ఒకానొక సిరా చుక్క… లక్షలాది మెదళ్లకు కదలిక తెస్తుంది. అలాగే భావోద్వేగాన్ని మేలుకొల్పే ఒక్కొక్క గీతిక నిలువెల్ల తనవును పులకరింపజేస్తుంది. పదిమంది కలిసి పాడినప్పుడు… తమ అందరి గుండెలయ ఒక్కటేనని అనిపిస్తుంది. పదం పదం కలసిపాడటమే కాదు… కదం కదం కలిపి తాము అంతా నడువగలమని… ఏ పనినైనా సాధించగలమనే విశ్వాసాన్ని కలిగిస్తుంది.
దేశమాత పట్ల భక్తిభావాన్ని, కర్తవ్యం పట్ల నిష్ఠను, నరనరానికి, కణకణానికి వ్యాపింపజేయటంలో సంగీతానికి గల శక్తి అసామాన్యమైనది. 1875లో బంకించంద్రుడు రాసిన వందేమాతర గీతం…తర్వాతి కాలంలో కోట్లాది మంది భారతీయుల గొంతుకగా మారింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో సమరశంఖనాదం అయ్యింది.
అధర్వణవేదంలోని పృథివీ సూక్తంలో భూమిని తల్లిగా….ఆ భూమిపై నివసించేవారిని ఆమె పుత్రులుగా అభివర్ణించారు భారతీయ రుషులు. మాతా భూమిః పుత్రోహంపృథివ్యాః…ఈ పుడమి నా తల్లి.., నేను ఆమె పుత్రుడను. ఈ భావన భారతీయ సంస్కృతిలో ప్రధానమైన అంశం. భారతీయుల్లో నెలకొన్న నిరాశను తొలగించి మాతృభూమి కొరకు సర్వస్వాన్ని సమర్పించే విధంగా జాతి జనులను జాగృతం చేసేందుకు రచించిన గీతమే వందేమాతరం.
భారత్ దాస్యానికి ఆంగ్లేయులతోపాటు….దేశ భక్తిలేని భారతీయులు కూడా ఓ కారణమనే ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయులలో నెలకొన్న నిరాశను తొలగించి మాతృభూమి కొరకు సర్వస్వాన్ని సమర్పించే విధంగా వారిని తీర్చిదిద్దటం చాలా అవసరమని ఆయన ఆలోచించారు. ఇలా తీర్చిదిద్దాలంటే అందరిలో దేశభక్తిని, మాతృభూమి పట్ల ప్రేమను నింపాలి. దైవం తర్వాత మాతృభూమికే ప్రాముఖ్యతను నివ్వాలనే భావనతో…, వందేమాతరమ్ అనే గీత రచనకు ఆయన సంకల్పించారు.
క్రీ.శ. 1875 నవంబర్ నెల, కార్తిక మాసం రోజున…వందేమాతర గీతం ఆయన కవితారూపంలో ఆవిర్భవించింది. కర్తవ్య నిర్వహణకు కావలసిన జ్ఞానం, దాని కొరకు కష్టపడే సంసిద్ధత, ధ్యేయం సాధించితీర్తాననే ఆత్మవిశ్వాసం ఈ గీతంలో ప్రతిబింబించాయి.
ఆరు చరణాలున్న ఈ గీతంలో సంస్కృత పదాలతో పాటు కొన్ని బెంగాళీ భాషాపదాలున్నాయి. అయినా ఈ గీతం అందరి హృదయాలను స్పృశిస్తుంది. 1875లోనే ఆయన సంపాదకత్వంలో ప్రచురితమయ్యే బంగ దర్శన్ పత్రికలో ప్రచురించబడింది ఈ గీతం.
ఈ గీతం అచ్చు అయినప్పుడే…దీని భావం అర్థం కావాడానికి బెంగాల్ ప్రజలకు 30 సంవత్సరాలు పడుతుందని బంకిం చంద్రుడు ఊహించారట…! సరిగ్గా బంకిం చంద్రుడు ఊహించినట్లే జరిగింది. బంగ దర్శన్ పత్రికలో ఆయన 1880-1881 మధ్యకాలంలో ఆనందమఠ్ నవలను ధారావహికగా ప్రచురించారు. ఈ నవలలో వందేమాతర గీతాన్ని యథాతథంగా పొందుపర్చాడు.
ఆనంద మఠం నవలలో ఆ గీతాన్ని పాడుతూ భవానందుడు…మాకు తల్లి లేదు, తండ్రి లేడు, అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు లేరు. భార్యాబిడ్డలు లేరు, ఇల్లూ వాకిలీ లేదు. మాకున్నదొక్కటే…, సుజల, సుఫల, సస్యశ్యామల అయిన భారత మాతయే… మేమందరం ఆమె సంతానం…!
బంకించంద్రుడికి కూడా వందేమాతరంలోని పదాలకు అద్భుతమైన ప్రభావం ఉందని…ఇది దేశ ప్రజలందరిని ఒక్కటి చేస్తుందనే ఆత్మవిశ్వాసం ఆయనలో ఉండేది. ఈ గీతం శాశ్వాతంగా నిలుస్తుంది. దేశ వాసుల హృదయాలను ఆకర్షిస్తుందని…జయిస్తుందని ఆయన తన అక్కకుమారినితో కూడా అన్నారని అంటారు. తర్వాతి కాలంలో ఈ వందేమాతరమే….స్వతంత్ర సాధానాయజ్ఞానికి తారక మంత్రమైంది.
కులం, భాష, ప్రాంతం, తెగలు అనే బేధాలు లేకుండా దేశ ప్రజలందరూ ఒక్కటిగా ఈ గీతాన్ని గానం చేశారు. ఇది భారతీయ ఏకాత్మతను సాక్షాత్కరింపజేసిన గీతం..! మదాంధకారంతో నిదురపోతున్న ఆంగ్లేయులను ఉలిక్కిపడేలా చేసిన శరాఘాతం, ఆబాలగోపాలం పెదవులపై తొణకిలాడిన స్వరాజ్య గానం వందేమాతరం.
వందేమాతర గీతంలో కాని, నినాదంలో కాని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఏమిలేదు.. అయినా కూడా ఆంగ్లేయ ప్రభుత్వం వణికిపోయింది. ఇది మామూలు భక్తి పాట కాదు.. ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆవేశపూరితం చేసిన పాట..! ముఖ్యంగా భారతీయ యువతను ఊపేసిన పాట… నవ్వుతూ…నవ్వుతూ తమ జీవితాలను భారతమాత చరణాల వద్ద సమర్పించగల మనోధైర్యాన్ని అందించింది.
ఇంతకీ ఈ గీతాన్ని తొలిసారిగా స్వరపరిచి పాడిన గాయకుడు ఎవరు…? వందేమాతరం గీతాన్ని 1875లో రచించాడు బంకిం చంద్రుడు..! 1876లోనే యదునాథ భట్టాచార్య అనే కవి మల్హార్ రాగంలో ఈ గీతాన్ని తొలిసారిగా పాడారు. 1882లో ఆనందమఠం నవల పుస్తక రూపంలో ప్రచురితమైంది. అప్పుడు ఈ గీతానికి మరింత ప్రాచుర్యం వచ్చింది. 1885లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ దేశిరాగంలో వందేమాతర గీతాన్ని స్వరబద్ధం చేశారు. 1894 ఏప్రిల్ 8వ తేదీనాడు బింకింద్రుడు పరమపదించాడు.
ఇక 1896లో కాంగ్రెస్ మహాసభలు కలకత్తాలో జరిగాయి. ఈ సమావేశాల ప్రారంభంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దేశీ రాగంలోనే మరోసారి వందేమాతర గీతం పాడారు. ఈ సమావేశాలకు మహమ్మద్ రహమతుల్లా సయానీ అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్ సభలలో వందేమాతరం పాడటం ఇక అప్పటి నుంచే ప్రారంభమైంది.
1905 జులై 20న ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం…బెంగాల్ ను విభజించింది. దీనిపై బెంగాల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందే బెంగాల్ లో స్వదేశీ ఉద్యమాన్ని నిర్వహించేందుకు కొంతమంది జాతీయవాద నాయకులు ప్రణాళిక సిద్ధం చేశారు. బ్రిటీష్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇంగ్లీషు వారు తయారు చేసిన వస్తువులను వాడరాదని తీర్మానించారు కూడా..!
ఈ సమయంలోనే బ్రిటీష్ ప్రభుత్వం….బెంగాల్ విభజన నిర్ణయం తీసుకుంది. ఇది దేశ ప్రజలను మరింత ఆగ్రహానికి గురి చేసింది. బెంగాల్ విభజనను వ్యతిరేకించేందుకు వందేమాతర నినాదం ప్రజలందరికి ఒక ఆయుధంగా మారింది. 1905 ఆగస్టు 7వ తేదీనాటి చారిత్రాత్మక సమావేశంలో వందేమాతర నినాదాన్ని స్వాతంత్ర్యద్యమ పోరాటానికి పొలికేకగా రూపొందించింది. స్వదేశీ ఆత్మ…వందేమాతరమని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అనడానికి కారణం కూడా ఇదే. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం ఈ నినాదంతో వణికిపోయింది.
వందేమాతరం….గీతం, వందేమాతర నినాదం భారతీయుల్లో..ముఖ్యంగా యువతలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని పెంచుతోందని గ్రహించిన బ్రిటీష్ ప్రభుత్వం దీనిపై నిషేధాన్ని విధించింది. ఈ నిషేధం భారతీయుల్లో మరింత పట్టుదలను పెంచింది. బెంగాల్ లో చిన్నగా ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం క్రమంగా మరికొన్ని ప్రాంతాలకు విస్తరించింది. స్వదేశీ ఉద్యమం జాతీయతా భావ ప్రదర్శనే. స్వదేశీ ఆచరణలో దేశభక్తి, ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక ఆయుధం, వందేమాతరానికి కార్యచరణ స్వదేశీ అని మహర్షి అరవిందులన్నారు.
బ్రిటీష్ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా కూడా యువతలోని భావోద్వేగాన్ని మాత్రం ఆపలేకపోయింది. మా ఒక్క శిరస్సే ఉంది…తల్లి భారతి ముందు వంచి నమ్రతతో నమస్కరించటానికి ప్రపంచంలోని ఏ శక్తి మా తలలను వంచలేదు. వందేమాతరం మా హృదయపు చప్పుళ్ళు అంటూ ఈ దేశ యువత భావించింది. న్యాయస్థానంలో సుశీల్ సేన్ అనే వీరుడిని కొరడాలతో కొట్టినా, ఖుదీరాం బోస్, ప్రఫ్రుల్ల సత్యేన్ వంటి యువ విప్లవ కిశోరాలు ఆత్మబలిదానం చేసినా వందేమాతరమే వారి కళ్లల్లో జ్యోతి.
వారి గుండెల్లో ధైర్యం. ఎందరో యవకులు వందేమాతరం అంటూ ఉరికంబమెక్కారు. 1906 ఏప్రిల్ 14న బారిసాల్ లో జరిగిన ప్రజాప్రదర్శనలో చిత్తరంజన్ గుహ అనే విద్యార్థికి లాఠీఛార్జీలో తలపగిలింది. అయినా అతను వందేమాతర నినాదాన్ని ఉచ్ఛరించటం మాత్రం ఆపలేదు.
