Suryaa.co.in

Telangana

కాంట్రాక్టర్లను రక్షించడం కోసమా?కేసీఆర్ కుటుంబాన్ని రక్షించడం కోసమా?

-తప్పు చేసిన అధికారుల పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదు?
-కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడానికేనా ?
-అవినీతికి పాల్పడ్డారన్న అధికారులతోనే కాంగ్రెస్ మంత్రుల సమీక్ష
-భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన విషయంలో దశ దిశ లేదు. సమగ్ర ఆలోచన, కార్యాచరణ లేదు. అధికారంలోకి వచ్చి పదవుల మోజులోనే రాజకీయం చేద్దామనే ఆలోచనలో మాత్రమే ఉన్నట్లుగా కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాడు ఇష్టానుసారంగా మాట్లాడిండు. నాడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో సీబీఐకి లేఖరాశానని, దమ్ముంటే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.రాజ్యాంగ విధులు నిర్వహిస్తానని ప్రమాణం చేసి, ముఖ్యమంత్రి కాగానే ఆ విషయం మర్చిపోయి సీబీఐ ఎంక్వైరీకి కోరకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తున్నరు.

జరిగిన అవినీతి, అక్రమాలు, ప్రాజెక్టు భవితవ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం విధానమేంటి? కాంట్రాక్టర్లను రక్షించడం కోసమా.. ? లేక కేసీఆర్ కుటుంబాన్ని రక్షించడం కోసమా..? ఎవరిని తప్పించడం కోసం.. మతలబేంటో చెప్పాలి. సీబీఐ ఎంక్వైరీ జరిపించేందుకు కాంగ్రెస్ కు ఉన్న ఇబ్బందేంటి..? దోషులెవ్వరో బయటపెట్టాలి.

సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారే ప్రకటిస్తున్నారు. తప్పు చేసిన అధికారుల పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదు? కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడానికేనా అనే అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్ మంత్రులు అనాలోచిత ప్రకటనలు ఎందుకు చేస్తున్నట్లు? ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నట్లు?

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ రాష్ట్రాల మధ్య తగువులు పెట్టే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇవ్వకూడదంటూ హరీశ్ రావు ప్రకటనలు చేస్తున్నడు. అవినీతికి పాల్పడ్డారన్న అధికారులతోనే కాంగ్రెస్ మంత్రులు సమీక్ష సమావేశాలు నిర్వహించడం వెనుక మతలబేంటి..? అంటే వారికి క్లీన్ చిట్ ఇస్తున్నట్లా..? కేసీఆర్ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇవ్వదల్చుకున్నారా..? చెప్పాలి.

కేవలం సమీక్షల పేరుతో కాలయాపన చేస్తూ పాలనను గాలికొదిస్తున్నారు. ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు అందకుండా దుర్భర స్థితిలో బతుకులీడుస్తున్నరు.సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి అనేక మాటలు మాట్లాడిండు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అంటూ ఇష్టానుసారంగా మాట్లాడిండు.అదానీ అవినీతి సొమ్ము అయితే.. తెలంగాణలో పెట్టుబడుల కోసం అదానీ కంపెనీతో ఎలా ఒప్పందం చేసుకున్నట్లు?అధికారంలోకి రాకముందు ఒకలా.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా మాట్లాడమే కాంగ్రెస్ విధానమా..? దీనిపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.

రాహుల్ గాంధీ, అదానీ మధ్య అంతర్గత ఒప్పందాలు జరిగాయనే అనుమానం కలుగుతోంది. ఓ కాంగ్రెస్ మంత్రి అయోధ్య శ్రీరాముడి అక్షింతలను, రేషన్ బియ్యంగా పోల్చి హీనంగా మాట్లాడటడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడటమే కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీ. కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టుల్లో అవినీతి విషయంలో న్యాయవిచారణ కోసం లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.

కాంగ్రెస్ అంటేనే ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ప్రజాసమస్యలను గాలికొదిలేయడం. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న రాహుల్ గాంధీ జోడో యాత్రకు, తెలంగాణ నుంచి ఏసీ బస్సులు సమకూర్చి తెలంగాణ ప్రజల సొమ్మును తరలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలియ్యడమే కష్టంగా మారిన క్లిష్టపరిస్థితుల్లో తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు దారాదత్తం చేస్తున్నట్లు? వంద రోజుల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీలను చెప్పిన గడువులోగా అమలు చేసి తీరాలి. లేదంటే ప్రజల పక్షాన బీజేపీ పోరాటం తప్పదు.

మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ , బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్ , నాయకులు రాణా ప్రతాప్ , తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE