– 10 లక్షల మంది సామాన్య భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి దూరం చేయవద్దు
– 2020 లో సామాన్య భక్తులకు అందుబాటులో వైకుంఠ ద్వార దర్శనం
– 26 మంది పీఠాధిపతులు, వైఖానస ఆగమ సలహాలు మేరకే దర్శనాలు
– 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు
– ఇప్పటి ఈవో అనిల్ సింఘాలో గతంలో ఈవోగా ఉన్నప్పుడే ఈ నిర్ణయం
– ప్రస్తుత బోర్డు మెంబర్ కృష్ణమూర్తి వైద్యనాధన్ అప్పుడూ కూడా పాలక మండలి సభ్యుడే
– టీటీడీ పాలకమండలి నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతి: ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించే విధానాన్ని రద్దు చేయాలన్న పాలకమండలి ప్రతిపాదనలపై వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు.
తిరుపతి లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ… కేవలం 2 రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాలకు అనుమతివ్వాలన్న టీటీడీ పాలకమండలి నిర్ణయం కచ్చితంగా దైవ ద్రోహమేనని మండిపడ్డారు. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో పీఠాధిపతులు, వైఖానస ఆగమ పండితుల సలహా, ఆశీర్వాదంతో ఈ ఉత్సవాల ద్వారా ఏటా 10 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం లభించిందన్న భూమన.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతేడాది పాలకమండలి నిర్వహణా వైఫల్యంతో 6 గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 60 మంది గాయాలపాలవడం దురదృష్టకరమన్నారు.
భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందే కాక, శ్రీరంగం ద్రావిడ సంస్కృతి అంటూ పాలకమండలి చైర్మన్ బీ ఆర్ నాయుడు వితండవాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే…
పీఠాధిపతులు, వైఖానస పండితుల సలహా మేరకు వైకుంఠ దర్శనాలు
వైకుంఠ ఏకాదశి రోజున సామాన్య భక్తులకు కూడా వైకుంఠద్వారం నుంచి పదిరోజుల పాటు స్వామి వారి దర్శనం కల్పిస్తూ తీసుకున్న అద్భుతమైన నిర్ణయాన్నిరద్దు చేసి మరలా పాత విధానాన్ని పునరుద్ధరించాలన్న టీటీడీ పాలకమండలి చైర్మన్ బీ ఆర్ నాయుడు ఆలోచన సరికాదు. వైకుంఠ ఏకాదశ పర్వదినాల సందర్బంగా లక్షలాదిమంది భక్తులకు వైకుంఠ ద్వారం గుండా దర్శనం కల్పించాలన్న సదాశయంతో వైయస్.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారు.
ఆ నిర్ణయాన్ని ప్రస్తుతం ఈవో పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ గతంలో ఇదే పోస్టులో ఉన్నప్పుడే తీసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు పాలకమండలి సభ్యులు, అడిషనల్ ఈవో తో సబ్ కమిటీ వేయడం జరిగింది. దీని కోసం 26 మంది పీఠాధిపతుల అంగీకారంతో పాటు తిరుమల వైఖానస ఆగమ పండితుల సలహాలు, పెద్ద జీయర్ స్వామివారి సూచనలు కూడా తీసుకున్నాం.
దాదాపు 32 మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు పాటు ఉంటే చాలా మంచిదని, అది ఆగమయుక్తం అని శ్రీరంగం తర్వాత దివ్యదేశాలలో రెండోది పేరుగాంచిన తిరుమలలో పూర్వకాలంలో ఉండిననది, కాలక్రమంలో అది వైకుంఠఏకాదశికే పరిమితం అయిందని, ఈ తర్వాత ద్వాదశ రోజున కూడా వైకుంఠ ద్వారాలు తెరిచే పరిస్ధితి వచ్చిందని చెబుతూ… పదిరోజుల పాటు వైకుంఠద్వారాల తెరిచే ఆలోచన అత్యంత శ్రేయస్కరమని చెప్పారు. దీని ద్వారా సామాన్య భక్తులకు పదిరోజుల పాటు స్వామి వారి వైకుంఠద్వార దర్శనం అందజేయడం మంచిదని చెప్పారు.
2020లో వైయస్.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఈ దర్శన కార్యక్రమం ప్రారంభించాం. ఇందులో అత్యంత కీలక భూమిక పోషించిన వారిలో ముఖ్యుడు, ప్రస్తుత పాలకమండలి సభ్యులుగా ఉన్న కృష్ణమూర్తి వైద్యనాథన్. అప్పటి సబ్ కమిటీలో ఈయన కూడా సభ్యులుగా ఉన్నారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని శృంగేరి, అహోబిలం, పరకాల, ఆండవాన్ ఆశ్రమం, రాఘవేంద్రస్వామి మఠం, ఆండవన్ ఆశ్రమం శ్రీరంగం, కాంచీపురం శంకరాచార్య మఠం, వానమలై మఠం, త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియ్యర్, ఉత్తరాది మఠం, వ్యాసరాజ మఠం వంటి ప్రముఖులైన వారందరూ ఈ దర్శనాలకు తమ అమూల్యమైన అంగీకారాన్ని ఇచ్చారు. ఇది మా సొంత నిర్ణయం కాదు, తిరుమల వైఖానస ఆగమ సలహా మండలి సూచనలు, నిర్ణయం మేరకే ఆ ఆలోచన చేశాం.
ద్రావిడ సంప్రదాయం అనడం ఆక్షేపణీయం
కానీ ప్రస్తుత పాలకమండలి దీన్ని ద్రావిడ సాంప్రదాయం అన్నట్టు పత్రికల్లో వార్తల ద్వారా తెలిసింది. తిరుమలలో ద్రావిడ సాంప్రదాయం, నాళాయిర ప్రభావం అంటే 12 మంది ఆళ్వారులు స్వామి వారిని విశేషంగా కీర్తించిన కీర్తనలే నాళాయిర దివ్య ప్రబంధంగా, తమిళ వేదంగా భాసిల్లుతుంది. బ్రహ్మోత్సవాల సమయాలలో పెద్దజీయర్ మఠం ఆచారానుసారం నిరంతరం గుడిలో నిరంతరం కొనసాగుతోంది.
అదే విధంగా శ్రీకృష్ణజన్మాష్టమి రోజుల్లో శ్రీవేంకటేశ్వరస్వామికి సంబంధించి ఆండాళ్ వారు రచించిన ప్రబంధపఠనమే దాదాపు నెల రోజుల పాటు జరుగుతుంది.
ఆ రోజుల్లో స్వామి వారికి సుప్రభాత సేవ కూడా ఉండదు. ఇది వేల సంవత్సరాలుగా జరుగుతున్న ఆచారం. కాబట్టి ద్రావిడ సాంప్రదాయాన్ని మన ఆలయంలో కొనసాగించాల్సిన అవసరం లేదు అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వితండవాదాన్ని తీసుకుని రావడం తీవ్ర ఆక్షేపణీయం. శ్రీరంగం తో మొదలుకుని పరమపథం వరకూ వైష్టువులందరూ భక్తితో పూజించే దివ్యదేశాల్లో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం రెండవది.
శ్రీమహావిష్టువుకు మానవకాల ప్రకారం కాకుండా దైవమానకాలం ప్రకారం ఏకాదశి పర్వం పదిరోజులు ఉంటుంది. స్వామి వారికి నలబై నిమిషాలే మనకు పది రోజులు అవుతందన్నది మనం మాట్లాడి తీసుకున్న నిర్ణయాలు కాదు. ఇవన్నీ సాంప్రదాయ ప్రసిద్ధులైన వారి సూచనలు. కనుక 10 రోజులు పాటు వైకుంఠ ఏకాదశ పర్వదినాలుగా భావించి.. ఆ 10 రోజులు పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు దర్శనం కలిగించవచ్చన్న వారి సూచనలతో అప్పటి పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది.
నిర్వహణా వైఫల్యంతోనే దర్శనాల రద్దు యోచన
ఇవాళ దాన్ని అమలు చేయడం చేతకాక, చేష్టలుడిగి, చేతులెత్తేసిన ఈ పాలకమండలి తమ పైరవీకారులకు ఎలా దర్శనం టిక్కెట్లు ఇప్పించాలని పరస్పరం తమలో తాము కొట్లాడుకుంటున్నారు. గతేడాది వైకుంఠఏకాదశి పర్వదినాన పాలకమండలి చైర్మన్ బీ ఆర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 గురు భక్తులు చనిపోగా, 60 మంది గాయాలపాలవడం ముమ్మూటికీ మీ నిర్వహణా లోపమే. మీ పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సాంప్రధాయన్ని ద్వంసం చేయడానికి పూనుకుంటున్నారు.
గతంలో స్వామివారికి పది, పన్నెండు సార్లు కూడా బ్రహ్మోత్సవాలు జరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో గరుడసేవ నాడు విపరీతంగా ఉండే భక్తుల రద్దీని తగ్గించడానికి ఆనాడు వైయస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలకమండలి చైర్మన్ హోదాలో నా హయాంలో పున్నమి గరుడ సేవను ప్రవేశపెట్టాం. ఇవాళ ఆ ఉత్సవాన్ని మీరు ఆపగలరా ? అదేవిధంగా శ్రీవేంకటేశ్వరస్వామికి అనునిత్యం ఇచ్చే పుష్కరిణి హారతిని మీరు ఆపగలరా ?
ఒకప్పుడు పుష్పాలంకరణ సేవ అన్నటువంటిది.. గతంలో ఉండేది, కొంతకాలం లేదు. తిరిగి పీ వీ ఆర్కే ప్రసాద్ ఈవో వచ్చిన తర్వాత అష్టదళ పదార్చన, పుష్పాలంకరణ సేవను పునరుజ్జీవింపజేశారు. ఎవరైనా మంచి కార్యక్రమాలను మరింత పటిష్టమైన ఆలోచనలతో సమర్ధవంతంగా నిర్వహించాలనే ప్రయత్నం చేస్తారే తప్ప… దురుద్దేశంతో వాటిని రద్దు చేసే ప్రయత్నం చేయరు. వైయస్సార్సీపీ ప్రభుత్వం వైకుంఠ ద్వార దర్శనం తీసుకువచ్చిందని.. దాన్ని రద్దు చేయడం ద్వారా దాదాపు 10 లక్షల మంది సామాన్య భక్తులకు స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాన్ని దూరం చేస్తారా ? మరలా ఆగమశాస్త్ర పండితుల అభిప్రాయం తీసుకుంటామని చెప్పడానికి, వాళ్లు రాజకీయ పార్టీల అనుబంధంగా ఉండేవాళ్లు కాదు. అత్యంత నిష్టాగరిష్టంగా ఉండే పండితులు.
పది రోజుల క్రితం పద్మావతి అతిథి గృహంలో జరిగిన ఆగమ సలహా మండలి సమావేశంలో కూడా వాళ్లు మీ ఒత్తిడి వల్లే వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులున్నా, 2 రోజులున్నా బాగుంటుందని సూచన చేసినట్లు మాకు సమాచారం ఉంది. అంటే కేవలం బలవంతంగా వైకుంఠ ద్వారా దర్శనాన్ని 2 రోజులకు కుదించాలన్న కుఠిల ప్రయత్నాన్ని మానుకోవాలి.
మంచి చెబితే… మా పై దాడి చేయడం అలవాటుగా మారింది. మా హయాంలో మూడేళ్ల పాటు మేం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, తోపులాటలు లేకుండా వైకుంఠద్వారా దర్శనం భక్తులకు అందించగలిగాం. మరోవైపు స్థానికులకు కూడా పెద్ద ఎత్తున దర్శనం లభిస్తే.. దాన్ని ఓట్ల రాజకీయం అంటూ బీ ఆర్ నాయుడు మాట్లాడుతున్నారు.
అంటే స్థానికులు భక్తులు కాదా, వాళ్లు దైవ ద్రోహులా ? అని ఆయన్ను ప్రశ్నిస్తున్నాను. స్థానికుల మీద మీకు ఎందుకు ఇంత కోపం ? వైకుంఠ ఏకాదశి నాడు దర్శనాలకు 26 మంది పీఠాధిపతులు అదనంగా వైఖానస ఆగమపండితులు, పెద్దజీయర్ స్వామివంటి గొప్పవాళ్లు తీర్మానం చేసి ఇచ్చిన సలహాలను పాటించకపోవడం అంటే దైవద్రోహం చేసినట్టే ? దేవుడికి అపచారం చేసినట్టే ? భక్తుల మనోభావాలను కాలరాసినట్టే? నాలుగేళ్లు విజయవంతంగా అమలవుతున్న ఆ నిర్ణయాన్ని ఏ రకంగా తప్పుబడతారు ? తప్పు అని చెప్పడం .. దీన్ని మీరు నిర్వహించలేక చేతులెత్తేయడం తప్ప మరో కారణం కాదు.
మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి..
జగన్ ప్రభుత్వ హయాంలో మూడేళ్లలో 30 లక్షల మందికి పైగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే… మీరు చేస్తున్న పని ఏంటి? భక్తుల అభిప్రాయం, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఆగమ సలహామండలి పండితుల మీద ఒత్తిడి తెచ్చి, గతంలో 32 మంది మహానుభావులు అభిప్రాయాలను తొక్కిపెడుతూ మీరు తీసుకున్న నిర్ణయం తీవ్ర ఆక్షేపణీయం.
సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు నిర్వహించాలే తప్ప…వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని రెండు రోజులకే కుదించాలన్న కుఠిల ప్రయతాన్ని మానుకోవలాని బీ ఆర్ నాయుడుకి సూచన చేస్తున్నాను. మీరు గనుక పది రోజుల నుంచి రెండు రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలను తగ్గిస్తే… 110 కోట్ల మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపర్చినట్లేనన్న విషయం గుర్తుంచుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. టీటీడీ పాలక మండలి తక్షణమే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.