ప్రాణం పోసిన కుంచె..!

వ పా..
ఈ రెండక్షరాలు
వర్ణచిత్ర జగతిలో ఉన్నతి..
మాటాడే కుంచె..
బొమ్మకు ప్రాణం పోసే బ్రష్షు..
చిన్ననాటి మధురానుభూతుల
చందమామలో
ఆయన చిత్రమే విచిత్రం..
అదే పంచతంత్రం..!

ప్రాణం నింపుకున్న
వేల బొమ్మలు..
వాటికీ బాపూ
బొమ్మలాంటి కళ్ళు..
దేవకన్యల ఆనవాళ్లు..
రాములోరి చెంత సీతమ్మ..
కృష్ణుడి సరసన రాధమ్మకు
నూటికి నూరుపాళ్లు నకళ్లు..
కళ్ళ ముందు
కదలాడే రామాయణం..
అక్షర రూపం ఇస్తే మహర్షి
సజీవ రూపం ఇచ్చాడు
ఈ చిత్రకళా రాజర్షి..

ఊళ్ళో ఠీవిగా నడిచే
పరోపకారి పాపన్న..
చేలగట్లపై
చెంగుచెంగున దూకుతూ
సత్యం శివం సుందరం
విలేజీ జీనత్ అమన్లు..
కళ్ళలో మెరుపు..
నడుము దగ్గరి వంపు..
పైకెత్తి కట్టిన చీరలో
నాయరాలి సొగసు..
ఊరి పోకిరోడి తలబిరుసు..
వడ్డాది పాపయ్య బొమ్మల్లో
సజీవంగా సాక్షాత్కారం
ఆయన ప్రతిభకు చందమామ,యువ పత్రికల
ఆదరణే పురస్కారం!

లెజెండరీ చిత్రకారుడు
వడ్డాది పాపయ్య(వపా)
జయంతి సందర్భంగా చందమామ జ్ఞాపకాలతో..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286