బెంగాల్ లో రాజుకున్న వందేమాతర ఉద్యమం….దేశ ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసింది. దీంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు జాతీయనాయకులు రంగంలోకి దూకారు. బిపన్ చంద్రపాల్…వంగ దేశం నుంచి మొదలు పెట్టి మద్రాసు వరకు పర్యటించి ఉద్యమాన్ని దేశ వ్యాప్తం చేసేందుకు తీవ్రంగా శ్రమించారు.
1906 ఏప్రిల్ లో వందేమాతరం పేరుతో బెంగాలీ, ఆంగ్ల భాషల్లో పత్రికలు కూడా ప్రారంభమయ్యాయి. 1906 డిసెంబర్ లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో సోదరి నివేదిత భారత దేశానికి ఓ ధ్వజాన్ని ఆవిష్కరించింది. ఆ ధ్వజంపై వందేమాతరం అని వ్రాసి వుంది. 1908 ఆగస్టు 18న జర్మనీలో భారత్ తరపున మేడమ్ కామా ఎగురవేసిన పతాకంపై కూడా వందేమాతరం అని వ్రాసి వుంది. వందేమాతర ఉద్యమాన్ని దేశ వ్యాప్తం చేసేందుకు బిపిన్ చంద్రపాల్ దక్షిణ భారతంలో పర్యటించారు.1907 జులై 21న కోస్తా ఆంధ్రలోని రాజమండ్రిలో పెద్ద సభను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏపీకి చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. రాజమండ్రి లో ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు
బిపిన్ చంద్రపాల్ సభకు హాజరైనందుకు 200 మంది విద్యార్థులకు జరిమానా విధించారు. కాకినాడలో ఆరోగ్యశాకాధికారి మేజర్ కెంప్ ఓ విద్యార్థిని తీవ్రంగా కొట్టాడు. దీనిపై ఆగ్రహించిన ప్రజలు మేజర్ కెంప్ బస చేసిన క్లబ్ పై దాడి చేశారు. అటు ఓ పోలీసు కానిస్టుబుల్ తన పై అధికారిపై దాడి చేశాడు. 1907 ఆగస్టు 30న కాలేజీ విద్యార్థులు వందేమాతరం నినాదాలు చేస్తూ పురపాలక సంఘంపై దాడి చేశారు.
బిపిన్ చంద్రపాల్ మద్రాసు లో కూడా పర్యటించారు. మెరీనా బీచ్ లో బ్రహ్మాండమైన బహిరంగ సభను నిర్వహించారు. వేలాది మంది పాల్గొన్న ఈ సమావేశంలో మొదటి నుంచి చివరకు కూడా వందేమాతర నినాదాలు మారుమ్రోగాయి. ఇటు బెంగాల్ లోని బారిసాల్ లో పోలీసు అత్యాచారాల ఫలితంగా తలపగిలిన చిత్తరంజన్ గుహ వందేమాతరం నినాదాన్ని ఆపకుండా పలకడం మరికొంతమందికి ప్రేరణ నిచ్చింది.
బ్రిటీష్ ప్రభుత్వం వందేమాతరం పత్రికపై కేసు కూడా నమోదు చేసింది. ఈ కేసులో బిపిన్ చంద్రపాల్ ను అరెస్టు చేసింది. ఆయన్ను కోర్టు కు తీసుకువచ్చినప్పప్పుడు అక్కడ గుమికూడిన జనం పెద్ద సంఖ్యలో వందేమాతర నినాదాలు చేశారు. సుశీల్ కుమార్ అనే 15 సంవత్సరాల బాలుడు బ్రిటీష్ పోలీసు అధికారిపై దాడి చేశాడు. అతన్ని పట్టుకుని మేజిస్ర్టేట్ ముందు హాజరుపర్చగా 15 బెత్తపు దెబ్బలను శిక్షగా విధించారు. ఈ దెబ్బలను బాలుడైన సుశీల్ కుమార్ వందేమాతరం అంటూ భరించాడు.
