– అధికారుల లేఖ విడుదల చేసిన వైసీపీ
వీసీలను రాజీనామా చేయాలంటూ విద్యాశాఖ ఒత్తిడి చేసిన మాట నిజమేనని వాదించిన వైసీపీ.. ఆ మేరకు ఉన్నత విద్యాశాఖ అధికారి రాసిన లేఖను మీడియాకు విడుదల చేసింది.
వైసీపీ ప్రకటన పూర్తి పాఠమిదీ.. నారా లోకేష్ ఆదేశాలతో ఛైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక వీసీ తన రాజీనామా లేఖలో మంత్రి లోకేష్ బెదిరించినట్లు స్పష్టంగా రాశారు. దాంతో వీసీలపై రాజీనామా చేయాలంటూ ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని శాసన మండలిలో వైయస్‌ఆర్‌సీపీ ప్రశ్నించగా.. అడ్డంగా దొరికిపోవడంతో వైస్ ఛాన్సలర్లు గవర్నర్ అధికారం కిందకు వస్తారని మంత్రి నారా లోకేష్ మొదట బుకాయించారు.
కానీ.. వీసీలను బెదిరించినట్లు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నాడు. మీరే బెదిరించి.. మీరే విచారణ జరిపితే నిజాలు వాస్తవాలు బయటికి వస్తాయా? అని ప్రశ్నిస్తే మౌనమే నారా లోకేష్ సమాధానం అయ్యింది. ఇదిగో ఇప్పుడు నారా లోకేష్ ఒత్తిడితోనే రాజీనామా చేసినట్లు ఆధారాలను బయటపెడుతున్నాం. ఏమాత్రం నిజాయతీ ఉన్నా నారా లోకేష్ ఆ వీసీల రాజీనామాపై న్యాయబద్ధంగా విచారణ చేయించాలి లేదా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి. అప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయి.. న్యాయం గెలుస్తుంది.