మతోన్మాద అవకాశవాద పార్టీలను అణచడానికి ఐక్య ఉద్యమాలు ఆవశ్యం

పార్లమెంట్ లో బిజెపి ప్రవేశపెట్టిన అన్ని ప్రజా వ్యతిరేక బిల్లులకు తెలుగుదేశం పార్టీ , వైఎసార్సీపి, టిఆర్ఎస్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వం, రైల్వే జోన్ లేదు, బ్యాక్వర్డ్ రీజియన్ డెవలప్మెంట్ ఊసే లేదు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల కాలేదు, ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు పరం చేసినా, రోజు రోజుకీ నిరుద్యోగం పెరుగుతున్నా, పథకాల అమలుకు నయా పైసా కేటాయించకున్నా, పన్నులు, జీఎస్టీ రూపంలో వచ్చిన ప్రజా ధనాన్ని కార్పొరేట్ ఎగవేతదారులకు 11.17 లక్షల కోట్లు రైటాఫ్ చేసినా కనీసం ఒక్క పత్రిక ప్రకటన ఇవ్వని తెలుగుదేశం, జనసేన, వైఎసార్సీ నాయకులను ఏమనాలి.

ఈ మధ్యకాలంలో బిఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చేందినా, జాతీయ పార్టీగా అవతారం ఎత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ను బలహీన పరచడానికి పనికొస్తున్నాయి తప్ప మతోన్మాద బిజెపి ని నిలువరించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. సెక్యులర్, దళిత బహుజన మైనారిటీ ఓట్లలో చీలిక తీసుకువచ్చి ప్రధాన శత్రువుకి పట్టం కడుతున్నాయి. కలిసి పోదాం కలుపుకు పోదాం, బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి అన్న పార్టీలు కులపరంగా మతపరంగా చీలిపోయాయి.

గతంలో లాల్ నీల్ కలయిక అని ఒక ప్రాంట్ ఏర్పాటుచేసి కాంగ్రెస్ గెలిచే సీట్లల్లో ఓట్ల చీలిక చేసి టీఆర్ఎస్ పార్టీకి లబ్ది చేకూర్చే బి టీం తయారు చేశారు. మేము మీతో పాటు అంటూ ముందు వెనుక ఆలోచించకుండా సిపిఐ కూడా మూర్ఖత్వం మూర్తీభవించిన టీఆర్ఎస్ తో జత కలిపింది. గతంలో జనసేన తో అంటకాగి తిరిగారు. వీరి అధినాయకత్వం జాతీయ మహాసభలకు వచ్చినప్పుడు ఐక్యత గురించి, మతోన్మాద పార్టీల గురించి ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. రాష్ట్రాలలో వాస్తవ పరిస్థితి తెలియదా ? లేక రాష్ట్ర నాయకులు చెప్పేది గుడ్డిగా నమ్ముతున్నారా.

ద్వితీయ శ్రేణి నాయకులను తయారు చేసుకోవడం లో రెండు పార్టీలు పూర్తిగా విఫలమయ్యారు. నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతుంది. కుక్క తోక ఆడించాలి కానీ ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు తోకే కుక్కను ఆడిస్తున్నట్లు ఉంది. రాజకీయ, సామాజిక వ్యవస్థలు ఎలా రూపాంతరం చెందుతాయో చూపెట్టడానికి మార్క్స్‌ గతితార్కిక భౌతికవాదం లేదా చారిత్రక భౌతికవాదాన్ని ప్రతిపాదించి, పుట్టుక వంశం ఆధారంగా నడుస్తున్న రాచరిక, కులీన రాజ్యవ్యవస్థ నుండి సామర్థ్యం, పెట్టుబడి ఆధారమైన క్యాపిటలిస్ట్‌ వ్యవస్థ ఉద్భవించిందనీ, దీని ఆధారంగానే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని, దానిలో ఉన్న శ్రమ దోపిడీ, సంపద కేంద్రీకరణ వంటి వైరుధ్యాల వల్ల పెట్టుబడిదారీ వ్యవస్థ పై తిరగబడి శ్రామికులే ఉత్పత్తి సాధనాలు, తద్వారా రాజ్యపాలన చేజిక్కించుకుంటారనీ సూత్రీకరించారు. దోపిడీకి గురైన వారే యజమానులు, పాలకులు అవుతారు కాబట్టి ఇక దోపిడీ ఉండదనీ, దోపిడీ లేనప్పుడు యుద్ధాలు కూడా ఉండవు.