1938లో హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వందేమాతర ఉద్యమం నిర్వహించారు. 1939లో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో సత్యాగ్రహం నిర్వహించారు. పోలీసులు సత్యాగ్రహంలో పాల్గొన్న యువకులపై లాఠీచార్జ్ చేశారు. లాఠీ దెబ్బలకు వెరవకుండా రామచంద్రరావు అనే కార్యకర్త…స్మృహ కోల్పోయేవరకు వందేమాతర నినాదాలు చేశాడు. ఆయన్న ప్రజలు జీవితాతం వందేమాతరం రామచంద్రరావుగానే పిలిచారు.
ఎందరో విప్లవకారులు…, యువకులు వందేమాతరం నినాదం సాక్షిగా తమజీవన వికసిత పుష్పాలను భారతమాత చరణాల వద్ద సమర్పించారు. స్వాతంత్ర్య సమరంలోనే కాదు…ఇప్పటికి కూడా వందేమాతరం అనే రెండు పదాలు… భారతీయులకు నిత్య స్ఫూర్తి…!
1896లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో తొలిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభలను ప్రారంభించే ముందు వందేమాతరం ఆలపించడం సంప్రదాయంగా మారింది. అయితే కొంతమంది నేతలు వందేమాతర గీతాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. భారత రాజ్యాంగ కూడా జాతీయ గేయంగా వందేమాతరాన్ని గుర్తించింది. స్వాతంత్ర్యం సిద్ధించి 69 ఏళ్లు కావస్తున్నా కూడా ఇప్పటికి ఈ గీతంపై మన నేతలు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు.
1923లో కాకినడాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు మౌలానా మహమ్మదాలి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సభల్లో వందేమాతరం పాట పాడటానికి పండిత విష్ణుదిగంబర పులస్కర్ సిద్ధం కాగానే అధ్యక్షుడు వ్యతిరేకించాడు. అయినా కూడా పులస్కర్ పట్టించుకోకుండా వందేమాతరం పాడారు. దీంతో మహమ్మదాలి సభ నుంచి వెళ్లిపోయారు.
ఖిలాఫత్ ఉద్యమ సమయంలో హిందూ-ముస్లిం అనే తేడా లేకుండా అందరూ వందేమాతరాన్ని కలిసి పాడారు. అప్పుడు మైనారిటీ నాయకులు ఎవరు వందేమాతరంను వ్యతిరేకించలేదు. షోలాపూర్ కేసులో అరెస్టయి ఉరిశిక్ష విధించబడిన నలుగురిలో ఒకరు ఖుర్బాన్ హుసేన్..! ఉరి కంబానికి ఎక్కుతూ అతను ఆవేశంగా వందేమాతర గీతం పాడారు.
1857 మొదటి స్వాతంత్ర్య సంగ్రామం తర్వాత…భారత జాతి తిరిగి పుంజుకుని ఆంగ్లేయులను ఎదిరించిన మహత్తర ఉద్యమం వందేమాతర ఉద్యమమే..! ఈ ఉద్యమం తర్వాత భారత స్వాతంత్ర్య సంగ్రామం ఆగింది లేదు. వందేమాతర గీతం నూతన స్వాతంత్ర్య సమర మంత్రమై ప్రజలను ఉత్తేజ పరిచింది. యువతలో స్ఫూర్తిని నింపింది.
ప్రతి భారతీయుడు స్వగర్వంగా పాడుకోవాల్సిన గీతం వందేమాతరం. ఇప్పటికైనా సంతుష్టీకరణ విధానాలకు పాల్పడే పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలి. ఆరు చరణాలు ఉన్న వందేమాతర గీతాన్ని మొత్తంగా ఆలపించాలి. దేశం కోసం నవ్వుతూనే ఉరికంబమెక్కిన అమరవీరులను స్మరించుకోవాలి.
– ఎన్ఎస్కె చక్రవర్తి