ వారిని చూసి మురిసిపోయారు. అనంతరం వారికి స్వీట్లు, కూల్‌డ్రింక్స్ అందించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దుస్తుల్లో మెరుపులు.. అంతకు మించి వారి కళ్లలో జిలుగులు.. పేదోళ్ల గుండె గుడిసెలో వెలిగిన ఆనందాల దీపాలను చూసి ఇది కదా అసలైన దీపావళి అని జేసీ దినేష్‌కుమార్ సంబరపడ్డారు.ఈ కార్యక్రమం లో గుంటూరు తూర్పు తాసిల్దార్ శ్రీకాంత్ ,భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు