– రాంకీ ఉల్లంఘనలపై ఏం సమాధానం చెబుతారు?
– శాంపిల్స్ వివరాలు ఎందుకివ్వడం లేదు?
– కాలుష్య కారకులపై చర్య తీసుకోకపోతే నేనే ప్రజాఉద్యమం ప్రారంభిస్తా
– మొల్లేటి గెడ్డ లో రాంకీ కాలుష్యకారకాలపై ఏమి సమాధానం చెప్తారు?
– పీసీబీ అధికారిని హడలెత్తించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్
– రాంకీ ఫార్మా వ్యర్ధాలపై పూర్తి స్థాయి నివేదికకు పరవాడ మండల సర్వసభ తీర్మానం
– వచ్చే సమావేశంలోగా శాంపిల్స్ వివరాలు, నివేదిక ఇవ్వాల్సిందే
– ఎమ్మెల్యే, ఎంపీటీసీ సభ్యుల ప్రశ్నలకు జవాబు ఇవ్వని పీసీబీ అధికారి
పరవాడ: స్థానిక మోల్లేటి గెడ్డ లో జల కాలుష్యానికి కారణమైన రామ్కీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కాలుష్యం నియంత్రణ మండలి అధికారులను మండల సర్వసభ్య సమావేశంలో నిలదీశారు.
పరవాడ ఫార్మాసిటీలో తీవ్ర కాలుష్యం కారణంగా సమీప గ్రామాల్లో గెడ్డలు, వాగులు చెరువులు, కాలుష్య మయంగా మారాయని తరచూ చెరువులులో చేపలు మృతి చెందుతున్నాయని నీరు తీవ్రమైన రసాయనాల దుర్వాసన రావడంతో చెరువు కింద పంటల పండించే రైతులు పంట పండించడం మానుకున్నారని సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు సమావేశం దృష్టికి విషయాన్ని తీసుకువచ్చారు.
ఇదే సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల మాత్రం.. సమావేశానికి హాజరైన కాలుష్య నియంత్రణ మండలి అధికారిని కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై చర్యలకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు.
పరవాడ సమీపంలో గల మొల్లేటి గెడ్డ లో ఫార్మా కాలుష్య జలాలు కలుస్తున్నాయని ఫిర్యాదులు వస్తు న్నా, వాటిపై శాంపిల్స్ సేకరిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం, వాటి వివరాలను బహిర్గతం చేయడానికి ముందుకు రావడంలేదని పరవాడ ఎంపీటీసీ పైలా శ్రీనివాసరావు , పరవాడ సర్పంచ్ సిరపురపు అప్పలనాయుడులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో ఎమ్మెల్యే పంచకర్ల .. మొల్లేటిగడ్డలో కాలుష్య జలాలకు కారణమైన రాంకీ పై ఏ విధమైన చర్యలు తీసుకున్నారని కాలుష్యం నియంత్రణ మండలి అధికారులను ప్రశ్నించారు. దీనిపై సమావేశంలో పాల్గొన్న అధికారి మాత్రం ఏ విషయం చెప్పలేక మౌనం వహించారు. ఫార్మాసిటీలో పరిశ్రమల కాలుష్యం పై స్పష్టత కోసం, మండల సర్వసభ్య సమావేశంలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు ఎంపీపీ వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాస్ ప్రకటించారు.
పరవాడ పరిసర ప్రాంతాలలో గెడ్డ వాగులు చెరువులలో కలుస్తున్న ఫార్మా వ్యర్ధాలు ఏ పరిశ్రమకు చెందినవి లేదా వ్యర్థ జలాలు సేకరిస్తున్న రాంకీ దా అనే విషయాన్ని నిగ్గు తేల్చాలని ఈ విషయంపై వచ్చే మండల సమావేశం లోపల పూర్తిస్థాయి నివేదికను అందించాలని, కాలుష్యం నియంత్రణ మండలి అధికారులను కోరుతూ తీర్మానం చేశారు.
ఇష్టం వచ్చినట్లు పరవాడ ఫార్మసిటీ పరిసర గ్రామాలలో కాలుష్య జలాలను వదిలివేయడం వంటి విషయంపై ఇకపై కఠిన చర్యలు తీసుకునేందుకు అవసరమైతే ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువస్తానని ఎమ్మెల్యే పంచకర్ల సభలో సభ్యులకు హామీ ఇచ్చారు. మొల్లేటి. గెడ్డ లో కలుస్తున్న వ్యర్థ జలాలపై వెంటనే మరోమారు పరిశీలించి, ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కాలుష్య జలాలు గెడ్డ వాగులు, చెరువులలో కలవకుండా తగిన చర్యలు తీసుకునేందుకు కాలుష్యం నియంత్రణ మండలి అధికారులు చర్యలు తీసుకోవాలని తాను కూడా ఆదేశిస్తున్నానని అన్నారు.
పరిశ్రమల వస్తే ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఉద్యోగసమస్య తీరాలి అనే విషయాలలో ముందు ఉండాల్సిన ఫార్మా పరిశ్రమల మాత్రం.. తమ వ్యర్ధ జలాలను బహిరంగంగా బయటికి వదిలేయడంతో, సమీప ప్రాంతంలో భూగర్భ జలాలు కాలుష్యం మాయంగా మారేందుకు అవకాశం ఉంది. దీని విషయంలో వెంటనే కాలుష్య నియంత్ర మండలి అధికారులు చర్యలు తీసుకోకపోతే, తానే ప్రజలతో పాటు ఉద్యమానికి సిద్ధమవుతానని ఎమ్మెల్యే పంచకర్ల ప్రకటించారు.
ఫార్మా కాలుష్య జలాల విషయంపై మండల పరిషత్ లో తీర్మానం ఆమోదించారా అనే విషయాన్ని స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి రమేష్ నాయుడును వివరణ కోరగా మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ ,సభ్యులు సూచన మేరకు ఫార్మా కాలుష్య వ్యర్థ జలాలు వస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకునేందుకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కోరుతూ తీర్మానం చేశామని స్పష్టం చేశారు.
గెడ్డ వాగులు చెరువులలో ఫార్మా వ్యర్ధాలు కలవకుండా తగిన విధంగా చూడాలని, పరిశ్రమలకు హెచ్చరిక జారీ చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. కాలుష్యానికి పాల్పడుతున్న రాంకీ మరియు ఇతర పరిశ్రమలపై వ్యర్థ జలాలు బయటకు వస్తున్న విషయంపై కారణాలను పరిశీలించి పూర్తి వివరాలను సభ ముందు ఉంచాలని కోరామని అన్నారు.