Suryaa.co.in

Andhra Pradesh National

విశాఖ ఉక్కును అమ్మి ఏపీని బలి చేస్తారా?

రాజ్యసభలో ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వి.విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ: నష్టాల సాకు చూపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను బలి చేస్తారా అంటూ వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభలో సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ బీమా సంస్థల ప్రైవేటీకరణను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న దూకుడు వలన ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాదిన్నరగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం తనకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచనను విడనాడాలని కోరుతూ అనేకసార్లు మేను మంత్రులను కలిసి విన్నవించినా మా విన్నపాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు సాగడం తీవ్ర విచారకరమని విజయసాయి రెడ్డి అన్నారు.

నష్టాలను సాకుగా చూపి వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కానీ ఈ నష్టాలకు కారణాలు ఏమిటో తెలుసుకుని వాటిని సరిదిద్దడానికి ప్రభుత్వం ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదని అన్నారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ నష్టాల బారిన పడటానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. మొదటిది… విశాఖ ఉక్కుకు ప్రభుత్వం కేప్టివ్‌ మైన్స్‌ కేటాయించకపోవడం.

కేప్టివ్‌ మైన్స్‌ లేని కారణంగా ముడి ఇనుప ఖనిజాన్ని స్టీల్ ప్లాంట్ బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయవలసి వస్తోంది. ఇతర ఉక్కు కర్మాగారాలకు సొంతంగా ఇనుప ఖనిజం గనులు ఉన్నందున వాటికి ముడి ఖనిజం చాలా చౌకగా లభిస్తోంది. బహిరంగ మార్కెట్లో అత్యధిక ధరకు ముడి ఖనిజం కొనుగోలు చేస్తున్న విశాఖ ఉక్కు అలాంటి కంపెనీలతో మార్కెట్‌లో పోటీని ఎదుర్కొనేందుకు నష్టాలను భరించాల్సి వస్తోంది.

రెండో కారణం…విశాఖ ఉక్కుపై రుణం, వడ్డీ చెల్లింపుల భారాన్ని తగ్గించేందుకు రుణాలను ఈక్విటీ కింద మార్చే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం అందుకు ససేమిరా అంటూ చివరకు ప్రైవేటీకరణ వైపే అడుగులు వేయడం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తీరని అన్యాయం అవుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. వాస్తవానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ వేయి కోట్ల లాభాలను ఆర్జించింది. ఈ వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి.

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నాడు 5 వేల కోట్లు పెట్టుబడి పెడితే దానికి 10 రెట్లు…అంటే 51 వేల కోట్ల రూపాయలను వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ల రూపంలో చెల్లించిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉక్కు రంగం ఉజ్వల స్థితిలో ఉంది. వైజాగ్‌ స్టీల్‌ కూడా లాభాల బాట పట్టింది. కాబట్టి ఈ తరుణంలో స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పునఃవ్యవస్థీకరణ, పునఃనిర్మాణం, పునరుజ్జీవనం అనే సూత్రాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వైజాగ్‌ స్టీల్‌కు పునర్‌వైభవాన్ని తీసుకురావాలని కోరారు.

ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం…
ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. చట్టంలో కొన్ని నిబంధనలను సవరించడం ద్వారా ప్రభుత్వరంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం మార్గాన్ని సుగమం చేసుకుంది. దరిమిలా ఎల్‌ఐసీ వంటి కొన్ని ప్రభుత్వరంగ సంస్థలను (ఐపీవో మార్గంలో) ముక్కలు, ముక్కలుగా అమ్మకానికి పెడుతోంది. మరికొన్నింటిని హోల్‌సేల్‌గా అమ్మేస్తోందని ఆయన అన్నారు.
పెట్టుబడుల ఉపసంహణకు ప్రతిపాదించిన 36 ప్రభుత్వరంగ సంస్థలలో ఇప్పటికే 8 సంస్థలలో ఈ ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు, రేపు దేశవ్యాప్తంగా కార్మికులు, సిబ్బంది సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలు మన జాతి సంపద. వాటి వలన కీలకమైన మౌలిక వసతులు ఏర్పడుతున్నాయి. ప్రజానీకానికి అందుబాటు ధరల్లో వస్తువులు, సేవలు లభిస్తున్నాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. మొన్నటికి మొన్న కోవిడ్‌ మహమ్మారి దేశంపై విరుచుకుపడినపుడు అప్పటికి అత్యవసరమైన మందులు, ఆక్సిజన్‌ సరఫరాతోపాటు గ్యాస్‌, విద్యుత్‌ సరఫరా నిరంతరం జరిగేలా చూసింది ప్రభుత్వరంగ సంస్థలే అన్న విషయాన్ని ప్రభుత్వానికి మరోమారు గుర్తు చేస్తున్నానని విజయసాయి రెడ్డి అన్నారు.

వేతన జీవులకు ఐటీ ఉపశమనం ఏదీ?
కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగస్తులతోపాటు సామాన్యుల పొదుపు మొత్తాలు వైద్య ఖర్చులు, ఇతర అత్యవసర ఖర్చులకు హరించికుపోయాయి. చిన్నపాటి వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఆర్థిక భారం నుంచి వారికి ఉపశమనం కలిగించేందుకు గడచిన రెండేళ్ళలో ఆర్థిక మంత్రి ఎలాంటి టాక్స్ మినహాయింపులు ప్రకటించకపోవడం శోచనీయం అని విజయసాయి రెడ్డి అన్నారు.
2014 నుంచి 2022 నాటికి ద్రవ్యోల్బణం 40 శాతం పెరిగింది. కానీ పన్ను మినహాయింపు మాత్రం రెండున్నర లక్షలకే పరిమితమైపోయింది. తరిగిపోతున్న ఆదాయం ఒకవైపు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం మరోవైపు. ఈ నేపథ్యంలో టాక్స్ మినహాయింపులో ఎలాంటి మార్పు లేకపోతే వేతనజీవుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.

44 ఏళ్ళ కనిష్టానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటు…
ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌) ఖాతాలపై చెల్లించే వడ్డీ 2018-19లో 8.65 శాతం ఉండగా 2021-22 నాటికి అది 8.1 శాతానికి తగ్గిపోయింది. వడ్డీ రేటు ఇంత కనిష్టానికి పడిపోవడం 44 ఏళ్ళలో ఇదే తొలిసారని అన్నారు. అయిదు కోట్ల ఈపీఎఫ్‌ ఖాతాదారుల సేవింగ్స్‌పై ఇది తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. నేషనల్‌ పెన్షన్‌ విధానం (ఎన్‌పీఎస్‌) చూస్తే మెచ్యూరిటీపై టాక్స్‌ విధించే ఏకైక సేవింగ్స్‌ స్కీమ్‌ ఇది. ఎన్‌పీఎస్‌ను పన్ను చెల్లింపుదార్లకు ఆకర్షణీయమైన పథకంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి సంస్కరణలను ప్రభుత్వం చేపట్టకపోవడం విచారకరమని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ ఏత్తేయాలి…
ఒక వ్యక్తి తనకు లేదా తన కుటుంబ సభ్యుల కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం చేసే ఖర్చులపై టాక్స్‌ను మినహాయింపు ఇస్తూ ప్రభుత్వ నిర్ణయించడం ఆహ్వానించదగిందే. అయితే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లేని కారణంగా అనేక మంది కోవిడ్‌ చికిత్స కోసం ఆస్తులు సైతం అమ్మి భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌పై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దీని వలన అత్యధిక మంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునే అవకాశం ఏర్పడుతుందని ఆయన అన్నారు.

జీఎస్టీ పరిహారాన్ని పొడిగించాలి…
కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర పన్నులలో తన వాటా కింద రావలసిన మొత్తంలో 7,780 కోట్ల రూపాయలు నష్టపోయింది. అలాగే టాక్స్‌ ఆదాయం కింద రావలసిన మరో 7 వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని విజయసాయి రెడ్డి అన్నారు. దీని వలన రాష్ట్రానికి రెవెన్యూ నష్టం 2022 తర్వాత కూడా కొనసాగుతుంది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిల చెల్లింపును 2026 వరకు వాయిదా వేసేందుకు జీఎస్టీ పరిహారం సెస్‌ను 2026 వరకు పొడిగించింది. కానీ రాష్ట్రాలకు ఉపకరించే జీఎస్టీ పరిహారాన్ని మాత్రం పొడిగించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని 2022 తర్వాత కూడా చెల్లించేలా గడువు పొడిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

క్రిప్టో కరెన్సీని అదుపు చేయాలి…
క్రిప్టో కరెన్సీని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ప్రపంచంలో 150 వరకు క్రిప్టో ఎక్సేంజిలు ఉన్నాయి. అయితే క్రిప్టో ఎక్సేంజిల ద్వారా కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే క్రిప్టో లావాదేవీలపై నియంత్రణ, నిఘా లేనందున ప్రభుత్వానికి ఈ లావాదేవీ గురించి ఎలా తెలుస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. రేపు కాంగ్రెస్‌ పార్టీనో లేదా బీజేపీనో క్రిప్టో అకౌంట్‌లో 90 కోట్ల రూపాయల గుప్త నిధులు జమ చేసి వాటిని డీబీటీ విధానంలో ఓట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేం అన్నారు. అందువలన ఈ లొసుగులపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు.

ఐటీ చట్టంలోని సెక్షన్‌ 147ను సవరించాలి…
ఇన్‌కమ్‌ టాక్స్‌ చట్టంలోని సెక్షన్‌ 147ను నాలుగైదు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌ పార్టీ దుర్వినియోగం చేస్త వచ్చింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దానిని సవరించింది. కానీ ఈ సవరణలో అసెస్‌మెంట్‌ అధికారికి అసాధారణ అధికారాన్ని కట్టబెట్టినందు వలన ఆ అధికారి ఎలాంటి కారణం లేకుండానే మళ్ళీ అసెస్‌మెంట్‌కు ఆదేశించే అవకాశం ఏర్పడింది. ఇలాంటి లొసుగులను అడ్డం పెట్టుకునే గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మాపై అనేక తప్పుడు కేసులు బనాయించింది.
అసెస్‌మెంట్‌ అధికారికి కట్టబెట్టిన అసాధారణ అధికారం కారణంగా భవిష్యత్తులో రాజకీయ కక్ష సాధింపు కోసం దీనిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉన్నందున వెంటనే సెక్షన్‌ 147కు సవరణ చేపట్టాలని విజయసాయి రెడ్డి ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ధార్మిక సంస్థలపై కఠిన నిబంధనలు సడలించాలి…
కొన్ని షరతలు నుంచి మినహాయింపు పొందిన ధార్మిక సంస్థలు ప్రస్తుతం ఫైనాన్స్ బిల్లులోని సెక్షన్ 10, క్లాజ్ 23 కింద ప్రతిపాదించిన సవరణ ప్రకారం సెక్షన్ 11, 13 కింద కఠిన నిబంధనలకు కట్టుబడి పని చేసే ట్రస్టుల మాదిరగానే వ్యవహరించాల్సి ఉంటుంది. దీని వలన గుర్తింపు పొందిన ధార్మిక సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రభుత్వం సెక్షన్ 10ని పూర్తిగా రద్దు చేసి ట్రస్టులన్నింటినీ సెక్షన్ 11, 13 పరిధిలోకి తీసుకురావాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE