– అవినీతి పర్మిషన్లే ప్రధాన వ్యాపారం
• రేవంత్‌కి కుడిచేయి రేరా, ఎడమచేయి హైడ్రా
– రేవంత్ ధరించే టీ షర్ట్లు, బూట్లు, బెల్ట్‌లు మధ్యతరగతి వారివి కావు
– పెట్టుబడులు రావాలంటే ఇంగ్లీష్ తెలిసి ఉండాలి
• క్రెడాయ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రసంగం పసలేని మాటలతో నిండి ఉంది
• నిర్మాణ రంగానికి ధైర్యం చెప్పే ఒక్క మాట కూడా ఆయన వద్ద లేదు
• జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో అనుమతులు వేల దరఖాస్తులు పెండింగ్‌లోనే
– జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో పారదర్శకత ఎక్కడ?
• రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు ఆలోచన నిర్మాణరంగానికి శవపేటికే
• రాష్ట్ర ఆర్థిక దుస్థితికి ఏకైక కారణం రేవంత్ పాలనే
• సెప్టెంబర్ 17 సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం కానుంది
– ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి క్రెడాయ్ కార్యక్రమంలో చేసిన ప్రసంగం పసలేని మాటలతో నిండి ఉంది. నిర్మాణరంగం కుదేలైపోయిన ఈ సమయంలో వారిని స్వాంతనపరిచే ఒక్క మాట కూడా ఆయన ప్రసంగంలో లేకపోవడం దురదృష్టకరం. రేవంత్ రెడ్డికి విజన్ లేదని, విజ్డమ్ లేదని, తెలిసింది కేసీఆర్‌ను తిట్టడం, చంద్రబాబును పొగడడమేనని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ అనేది రాష్ట్రానికి రెవెన్యూ ఇంజిన్, నిర్మాణరంగం బాగుంటేనే అన్నీ బాగుంటాయని గుర్తుచేశారు. రేవంత్ ప్రసంగం విషం ఎక్కువ, విషయం తక్కువగా ఉన్నదని, కేసీఆర్ పాలనలో పదేళ్లపాటు నిర్మాణరంగం ఎందుకు అభివృద్ధి చెందిందో, రేవంత్ పాలనలో ఎందుకు దిగజారిందో ఆలోచించాలని సూచించారు. కేసీఆర్, కేటీఆర్ కృషితో పెట్టుబడుల గమ్యస్థానంగా మారిన హైదరాబాద్ ఇమేజ్, రేవంత్ పాలనలో తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన అన్నారు.
జీహెచ్ఎంసీలో భవన నిర్మాణ అనుమతులు తగ్గిపోయాయని, హెచ్ఎండీఏలో కార్యకలాపాలు నిలిచిపోయాయని, రేరా పేరుతో బిల్డర్లను బెదిరించడం రేవంత్ ప్రభుత్వ దైనందిన వ్యవహారమైందని విమర్శించారు. 30 ఏళ్లలో సైబరాబాద్‌గా రూపుదిద్దుకున్న హైదరాబాద్‌ను వదిలేసి, రేవంత్ ఫ్యూచర్ సిటీ తెస్తానంటున్నారని, అప్పటి వరకు హైదరాబాద్‌ను ఎండబెట్టేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబును పొగడుతూ, కేసీఆర్–కేటీఆర్ కృషిని మాత్రం ప్రస్తావించకుండా మౌనం వహించడం దురుద్దేశపూర్వకమని అన్నారు.
ప్రజలు కేసీఆర్ పాలనలో బర్కత్ అనుభవించారని, రేవంత్ అడుగుపెట్టగానే ప్రజల దగ్గర పైసలు పుట్టడం ఆగిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక దుస్థితికి ఏకైక కారణం రేవంత్ పాలనేనని పేర్కొన్నారు. తాను మే 7న జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని భవనాలకు అనుమతి ఇచ్చారో ఆర్టీఐ ద్వారా అడగగా, అర్థంలేని సమాధానాలు ఇచ్చారని వెల్లడించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆర్ఆర్ టాక్స్ కట్టకపోతే పర్మిషన్లు ఇవ్వడం లేదని, అనుమతులు పూర్తిగా అవినీతిమయమయ్యాయని ఆయన తెలిపారు.
రేవంత్‌కు కుడిచేయి రేరా, ఎడమచేయి హైడ్రాగా మారి ప్రజలపై పెత్తనం చలాయిస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో శాంతి భద్రతలు బాగుండటంతో పెట్టుబడులు వెల్లువెత్తాయని, కానీ రేవంత్ పాలనలో పట్టపగలు తుపాకులు పట్టుకుని దుకాణాలను దోచుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పారదర్శకత గురించి పెద్ద మాటలు మాట్లాడే రేవంత్ , జీహెచ్ఎంసీ–హెచ్ఎండీఏల్లో పారదర్శకత ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు.
మధ్యతరగతి మనస్తత్వం కలవాడినని చెప్పుకునే రేవంత్ ధరించే టీ షర్ట్లు, బూట్లు, బెల్ట్‌లు మధ్యతరగతి వారివి కావని ఎద్దేవా చేశారు. ఆయనది కామన్ సెన్స్ కాదు, క్రూడ్ సెన్స్, మొత్తానికి నాన్సెన్స్ పాలన అని వ్యాఖ్యానించారు. రేరా, హైడ్రా ఆగడాలపై బండి సంజయ్ వంటి నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారని కూడా ప్రశ్నించారు.
రేవంత్ మనస్తత్వం భూస్వామ్య–ఫ్యూడల్ అని, భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచే ఆలోచనలో ఉన్నారని, ఇది జరిగితే నిర్మాణరంగానికి శవపేటిక తప్పదని హెచ్చరించారు. చావుకి, పెళ్లికి మంత్రం ఒకటే అన్నట్లుగా రేవంత్ తీరు ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పెట్టుబడులు రావాలంటే ఇంగ్లీష్ తెలిసి ఉండాలి, రేవంత్ ఇంగ్లీష్ గురించి మాట్లాడటం కేటీఆర్ గురించేనని అందరికీ తెలుసని అన్నారు.
తాను వ్యక్తులపై వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పోరాడటం లేదని, రేవంత్–బీజేపీ–తమిళ్ సై ఆటలో తానే కాకుండా సత్యనారాయణ, కోదండరాం కూడా బలిపశువులయ్యారని పేర్కొన్నారు. రాజ్యాంగం గెలవాలన్నదే మా తాపత్రయమని, సెప్టెంబర్ 17న సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకంగా ఉంటుందని ఆశిస్తున్నామని డాక్టర్ దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.