-2020 కన్నా 2021లో 25 శాతం మహిళలపై పెరిగిన క్రైమ్
-2021 డిసెంబర్ నాటికి మహిళలపై దాడులు, అత్యాచారాలు 17,736
-తల్లిని పార్టీ నుంచి గెంటేయడమేనా మహిళా సాధికారత ?
-సీఎం ఇంటి సమీపంలో గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ వెంకటరెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవటం ఏ రకమైన సాధికారత?
-వైసీపీ ప్లీనరీలో మహిళలపై మాట్లాడే హక్కు వైకాపాకు లేదు
-తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షులు వంగలపూడి అనిత
మద్యపాన నిషేదం చేస్తానని మాటిచ్చి నేడు మహిళల మాంగల్యాలను వచ్చే 15 సంవత్సరాలకు తాకట్టు పెట్టి రూ. 33 వేల కోట్లు అప్పులు తెచ్చి లూటీ చేశారు. జగన్ రెడ్డి తన ధనదాహం కోసం విషపు మద్యం విక్రయిస్తూ ప్రజల శవాల మీద ఇప్పటికే రూ. 15 వేల కోట్లు దోపిడి చేశారు. సొంత తల్లిని, చెల్లిని మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని మహిళా ఉద్దారకుడిలా ప్లీనరీలో వైసీపీ నేతలు పొగడటం బాధాకరం. తండ్రి జయంతి నాడే తల్లిని పార్టీ నుంచి గెంటేసి అవమానించిన వ్యక్తి జగన్ రెడ్డి. తల్లి, చెల్లితో పాటు రాష్ట్రంలోని మహిళలందరీకీ అన్యాయం, మోసం చేసి మహిళా సాధికారతను సమాధి చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. వైసీపీ 3 ఏళ్ల పాలనలో మహిళలపై వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలు వేధింపులకు పాల్పడటం తప్ప వారికి చేసిందేంటి? 2021 డిసెంబర్ నాటికి మహిళలపై నేరాలకు సంబంధించి 17,736 కేసులు నమోదు కావటం ప్రభుత్వ భద్రతా వైఫల్యం. 2020 కన్నా క్రైమ్ రేటు 25 శాతం పెరగటం ఏ రకమైన మహిళా సాధికారతవుతుంది?
మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం తెలుగుదేశం పార్టీ. ఆడపడుచులకు మగవారితో సమానంగా ఆస్తిహక్కు, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు , డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో ఆర్థిక స్వావలంబన చేకూర్చిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే ఉంది. మూడేళ్ల జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన కారణంగా మహిళలకు తీరని అన్యాయం జరిగింది. గత ప్రభుత్వ పథకాలకు రంగులు వేసుకోవడం, పేర్లు మార్చడం తప్ప ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. పైగా గతంలో అమలు చేసిన పథకాల లబ్దినీ నీరుగార్చారు. సంక్షేమం మాటున ఏటికాయేడు లబ్ధిదారుల సంఖ్యను కుదించేస్తూ తీరని అన్యాయం చేస్తున్నారు. 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానని మాటిచ్చి అధికార మదంతో హామీ ఇచ్చి మోసం చేశారు. ఆసరా మాటున పొదుపు మహిళలకు టోకరా వేశారు. అభయహస్తం నిధులు రూ. 2,100 కోట్లు దారి మళ్లించారు.
దిశా పేరుతో దగా:
ప్రభుత్వం ప్రచారార్భాటం చేసిన దిశా చట్టం కింద ఒక్క నిందితుడికీ శిక్ష పడలేదు. పైగా దిశా చట్టంలో లోపాలున్నాయని సవరణలు చేసి పంపాలని కేంద్రం ఎన్నిసార్లు సూచించినా ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం మహిళా భద్రతపట్ల ప్రభుత్వ చిత్తశుద్దిని తెలియజేస్తోంది. మీడియాలో తనపై తప్పుడు పోస్టింగులు పెడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు. ఒక ప్రజాప్రతినిధికే న్యాయం చేయలేని మీరు సామాన్యులను పట్టించుకుంటారా? బాకీ తేర్చలేదని గుంటూరు జిల్లా నకరికల్లులో ఎస్టీ వర్గానికి చెందిన మహిళ మంత్రూభాయ్ ని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన వైసీపీ నేత వెంకటరెడ్డిపై ఏం చర్యలు తీసుకున్నారు. మహిళలను మోసం చేసిన జగన్ రెడ్డి బుద్ది చెప్పేందుకు మహిళలు సిద్దంగా ఉన్నారు.