Suryaa.co.in

Andhra Pradesh

బ్ర‌హ్మోత్స‌వాల‌ను త‌ల‌పించిన‌ మన తిరుపతి ఆవిర్భావ వేడుకలు

-తిరుపతి పుట్టిన రోజు వేడుకను టీటీడీ క్యాలెండర్‌లో భాగం చేస్తాం
– టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి
-తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం
– టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి
– గోవింద నామ స్మరణలతో పులకించిన తిరునగరి

తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను త‌ల‌పించేలా మన తిరుపతి 894వ ఆవిర్భావ వేడుకలను టీటీడీ ఆధ్వ‌ర్యంలో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించిన‌ట్లు ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు. తిరుప‌తి గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య ప్రాంగ‌ణంలో శ‌నివారం ఉద‌యం ఛైర్మ‌న్ ఈ ఉత్స‌వాల‌ను ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ, జగద్గురువు శ్రీ‌శ్రీ‌శ్రీ రామానుజాచార్యులు తన అమృత హస్తాలతో 24.02.1130 న శంకుస్థాపన చేశారన్నారు. చిదంబరం నుంచి తీసుకొచ్చిన గోవిందరాజస్వామి ప్రతిమను ప్రతిష్టించడంతోపాటు, ఈ ప్రాంతానికి గోవిందరాజపురంగా నామకరణ చేయగా, నేడు తిరుపతిగా భాసిల్లుతున్నద‌న్నారు. 140 కోట్ల మంది హిందువులు పూజించే దేవుడైన శ్రీవెంకటేశ్వర స్వామి పాదాల చెంత నివాసం ఏర్పరచుకుని, జీవనం సాగించడం మనందరి జన్మజన్మల పుణ్యఫలమని చెప్పారు.

ప్రతిరోజు అర్చకులు గోవిందరాజస్వామి ఆలయంలో జరిగే మంత్రపుష్పంలో తిరుపతి ఆవిర్భావం గురించి చదువుతున్నారన్నారు. గోవింద రాజస్వామి ఆలయ గోపురం మీద కూడా మొట్టమొదటి శాసనంలో తిరుపతి ఆవిర్భావం గురించి
చారిత్రక ఆధారాలు ఉన్నాయని చైర్మన్ వివరించారు.

ప్రపంచంలోనే అత్యంత పురాతన సంస్కృతి కలిగిన మెసెప్టోమియా, ఈజిప్ట్ లలోని నిప్పర్, లష్కర్ వంటి మహానగరాలు కాలగర్భంలో కలిసిపోయాయని, ఎథెన్స్, రోమ్, మాయన్ వంటి సంస్కృతులు ఎప్పుడు పుట్టాయో ఎవరికీ తెలియదన్నారు. కానీ తిరుపతి పుట్టినరోజు వేడుకలు జరపడం భగవత్ సంకల్పమన్నారు.

ప్రపంచంలో ఒక్క తిరుపతి నగరానికి మాత్రమే ఆవిర్భావ దినం ఉందిని చెప్పారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న సాంప్రదాయంగా, ఆచారంగా తిరుపతి పుట్టిన రోజు వేడుకను టీటీడీ క్యాలెండర్ లో భాగం చేస్తూ, పాలక మండలిలో తీర్మానించ‌నున్న‌ట్లు ఛైర్మ‌న్ తెలిపారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆశీస్సులతోనే ఈ పండుగను ఇంత అద్భుతంగా నిర్వహించుకుంటున్న‌ట్లు చెప్పారు.

ఇందులో వేద పండితుల వేద ఘోష, కళాకారుల అద్భుత విన్యాసాలతో తిరుపతిలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయనేలా మైమ‌రిపించార‌న్నారు. టీటీడీ యంత్రాంగమంతా కదలివచ్చి మన తిరుపతి పుణ్యక్షేత్ర ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నభూతో న భవిష్యత్ అనేలా నిర్వ‌హించింద‌న్నారు. ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తిరుప‌తి న‌గ‌రం ప్రపంచానికి ఓ ఆదర్శ నగరం కావాలని ఆకాంక్షించారు.

అనంత‌రం టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ నలుమూలల నుంచి శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి తిరుపతి మీదుగా తిరుమలకు వెళ్తార‌న్నారు. కావున భ‌క్తుల‌కు మ‌రింత ఆధ్యాత్మిక ఆనంద‌న్ని క‌లిగించేందుకు తిరుపతి నగరాన్ని కూడా తిరుమల తరహాలో సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టడం జరిగింద‌న్నారు.

తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తోంద‌న్నారు. తిరుపతి అభివృద్ధికి అందరూ సహకరించాలని, అందుకోసమే టీటీడీ పాలక మండలి కృషి చేస్తోంద‌న్నారు. మన తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని మూడోసారి నిర్వహించు కుంటున్న తరుణంలో పుర‌ప్ర‌జ‌ల‌కు, శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఈవో శుభాకాంక్షలు తెలియజేశారు.

అలరించిన ఆధ్యాత్మిక శోభా యాత్ర
అంత‌కుముందు ఛైర్మ‌న్ శ్రీగోవిందరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్రను ప్రారం భించారు. టీటీడీ డిపిపి, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టుకు చెందిన వంద‌లాది మంది క‌ళాకారులు చెక్క భజనలు, కోలాటాలతో లయబద్ధంగా ఆడుతూ, గోవింద నామ సంకీర్తనలు, వేదపండితులు మంత్రోచ్చారణల మ‌ధ్య భక్తి చైతన్య యాత్ర జ‌రిగింది. అదేవిధంగా క‌ళాకారుల వివిధ దేవ‌తామూర్తుల, పౌరాణిక వేషధారణలు పుర‌ప్ర‌జ‌ల‌ను విశేషంగా ఆకర్షించాయి.

ఈ కార్య‌క్ర‌మంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జియ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, పార్ల‌మెంటు సభ్యులు గురుమూర్తి, జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీ షా, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ మ‌ల్లిక గార్గ్‌, నగర మేయర్ డాక్ట‌ర్ శిరీష, నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, ఎఫ్ ఎ అండ్ సిఎవో బాలాజి, సిఇ నాగేశ్వ‌ర‌రావు, సిపిఆర్ఓ డాక్టర్ టి.రవి, త‌దిత‌రులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE