-వెంటనే టిటిడి ప్రక్షాళన చేయకపోతే ఉద్యమం తప్పదు
-తిరుమల అపవిత్రత తోనే వరుస దుస్సంఘటనలు
-తిరుమలలో బాలుడి మరణం పట్ల రామచంద్ర యాదవ్ ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వానికి తిరుమల పరిరక్షణ పట్ల బాధ్యత లేదని, అత్యంత పవిత్రక్షేత్రమైన తిరుమలను ప్రభుత్వము టిటిడి పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్లనే వరుస అపరాధాలు జరుగుతున్నాయని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం లో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో బాలుడి మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి, టిటిడికు బీసీవై పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేశారు. బెంగళూరుకు చెందిన 15 ఏళ్ల మంజునాథ్ అనే బాలుడు తోక్కిసలాటలో కిందపడి మరణించగా ఈ విషయాన్ని దాచిపెట్టి టిటిడి మరియు ప్రభుత్వం మరో తప్పిదం చేశారని, ఇది క్షమించరాన్ని నేరమని మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిరక్షణ పట్ల ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అన్నారు.
తిరుమల అపవిత్రం చెందిన కారణంగానే దుస్సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలుసుకొని ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ అపశృతుల నేపథ్యంలో వెంటనే తిరుమల తిరుపతి పరిరక్షణకు పాటుపడక పోగా, దారుణ నిర్లక్ష్యాలతో వ్యవహరిస్తూ వెంకన్న భక్తుల మరణాలకు కారణమవుతున్న, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గాన్ని తొలగిస్తూ తక్షణ ప్రక్షాళన చేపట్టాలని డిమాండ్ చేశారు. టీటీడీ పాలక వర్గాన్ని ప్రక్షాళన చేయలేని పక్షంలో ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా తక్షణం ఉద్యమం ప్రారంభిస్తామని ఆయన హెచ్చరించారు.