Suryaa.co.in

Editorial

తిరుమల వెంకన్నకే ఎగనామం!

ఎవరి జీతాల్లో నుంచి కట్ చేయాలి..?
రూ.3.70 కోట్ల రికవరీపై టీటీడీ మల్లగుల్లాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
తిరుమల వెంకన్నకు చాలామంది భయపడతారు. స్వామి సొమ్ము ముట్టుకోవాలంటే పాపభీతితో వణికిపోతారు. కానీ కొండమీద హోటల్ నడిపిన ఓ ఘనుడికి ఇలాంటి పాపభీతి ఏమీ కనిపించలేదు. హోటల్ నడిపిన యజమాని నుంచి బకాయిలు వసూలుచేయలేని టీటీడీ అధికారులు.. తాజాగా రద్దు చేసిన సాంప్రదాయ భోజనం కోసం ఏకంగా ఆ హోటల్‌నే ఖాళీ చేయించారు. నిబంధనల ప్రకారం, కిరాయిదారుడి నుంచి బకాయిలన్నీ రాబట్టిన తర్వాత ఖాళీ చేయించాల్సిన అధికారులు, సదరు యజమానిపై దయ చూపారు. మరి సదరు యజమాని చెల్లించాల్సిన 3 కోట్ల 75 లక్షల రూపాయల బకాయిలు ఎవరు చెల్లిస్తారు? ఆదరాబాదరాగా ఖాళీ చేయించిన అధికారులా? సాంప్రదాయ భోజనం కోసం ఉన్న హోటల్‌ను ఖాళీ చేయించిన టీడీపీ స్పెసిఫైడ్ అథారిటీనా? హోటల్ బకాయిలు రాక, సాంప్రదాయ భోజనమూ రద్దయిన ఉభయభ్రష్టత్వం టీటీడీ అధికారులను దోషులుగా నిలబెట్టింది. మరి ఆ సొమ్ము ఎలా రికవరీ చేస్తారు? ఇప్పుడు టీటీడీని వేధిస్తున్న ప్రశ్నలివి!
తిరుమల కొండపై ప్రైవేట్ హోటల్ నిర్వాహకుడు రాజగోపాల్ చెన్నైకి చెందిన డిసి హోటల్స్ పేరిట టీటీడీ అధికారుల సహకారంతో 3.70 కోట్ల రూపాయలను టీటీడీకి చెల్లించకుండా ఎగనామం పెట్టి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఈ సొమ్మును ఎవరి వద్ద నుండి వసూలు చేయాలో అర్థం కాకుండా, టీటీడీ అధికారులు వెన్నులో వణుకు పుడుతోంది.
ధార్మిక సంస్థ నిబంధనల ప్రకారం నిర్లక్ష్యంగా వహించిన ఆస్తుల సంరక్షణ అధికారి జీతంలో నుంచి రికవరీ చేయాలా.. లేక మామూళ్ల మత్తులో ఉండి ఏడాదిన్నర కాలం హోటల్ యాజమాన్యం కి సహకరించిన రెవెన్యూ సిబ్బంది జీతాల్లో కట్ చేయాలో అర్థం కాకుండా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అక్రమార్కులకు సహకరించిన అధికారులు భుజాలు తడుముకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు టిటిడిని వివరణ కోరినట్లు సమాచారం. కాగా సాంప్రదాయ భోజనాన్ని తిరుమలలో ప్రవేశపెట్టే హడావిడిలో భాగంగా పాలకమండలి సమావేశం హాలు కింది భాగంలోని అన్నమయ్య భవన్ హోటల్ టీటీడీకి అవసరమైంది. దీంతో హడావిడిగా అప్పటికే అందులో టెండర్ విధానంలో హోటల్ నిర్వహిస్తున్న డి సి హోటల్స్ అనే యాజమాన్యాన్ని ఖాళీ చేయించారు.
అయితే హోటల్ నుండి బాకీ సొమ్మును రాబట్టు కోకుండా టీటీడీ లోని ఉన్నతాధికారులు హోటల్ యాజమాన్యం తో అనధికారిక సంప్రదింపులు జరిపి కోర్టు కేసులను వెనక్కి తీసుకుని, 3.70 కోట్ల రూపాయల అద్దె బకాయిలు వదులుకొని, ఖాళీ చేయించడం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు టీటీడీ రెవెన్యూ విభాగానికి హోటల్ యాజమాన్యం చెల్లించాల్సిన 3. 70 కోట్ల రూపాయలను ఎలా జమచేస్తారు? అన్న దానిపై సంప్రదింపులు జరుపుతోంది. హోటల్ యాజమాన్యానికి లీగల్ నోటీసు ఇచ్చి , న్యాయస్థానం ద్వారా రాబట్టుకునే ప్రయత్నం కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఏడాదిన్నర కాలంగా బకాయిలు చెల్లించకుండా టిటిడి నిబంధనలకు విరుద్ధంగా అధికారులు, రెవెన్యూ సిబ్బంది సహకారం లేనిదే.. అదే హోటల్లో నిర్వాహకులు ఎలా కొనసాగారు? ఎవరు సహకరించారు? అనే దిశగా టిటిడి విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతోంది. వెంకన్న సొమ్ముకు కోట్ల రూపాయల గండి పడిన ఈ వ్యవహారంపై, ఎవరి పై చర్యలు తీసుకుంటారో.. ఎవరిని కాపాడుతారో.. వేచి చూడాల్సిందే.

LEAVE A RESPONSE