– త్వరలో ఉత్తర్వులు
– ఈ నెలలోనే నర్సాపురం-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పొడిగింపుపై ప్రకటన
– జీఎస్టీ స్లాబులు తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయం
– విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు ఎటువంటి నష్టం లేదు
– కలెక్టరేట్ నిర్మాణంపై అనవసర ఆందోళన వద్దు
– ప్రజలకు అనుకూలమైన ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం
– మీడియాతో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
భీమవరం : నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తూ జాతీయ రహదారుల నిర్మాణం, కొత్త రైల్వే ప్రాజెక్టుల సాధనపై దృష్టి సారించినట్టు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. స్థానిక జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వివిధ జాతీయ రహదారుల నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయల నిధులు సాధించామని, 2,500 కోట్లతో చేపట్టాలనుకున్న ఎన్‌హెచ్ 165 వయా భీమవరం బైపాస్ రోడ్డు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని అయితే, రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ఆర్ రేట్లు పెంచడంతో ప్రాజెక్టు వ్యయం రూ. 3,200 కోట్లకు పెరిగిందని, అదనంగా పెరిగిన రూ. 700 కోట్లకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా అంగీకరించారని శ్రీనివాస వర్మ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం 3200 కోట్లతో డిపిఆర్ కూడా సిద్ధమైంది అన్నారు.
ఈ నెలలోనే నర్సాపురం- చెన్నై వందే భారత్
చెన్నై-విజయవాడ వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగించాలని రైల్వే మంత్రిని, రైల్వే ఉన్నతాధికారులను కలిసి పలుమాలు చర్చించినట్టు తెలిపారు. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమైనప్పటికీ, అన్ని సమస్యలను పరిష్కరించామని, ఈ నెలలోనే నరసాపురం నుంచి చెన్నై వరకు వందే భారత్ రైలు పొడిగింపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు.
అత్తిలి రైల్వే స్టేషన్ లో రెండు ఎక్స్‌ప్రెస్ లకు హాల్ట్
అత్తిలి రైల్వే స్టేషన్లో కరోనా మహమ్మారి తర్వాత ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఇచ్చిన హామీ మేరకు తాను రైల్వే ఉన్నతాధికారులతో చర్చించానని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. తన విజ్ఞప్తికి స్పందించిన రైల్వే శాఖ అధికారులు పూరీ-తిరుపతి, కాకినాడ-చెన్నై సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లు అత్తిలిలో హాల్ట్ ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారని, రెండు రోజుల్లో ఈ విషయంపై ఉత్తర్వులు విడుదల అవుతాయని ఆయన వెల్లడించారు.
నరసాపురం-అరుణాచలం వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును మరో నెల పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారని, ఈ రైలును రెగ్యులర్ రైలుగా మార్చాలని తాను చేసిన విజ్ఞప్తికి సానుకూల స్పందన వచ్చిందని, అరుణాచలం రైలుకు రెగ్యులర్ రైలుగా అనుమతి లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లను ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్రమంత్రి వర్మ తెలిపారు.
తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ. 26 కోట్లు కేటాయించిందని, అదనంగా మరో రూ. 18 కోట్లు మంజూరు చేయించామని ఆయన పేర్కొన్నారు. అలాగే, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ షెడ్ రహదారి నిర్మాణానికి రూ. 7.50 కోట్లు మంజూరు చేయించామని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు.
జీఎస్టీ భారీగా తగ్గించటం గొప్ప నిర్ణయం
జీఎస్టీ అమలులో మార్పులు, సంస్కరణలు తీసుకువస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగానే, జీఎస్టీ కౌన్సిల్ స్లాబులను తగ్గించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. ఈ నిర్ణయం సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిత్యావసర వస్తువులు, వాహనాలు, వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ భారీగా తగ్గించామని ఆయన వివరించారు.
ఆరోగ్య బీమాపై జీఎస్టీ తొలగింపు
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించిన కేంద్ర ప్రభుత్వం, ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్య బీమా, వ్యక్తిగత భీమాలపై ఉన్న 18% జీఎస్టీని పూర్తిగా తొలగించిందని, ఇది అభినందనీయమని మంత్రి వర్మ పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంటే, బాధ్యత లేని కొన్ని పార్టీలు అర్థం లేని విమర్శలు చేయడం రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని ఆయన కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు భరోసా
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నష్టాల నుండి లాభాల బాట పట్టించేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. కేంద్రం రూ. 11,500 కోట్లు ప్లాంట్‌ను కాపాడేందుకే ఇచ్చిందని, ప్లాంట్ భవిష్యత్తు ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులతో సహా అందరూ సహకరించాలని ఆయన కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు ఎటువంటి నష్టం లేదని, కార్మికుల సహకారంతో ప్లాంట్‌ను లాభాల బాట పట్టిస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ధీమా వ్యక్తం చేశారు.
కలెక్టరేట్ నిర్మాణంపై స్పష్టత
కలెక్టరేట్ అనేది ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ అని, అది ఎక్కడ నిర్మిస్తారనే అనవసరమైన ఆందోళన అవసరం లేదని కేంద్ర శ్రీనివాస వర్మ అన్నారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు అనువుగా ఉండే ప్రాంతంలో, విశాలమైన పార్కింగ్ స్థలం, అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. కలెక్టరేట్ నిర్మాణ విషయంలో రాజకీయాలకు, ప్రతిష్ఠకు తావు లేదని, రాజకీయపరమైన అభిప్రాయాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు.