– సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ముత్తుకూరు: స్మార్ట్ కార్డులతో రేషన్ పంపిణీలో పారదర్శకత ఉంటుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సర్వేపల్లి సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకున్నాం.. సరుకులు పొందిన, పొందని వారి వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా కనిపించేలా క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఆయన ఇంకా, ఏమన్నారంటే… రేషన్ పంపిణీ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న లోపాలను సరిదిద్దేందుకు ఈ స్మార్ట్ కార్డులు దోహదం చేస్తాయి.
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు సౌకర్యవంతంగా అనేక మార్పులు తీసుకొస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే సరుకులు అంటూ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వాహనాలను తెచ్చారు. ఆ వాహనాలు వచ్చిన సమయంలోనే రేషన్ సరుకులు తీసుకోవాలి…అవి కూడా ఇంటి వద్దకు రావు..వీధిలో ఎక్కడో ఒక చోట నిలుపుతారు..వాహనాలు వచ్చిన గంటలో రేషన్ సరుకులు తీసుకోకపోతే ఇక ఆ నెలలో కట్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ వ్యవస్థలో పాత విధానాన్ని అమలులోకి తెచ్చింది. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులు ఏ రోజైనా రేషన్ షాపుకి వెళ్లి సరుకులు పొందవచ్చు. 65 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు నేరుగా ఇళ్ల వద్దకే సరుకులే ఇచ్చే ఏర్పాటు చేసింది..ఒకటో తేదీకి ఐదు రోజుల ముందే వారికి సరుకులు అందజేస్తున్నారు.
మొదట రేషన్ కార్డు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిందే తెలుగుదేశం పార్టీ. గత ప్రభుత్వ హయాంలో పేదల ప్రయోజనాల కన్నా పాలకుల ఫొటోలకే ప్రాధాన్యమిచ్చారు. ఇప్పుడు మా ప్రభుత్వం కేవలం లబ్ధిదారుల ఫొటోలతోనే స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తోంది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడులు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.