– మణిపూర్ లో అత్యంత వెనుకబడిన నోనీ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
– కేంద్ర పథకాల అమలు, నోనీ జిల్లా అభివ్రుద్ధి, సంక్షేమంపై అధికారులతో సమీక్ష
– కేంద్ర పథకాలు లబ్దిదారులకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరిన కేంద్ర మంత్రి
– జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, అభివ్రుద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఎదురువుతున్న సవాళ్లను కేంద్ర మంత్రికి విన్నవించిన అధికారులు
-మణిపూర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఉద్ఘాటించిన కేంద్ర మంత్రి
మూడు రోజుల మణిపూర్ రాష్ట్ర పర్యటనలో భాగంగా నోనీ జిల్లాలో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని సందర్శించారు. మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నగరాన్ని అస్సాం ద్వారా భారత రైల్వే నెట్వర్క్తో అనుసంధానం చేసే జిరిబామ్–ఇంఫాల్ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులో ఈ రైల్వే బ్రిడ్జి ఒకటి.
వాస్తవానికి ఈ రైల్వే లేన్ ప్రాజెక్ట్ మొత్తం వ్యయ అంచనా రూ.21,885 కోట్లు. ఈ రైల్వే లేన్ కు ప్రధాన ఆకర్షణ ఈ ఎత్తైన రైల్వే బ్రిడ్జి (Bridge). సుమారు ₹650 కోట్లు వ్యయంతో 703 మీటర్ల పొడవున 7 పిల్లర్లతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఇందులో 2 పిల్లర్లు 141 మీటర్ల ఎత్తు కలిగి ఉండటం ప్రపంచ రికార్డు అని మణిపూర్ అధికారులు చెప్పారు.
ఇక జిరిబామ్–ఇంఫాల్ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ విషయానికొస్తే…. 110 కి.మీల మేరకు నిర్మిస్తున్న ఈ రైల్వే లేన్ పనుల్లో భాగంగా ఏకంగా 55 సొరంగ (టన్నెల్స్) మార్గాలను నిర్మిస్తున్నారు. వీటి పొడవు 66 కి.మీలు. అందులో 10.25 కిలోమీటర్ల పొడవైన సొరంగం కూడా ఒకటి నిర్మాణంలో ఉంది.
ఈ నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతి పొడవైన రైల్వే సొరంగాల్లో కూడా ఒకటి కానుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అధికారులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు తెలిపారు. 2028 డిసెంబర్ నాటికి ఈ రైల్వే లేన్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని ఆద్యంతం పరిశీలించారు. దాదాపు అర కిలోమీటర్ మేరకు నడిచి నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నా వాటన్నింటినీ అధిగమిస్తూ నిర్ణీత సమయంలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కష్టపడుతున్న అధికారులను, ఇంజనీరింగ్ సిబ్బందిని కేంద్ర మంత్రి అభినందించారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక మణిపూర్ రాష్ట్రం భారత రైల్వే పటంలో స్థిరమైన చోటు సంపాదిస్తుందనే నమ్మకాన్ని బండి సంజయ్ వ్యక్తం చేశారు. ప్రజల రాకపోకలకు, రవాణా సదుపాయాలకు, వర్షాకాల ఆటంకాలను అధిగమించడానికి ఈ రైల్వే లేన్ ఎంతగానో ఉపయోగపడనుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూరదృష్టి, అకుంఠిత దీక్షకు ఇది తార్కాణంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదన్నారు.
భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో, కొండ కోనల్లో నివసించే చిట్టచివరి ప్రజలందరికీ అభివ్రుద్ది, సంక్షేమ ఫలాలు అందించాలనే మహోన్నత ఆశయంతో పాలన కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
అంతకుముందు కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఉదయం ఇంపాల్ నుండి హెలికాప్టర్ లో నోనె జిల్లాకు చేరుకుని జిల్లాలో అమలవుతున్న కేంద్ర సంక్షేమ, అభివ్రుద్ది పథకాలను సమీక్షించారు. కలెక్టర్ శరత్ చంద్ర, జిల్లా ఎస్పీతోపాటు తమెంగ్లాంగ్ జిల్లాకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఈ సమీక్షా సమావేశంలో పాల్గొని పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలను, అవరోధాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
జిల్లాలో చేపడుతున్న అభివ్రుద్ధి పనుల పురోగతిని వివరిస్తూ… వాటిని పూర్తి చేసే క్రమంలోనూ ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. 2016 నోనీ జిల్లా ఏర్పాటైనప్పటికీ… ఇప్పటికీ జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రి లేదని, జిల్లా కోర్టు ఏర్పాటు కాలేదని, స్కూళ్లు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కొరత తీవ్రంగా ఉందని, చాలా స్కూళ్లకు టీచర్లు లేరని, 59 వేల జనాభాకు 13 మంది మాత్రమే డాక్టర్లు ఉన్నారని తెలిపారు.
ఆయా సమస్యల పరిష్కారంలో కేంద్ర సహకారాన్ని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మణిపూర్ అభివ్రుద్ధి కోసం కేంద్రం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని చెప్పారు. అధికారులు మరింత కష్టపడి పనిచేయాలని కోరారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు రూపొందించి పంపాలని, కేంద్ర పెద్దలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. సమీక్ష అనంతరం కేంద్ర మంత్రి ప్రజా ప్రతినిధులు, స్వయంసహాయక సంఘాలు (SHGs), స్థానిక నాయకులతో భేటీ అయ్యారు.
వివిధ సమస్యలను విన్నవిస్తూ వారు ఇచ్చిన వినతి పత్రాలను తీసుకుని వాటి పరిష్కారంపై ద్రుష్టి సారిస్తానని చెప్పారు. అనంతరం కార్యాలయ ఆవరణలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రాకకు గుర్తుగా మొక్కను నాటించారు. మరోవైపు నోనీ జిల్లా ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సైతం కేంద్ర మంత్రి సందర్శించి… నిర్వాహకులతో మాట్లాడారు.