ఇవి లేనప్పుడు ఇక ప్రభుత్వం అవసరం ఉండదు. కాబట్టి ప్రభుత్వం క్రమేపీ లేకుండా పోతుంది అని, ప్రభుత్వాల అజమాయిషీ లేని ‘అనార్కీ’ ఏర్పడుతుందని సూత్రీకరించారు. ప్రతి వ్యవస్థలో అంతర్గత వైరుద్ధ్యాలు దాని నిర్మాణం లో ఉంటాయి. మొదట దాని నిర్మాణంలోని బలాలపై నడిచిన వ్యవస్థను క్రమంగా అందులో వైరుద్ధ్యం పెరిగి పెద్దవై కూలదోస్తాయి. ఇప్పుడు ఇంకో కొత్త వ్యవస్థ పాత దానికంటే మెరుగైన వ్యవస్థ ఏర్పడుతుంది. కాని దానిలో కూడా అంతర్గత వైరుధ్యాలు ఉంటాయి. అవి మళ్ళీ క్రమేణా పెరిగి, ఉన్న వ్యవస్థలోని లోపాలను, వైరుధ్యాలను తొలగించి అంతకంటే ఉత్తమమైన వ్యవస్థను దాని స్థానంలోకి తెస్తుంది.

వైరుధ్యాలకు జవాబు లేదు పరిష్కారం కొత్త వ్యవస్థలో ఉండి ఉత్తమంగా అనిపిస్తుంది కాని ప్రామాణికంగా కాదు. ముందు దానికంటే ఎక్కువ వైరుధ్యాలు, లోపాలు కూడా ఉండవచ్చు. ఇది నిరంతరం, నిర్విరామం, విశ్వజనీనం. మొత్తం ప్రపంచాన్ని మార్చాలంటే మార్క్సిస్టు అవగాహన కావాలి. కానీ, కులవ్యవస్థ ఉన్న భారతదేశంలో మధ్యేమార్గంలో ఒక సామాజిక విప్లవం రావాల్సిన అవసరం ఉంది. ఆ సామాజిక విప్లవానికి ఓటు చాలా అవసరం.

మార్క్స్, అంబేడ్కర్ సిద్ధాంతాల పునాది మీద దీనిని నిర్మించటానికి కమ్యూనిస్టులు ప్రయత్నించాలి. భారత కుల వ్యవస్థపై కమ్యూనిస్టు పార్టీలకు ఒక స్పష్టమైన అవగాహన చాలాకాలంగా రాలేదు. కులం ఒక ఉపరితలం మాత్రమే అనుకున్నారు. ఆర్థిక పునాది మారిపోతే, అన్నీ మారిపోతాయనుకున్నారు. భారతదేశంలో కుల వ్యవస్థ పోవాలని భక్తి యుగం నుంచి పోరాటాలు జరిగాయి.

కులం అన్నది క్లాస్ అండ్ కాస్ట్ రెండూ కలగలసినది అని అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారు. కులం అనేది ఉపరితలం మాత్రమే కాదు. దేశ పునాదిలో కూడా ఉందని కమ్యూనిస్టులు అర్థం చేసుకున్నపుడు ఎవరి సిద్ధాంతాలను తీసుకోవాలి? ఆర్థిక పునాదిగా ఉన్న ఒక్క మార్క్స్ మాత్రమే దేశానికి సరిపోతాడా? కులం, వర్గం రెండూ పోవాలని జమిలి ఉద్యమాలు జరగాలని అనేకమంది ఉద్యమాలు చేశారు. బీసీ జనగణన చేయడానికి ప్రధాన పార్టీలు ముందుకు రావడం లేదు. కులం పేరుతో వివక్షకు గురైన వర్గాల వారికి సమ ప్రాతినిధ్యం దక్కించడం కోసమే రిజర్వేషన్ల వ్యవస్థ” అని,రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15(4) & 16(4) లలో స్పష్టంగా పేర్కొనబడింది.

ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వాల్సినవి సంక్షేమ పథకాలు మాత్రమేనని, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఈబీసీ వర్గాలకు ఎక్కడ నుండి వచ్చింది. రిజర్వేషన్స్ కు ప్రాతిపదిక కులం (సామాజిక వెనుకబాటు) మాత్రమే, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటి నుంచి అంతా తారుమారు అవుతుంది. మండల్ కమీషన్ రిపోర్ట్ ప్రకారం ఓబీసీ ల జనాభా 54% , అగ్రకులాల జనాభా ఎంత అనేది తెలియకుండా వారికి 10 శాతం రిజర్వేషన్లా? అసలు ఏ లెక్కల ప్రకారం 10% కేటాయించారు అనే దానిపై చర్చ జరిగినట్లు లేదు. తీర్పు వెలువరించే ముందు ఓసి ల జనాభాను సుప్రీం శాస్త్రీయ లెక్కలు లేవు పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు.

మరో వైపు సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడం మరియు రాజ్యాంగ విలువలు బలోపేతం చేయడానికి కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టింది. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల బ్రతుకులు చిన్నాభిన్నమైపోయాయి. క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రజల భద్రతకు భరోసా లేకుండా పోయింది. లౌకిక ప్రజాతంత్ర వాదులు, ప్రజా సంఘాలు స్వచ్చందంగా పాల్గొంటున్న ఈ యాత్రలో పాల్గొంటున్నారు. 80 ఏళ్ల క్రితం మహాత్మా గాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది.

ఐదేళ్ల తర్వాత ఈ ఉద్యమం భారతదేశానికి స్వాతంత్య్రానికి దారితీసింది. భారతదేశం అంతటా ఐక్యతా సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మరియు స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి పాన్-ఇండియన్ మార్చ్‌ను గుర్తించడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక యాత్ర. లౌకిక ప్రజాతంత్ర వాదులు మాత్రమే భారతదేశాన్ని రక్షించగలరు. మతోన్మాద బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను గద్దె దింపడానికి, అవకాశవాద పార్టీలను ఎండగట్టడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ యాత్రకు ప్రధాన భూమిక పోషించినా ప్రజా సంఘాల నేతలు స్వచ్చందంగా పాల్గొంటున్నారు.

పౌర సమాజ సంస్థ నాయకులు, స్వరాజ్ అభియాన్ పార్టీ, కవులు, కళాకారులు, మేధావులు, మూడు వందలకు పైగా పౌర సమాజ సంస్థలు స్వచ్చంధ సంస్థలు ఇందులో భాగస్వామ్యం కావడం ఆలాగే మీడియా ప్రతినిధులు, రిటైర్డు ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్లు మరియు శాస్త్రవేత్తలు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ‘కలిసి నడుద్దాం, దేశాన్ని కలిపి ఉంచుదాం (మిలే కదమ్‌ జుడే వతన్‌)’ నినాదంతో సుదీర్ఘంగా ఐదు నెలలపాటు ఈ ప్రజా ఉద్యమం ముందుకు కొనసాగుతుంది. దేశప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా భారత్‌ జోడో యాత్ర కొనసాగుతుంది, ఈడీ, సీబీఐ దాడులతో విపక్షాలను బెదిరిస్తే ఎవరు భయపడరని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

ఈ యాత్ర వల్ల రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి దేశ రాజకీయాల్లో ప్రభావం చూపవచ్చు కానీ అంతర్గత కుమ్ములాటలు, కేవలం అధికారమే ధ్యేయంగా వ్యవహరిస్తే కష్టం. భావ సారూప్యత కలిగిన పార్టీలు నాయకులు ఐక్య ఉద్యమాలు రూపొందించి మతోన్మాద పార్టీలను, అభివృద్ధికి ప్రతిబంధకంగా విద్వేషాన్ని వెదజల్లే పార్టీలను ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అలాగే అవకాశవాద పార్టీలను రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వారిని ఎండగట్టాలి . ఎనిమిదేళ్లలో ఒక్కరోజు సెక్రెటేరియేట్ రాని వ్యక్తి, ఒక్కటంటే ఒక్క అధ్యాపక పోస్టు భర్తీ చేయని, మూఢ విశ్వాసాలతో మూర్తీభవించిన పార్టీలతో దూరంగా ఉండాలి. కార్పొరేట్లు, కాంట్రాక్టర్లను, మతోన్మాదులను నిలువరించడానికి ఇది సరియైన తరుణంగా భావించి ఐక్య ఉద్యమాలకు బాసటగా నిలవాలి.

డా. యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక