-
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
-
ఘనంగా యుటిఎఫ్ స్వర్ణోత్సవ వేడుకలు
-
క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే
సామాజిక సేవాభావంలో యుటిఎఫ్ ఘన కీర్తి కలిగి ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం 50వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ముఖ్య అతిథి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ప్రతినిత్యం సమాజంలో ఉపాధ్యాయుల గౌరవం పెంచే స్థాయిలో మహోన్నత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు ఆ సమాజానికి కష్టం వచ్చినప్పుడు బాధ్యతగా ముందుండి ఆదుకుంటారనే భావన ప్రజల్లో కలిగించేందుకు యుటిఎఫ్ నిర్వహించే కార్యక్రమాలు దోహద పడుతున్నాయని తెలిపారు. వరద విపత్తు నేపథ్యంలో బాధిత కుటుంబాల వారిని ఆదుకునేందుకు యుటిఎఫ్ విస్తృత సేవా కార్యక్రమాలు చేయడం ప్రశంసనీయమన్నారు.
విద్యావ్యవస్థలో వినూత్న సంస్కరణలు తెచ్చేందుకు విద్యా సదస్సుల ద్వారా చర్చించి సమగ్ర నివేదికలు ప్రభుత్వానికి సమర్పించి విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు యుటిఎఫ్ నాయకత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సూచించారు. విద్యా వ్యవస్థను ఎప్పటికప్పుడు బలోపేతం చేసేందుకు యుటిఎఫ్ ఎమ్మెల్సీలు చేస్తున్న కృషి కీలకంగా నిలుస్తోందన్నారు. విద్యా వ్యవస్థను సక్రమంగా నడపాలని తాపత్రయపడే ఎంతోమంది నాయకులు కలిగిన యుటిఎఫ్ సమాజంలో అత్యంత బాధ్యతాయుత పాత్ర పోషిస్తోందన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఆయన తనయుడు మండలి వెంకట్రామ్ లను ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు షార్ట్ పుట్, జావెలిన్ త్రో, టెన్నికాయిట్, చెస్, షటిల్, క్యారమ్స్, వంద మీటర్లు, 400 మీటర్ల రన్నింగ్ పోటీలు నిర్వహించారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కే.ఏ.ఉమామహేశ్వరరావు జిల్లా అధ్యక్షులు బి.కనకారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జే.లెనిన్ బాబు, గౌరవ అధ్యక్షులు నీలం ప్రభాకరరావు, నాయకులు షౌకత్ హుస్సేన్, మరీదు వరప్రసాద్, యూటీఎఫ్ జిల్లా, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.