– “సోషల్ మీడియా మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ – ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ట్రెడిషనల్ మీడియా – యాన్ అనాలిసిస్.” అంశంపై రవి కుమార్ బొప్పనకు నాగార్జున విశ్వ విద్యాలయం డాక్టరేట్
– డిజిటల్ కంటెంట్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయాలి
అమరావతి : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక డాక్టరల్ అధ్యయనం దేశంలో మీడియా రంగంలో సమగ్ర సంస్కరణలు అవసరమని సూచించింది. ఆచార్య ఆర్.శివరామ ప్రసాద్ మార్గదర్శకత్వంలో రవికుమార్ బొప్పన చేపట్టిన పరిశోధనకు విశ్వ విద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది.
“సోషల్ మీడియా మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ – ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ట్రెడిషనల్ మీడియా- యాన్ అనాలిసిస్.” శీర్షికన చేపట్టిన పరిశోధనకు విశ్వ విద్యాలయ పరిశోధక విభాగం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. డాక్టర్ రవి కుమార్ బొప్పనకు మీడియా రంగంలో ముప్పై ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌కు మీడియా లైజన్ ఆఫీసర్‌గా, గవర్నర్‌కు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖలకు మీడియా సమన్వయకర్తగా ఉన్నారు. బొప్పనకు ఎంబీయే, ఎంజేఎంసీ, బీఎల్, ఎం.కాం (అగ్రి. ఎకానామిక్స్), హెచ్డీసీఎం., డిగ్రీలు ఉన్నాయి. ఆయన ఏలూరు జిల్లా ( పూర్వపు కృష్ణా జిల్లా) ముదినేపల్లి మండలం పెద్దపాలపర్రు గ్రామానికి చెందినవారు.
డా. బొప్పన తన పరిశోధనలో సోషల్ మీడియా నకిలీ ప్రచారాన్ని అడ్డుకునేందుకు మీడియా ఎడ్యుకేషన్ చట్టం తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు డిజిటల్, మీడియా లిటరసీపై అవగాహన పెంచాలని చెప్పారు. సోషల్ మీడియా వల్ల సమాచారం వేగంగా విస్తరించినా, అపోహలు, అసత్య వార్తలకు సైతం అదే కారణం అని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా కొన్ని సందర్భాలలో సంప్రదాయ మీడియా విశ్వసనీయతకు సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు.
ప్రాంతీయ స్థాయిలో డిజిటల్ సాధికారత, మీడియా ఇన్నోవేషన్ ల్యాబ్‌లు, అసత్య వార్తల నియంత్రణ వంటి అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. నైతిక జర్నలిజాన్ని ప్రోత్సహించే ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. డాక్టర్ బొప్పన ఏఐ ఆధారిత కంటెంట్ వెరిఫికేషన్ వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు.
సమాచారం నిజమా కాదా తెలుసుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2000లో మార్పులు చేసి, *డిజిటల్ కంటెంట్ రెగ్యులేటరీ అథారిటీ (డీసీఆర్ఏ)*ను ఏర్పాటు చేయాలని సూచించారు.