Suryaa.co.in

Andhra Pradesh

కమలం కాదు పొమ్మని ఛీకొట్టినా.. పట్టుకునే వేలాడుతామంటున్న వైకాపా నేతలు

– రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి అగ్ర నేతలు చేసిన అవినీతి ఆరోపణలపై సీఎం జగన్మోహన్ రెడ్డి పిన్ డ్రాప్ సైలెన్స్
– బిజెపిని అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పలేక… పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్న పేర్ని నాని
– తమ ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు చేసినా మా పార్టీ మద్దతు బిజెపి కేనన్న మంత్రి బొత్స
-సింగిల్ గా వస్తానా?… కలిసి వస్తానన్నది త్వరలోనే చెబుతానన్నా పవన్ కళ్యాణ్
– ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని గతంలోనే స్పష్టం చేసిన జనసేనాని
-టిడిపి,జనసేన, బిజెపిలు కలిసి ఎన్నికలకు వెళ్తాయన్నది నా ఉద్దేశం
-ఈ రాక్షస పాలన నుంచి రక్షించాలని ప్రతిపక్షాలను కోరుతున్న ప్రజలు
-రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజలకు రక్షణ లభించనుంది
-కుప్పంలో చంద్రబాబుకు, బద్వేల్ లో నారా లోకేష్ కు, కత్తిపూడి లో పవన్ కళ్యాణ్ కు జననీరాజనం
– జగనన్న సురక్ష పథకంలో భాగంగా ఇంటింటికి వచ్చే సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను కరెంటు బిల్లులు, చెత్త, ఆస్తి పన్నును చూపించి నిలదీయండి
– జగన్, కేటీఆర్ ను కూర్చొని విభజన సమస్యలు పరిష్కరించుకోవాలి
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

బిజెపి పొమ్మన్న పట్టుకొని వేలాడుతామని మా పార్టీ నేతలు అంటున్నారు. బిజెపి అగ్ర నేతలు ఎన్ని అవినీతి ఆరోపణలు చేసిన ఆ పార్టీకే మా మద్దతని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొంటే, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు చేసిన అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బిజెపి అగ్రనేతలు చేసిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పలేక మాజీమంత్రి పేర్ని నాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణమే. కలుషితమైన ప్రస్తుత రాజకీయాలలో ఎంతో సంస్కారవంతంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ ను ఏకవచనంతో సంబోధిస్తూ… పేర్ని నాని దుర్భాషలాడిన తీరు బాధ కలిగించింది. స్క్రిప్టు రాసి ఇచ్చే వ్యక్తులు సమయమనం పాటించాలని సూచించారు.

గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నడ్డా కంటే, అమిత్ షా నే తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు.

అయితే, నడ్డా చేసిన అవినీతి ఆరోపణలపై తొలుత పేర్ని నాని స్పందించినప్పటికీ, అమిత్ షా చేసిన అవినీతి ఆరోపణలపై మా పార్టీ నాయకత్వం స్పందించకుండా మిన్నుకుండిపోయింది. నాలుగేళ్ల తర్వాత మా ప్రభుత్వ అవినీతి బిజెపి అగ్ర నేతలకు గుర్తుకు వచ్చిందా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించడమే కాకుండా, అవినీతి అంటే ఏమిటో తెలియని అమాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా మాట్లాడారు. తమ ప్రభుత్వంపై బిజెపి నాయకులు ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినప్పటికీ, మా పార్టీ మద్దతు వారికేనని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

అమిత్ షా ను కలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇప్పించేందుకు గత రెండు మూడు రోజుల నుంచి విజయసాయిరెడ్డి కాళ్ళ వేళ్ళ పడుతూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు తన ప్రయత్నాలు చేస్తూనే, 0+0=0 అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. తెర వెనుక కాళ్లు వేళ్లు పట్టుకొని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తూనే, తెర ముందు మాత్రం నువ్వెంత అన్నట్లుగా విజయసాయి రెడ్డి వ్యవహార శైలి ఉన్నది.

అయినా రాజకీయాలలో 1+1=2 కాదని 11 అవుతుందన్నారు. రాజకీయ లెక్కల ప్రకారం 1+1+1=111 అవుతుందన్న రఘురామకృష్ణం రాజు, 20 శాతం చొప్పున ఓటు బ్యాంక్ కలిగిన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే 60 శాతం ఓట్లు రాగా , ఒక పార్టీ 40 శాతం ఓట్లు వస్తే 60 శాతం ఓట్లు వచ్చిన ఆ మూడు పార్టీలు కలిసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటాయన్నారు. రాజకీయ లెక్కలకు సాధారణ లెక్కలకు ఎంతో తేడా ఉంటుందని, ఆడిటర్ ను సలహాదారునిగా పెట్టుకుంటే సాధారణ లెక్కలు మాత్రమేచెప్పగలరని, రాజకీయ లెక్కలు చెప్పలేరని ఎద్దేవా చేశారు.

అనుమానం అక్కరలేదు… అభియోగాలను మోపారు… ఇక అరెస్టే ఆలస్యం

ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న మాగుంట రాఘవరెడ్డికి హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయగా, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ (ఈ డీ ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసి, మూడు వారం కావస్తున్నప్పటికీ , సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన సిబిఐ, ఇప్పటివరకు స్పందించలేదు.
వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, కౌంటర్ అయినా సిబిఐ వేయాల్సి ఉండగా కౌంటర్ కూడా వేయలేదు. ఇంకా విచారణ వాయిదా తేదీకి మూడు రోజుల వ్యవధి ఉండడంతో, సిబిఐ ఇంప్లిడ్ అయి కౌంటర్ వేస్తుందా? లేదా?? అన్నదానిపై సోమవారం నాడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సిబిఐ కౌంటర్ వేస్తుందని నేను భావిస్తున్నాను.

ఒకవేళ సిబిఐ కౌంటర్ దాఖలు చేయకుండా, కోర్టు ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటామని గతంలో నేను, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయగా చెప్పినట్లుగా ఇప్పుడు కూడా అదే చిలక పలుకులు పలుకుతుందేమో చూడాలి.

బిజెపితో, మా పార్టీ కి స్నేహ సంబంధాలు ఉన్నాయన్న అనుమానం రావడం సహజమే. అందులో తప్పేమీ లేదు. అయితే ఇదంతా గతం. ఈనెల 11వ తేదీన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతిని తూర్పారాబట్టారు. దీనితో తప్పు చేసిన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయన్న నమ్మకం ఏర్పడింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సమాచారం జగన్మోహన్ రెడ్డి కి ముందే తెలుసునని సిబిఐనే తన కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది. అవినాష్ రెడ్డిని హత్య కేసులో ఎనిమిదవ ముద్దాయిగా చేర్చింది.

ఈ కేసులో నిందితుల అరెస్టు ఎప్పుడన్నది తప్పితే, ఇప్పటికే ఇద్దరిపై సిబిఐ అభియోగాలను మోపింది. అలాగే వైఎస్ వివేకానంద హత్య కేసు విస్తృత కుట్ర కోణంలో ఎవరెవరి పాత్ర ఉన్నదన్నది సిబిఐ తేల్చాలి. ఇప్పటికే ఈ హత్య కేసును క్రిస్టల్ క్లియర్ గా తేల్చేసిన తర్వాత నిందితులు తప్పించుకుంటారన్న ప్రశ్నే తలెత్తదు. ఈ కేసు నాలుగు రోజులు ఆలస్యం కావచ్చు కానీ నిందితుల అరెస్టు మాత్రం అనివార్యం.

అనుమానాలు అక్కరకు లేదన్నది నా విశ్వాసం అని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం పైనే అవినీతిని క్షమించేది లేదని కొరడా జలుపించిన కేంద్రం, రాష్ట్రంలో ప్రతీ నెల కు మద్యం విక్రయాలలో 300 కోట్ల రూపాయల నగదు చేతులు మారుతోందని తెలిసిన తరువాత, కేంద్రం చూస్తూ ఉపేక్షిస్తుందని తాను భావించడం లేదన్నారు.

ముందస్తు ఎన్నికలు అనివార్యమే

సింగిల్ గా వస్తానా?, కలసి వస్తానా అన్నది త్వరలోనే చెబుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. సింగిల్ గా పోటీ చేయమని పదే, పదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న సవాళ్లపై స్పందిస్తూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని గతంలోనే పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో 40 శాతం ఓటు బ్యాంకు కలిగిన టిడిపి, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో కలిసి ఆయన రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారన్నది నా ఉద్దేశం. ఉభయగోదావరి జిల్లాలలో ఇప్పటికే పార్టీ క్యాడర్ కలిసి పోయింది. ఇక లీడర్లు కలవడం లాంచనంగా మిగిలి ఉంది. సాధారణంగా అయితే లీడర్లు కలుస్తారు కానీ పార్టీల క్యాడర్ కలవడం కష్టం. ఇక్కడ దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొందన్నారు.

ఆరోపణలు సరే… ఆచరణ ఏదన్న చంద్రబాబు

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై కేంద్ర ప్రభుత్వ పెద్దలు అవినీతి ఆరోపణలు చేసినప్పటికీ, ఆచరణలో చర్యలేవని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ప్రశ్నించడం మంచిదేనని, త్వరలోనే చర్యలు ఉంటాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి వెళ్తాయా అన్నదానిపై ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయని, త్వరలోనే అవి నివృత్తి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మూడు పార్టీలు కలిసి వెళ్లడం వల్ల ప్రజలకు మంచే జరుగుతుందన్నారు. డిసెంబర్ లోనే లోక్ సభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని గతంలో బిజెపితో సన్నిహితంగా మెలిగి ప్రస్తుతం విభేదించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేర్కొన్నారని గుర్తు చేశారు.

రాష్ట్ర అసెంబ్లీకి కూడా డిసెంబర్ లోనే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఎన్డీఏ భాగస్వామ్య కూటమి సభ్యుడైన పవన్ కళ్యాణ్, నేను చెబుతూ వస్తున్నామన్నారు. ఆగస్టులో అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణతో పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారన్నారు. గుళ్లో ప్రసాదాల బ్యాచ్, లెక్కల మాస్టర్ ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కలిసి మేనేజ్ చేసే పనిలో ఉన్నారని తెలిపారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని, ఒకవేళ లోక్ సభకు కూడా ముందస్తు ఎన్నికలు వస్తే దానికి సిద్ధమేనని ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచి నేను పోటీ చేయాలన్నది నిర్ణయించుకోనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే రెండు సినిమాలు డిజాస్టర్… ఇప్పుడు మూడో సినిమా టైటిల్ అనౌన్స్

జగన్మోహన్ రెడ్డి రెండు సినిమాలు ఇప్పటికే డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు మూడో సినిమా టైటిల్ ప్రకటించారు. గతంలో జగనన్నకు చెప్పుకుందాం రా, మా నమ్మకం నువ్వే జగనన్న అన్న రెండు సినిమాలు ప్రజల ముందు డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు జగనన్న సురక్ష అని మూడో సినిమా టైటిల్ ప్రకటించారు. అయితే జగన్మోహన్ రెడ్డి నుంచే ప్రజలు రక్షణ కోరుకుంటున్నారు. కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే అనుమతులు ఇవ్వకపోవడం దారుణం. ఇది ముఖ్యమంత్రి కి తెలిసే జరుగుతుందా? లేకపోతే స్థానిక మునిసిపల్ కమిషనరే పిచ్చి వేషాలు వేస్తున్నారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

కుప్పంలోనే చంద్రబాబు నాయుడు ని ఇల్లు కట్టుకొనివ్వని జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఇల్లు కట్టుకుంటానంటే ఒప్పుకుంటారా? అని సందేహం వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాలలో యువ గళం పాదయాత్ర ముగింపు సందర్భంగా బద్వేల్ లో జన సందోహం పోటెత్తింది. అలాగే నెల్లూరు జిల్లాలో ప్రవేశించిన నారా లోకేష్ కు అపూర్వ స్వాగతం లభించింది. కుప్పంలో చంద్రబాబు నాయుడు మాట్లాడే వరకు జన సందోహం ఊరుకోలేదు.

ఇక వారాహి యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కు కత్తిపూడిలో జనం నీరాజనం పలికారు. ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్వహిస్తున్న సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివెళ్తున్నారు. మా పార్టీ నాయకులు నిర్వహించే సభలకుఉపాధ్యాయులను, డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించి, వారు సభా ప్రాంగణం నుంచి పారిపోకుండా ఉండడానికి కందకాలను తీయడం, భారీకేడ్లను ఏర్పాటు చేయడం వంటి చర్యలను చేపట్టిన, ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభించగానే పారిపోతున్నారు. ప్రతిపక్ష నేతలు నిర్వహిస్తున్న సభలకు మాత్రం వద్దంటే జనం హాజరవుతున్నారు.

ఈ రాక్షస పాలన నుంచి రక్షణ కావాలని ప్రతిపక్షాలను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు లభిస్తున్న ప్రజా స్పందన చూస్తుంటే, పార్టీ సభ్యుడిగా బాధనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి నుంచి రక్షణ లభిస్తుంది. విద్యార్థుల నోటు పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ముద్రించారు. భూముల్లో హద్దురాళ్లపై కూడా ఆయన షిరునవ్వు చిందించే ఫోటోలే… ఇంటి బయట ఆయన స్టిక్కర్లే, ఫోన్ కు వెనక బాగానా ఆయన స్టిక్కర్లే. ఏమిటి ఈ ఫోటోల పిచ్చి అని ప్రశ్నించారు.

జగనన్న సురక్ష పథకం లో భాగంగా ఇంటింటికి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తిరుగుతూ ప్రభుత్వ పథకాలు అన్నీ అందాయా? అని ప్రశ్నిస్తారట. ఒకవేళ అందకపోతే అందజేస్తారట. అన్నీ పథకాలు అందిన వారితో జగనన్నకు ఆశీర్వచనాలను అందజేయాలని కోరుతారట. అయితే ఇంటింటికి వచ్చే సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు తమ ఇంటికి వచ్చే కరెంటు బిల్లులు, 15 శాతాన్ని పెంచిన ఆస్తి పన్ను, చెత్త పన్నులను చూపించి నిలదీయాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

జగన్మోహన్ రెడ్డి ఒక కుటుంబానికి ఇచ్చేది 30, 000 రూపాయలైతే, లాగేది అంతకు రెండింతలు ఎక్కువే. ఇక ఎవరికైనా మద్యాన్ని సేవించే అలవాటు ఉంటే, వారి వద్ద నుంచి రోజుకు రెండు వందల యాభై రూపాయల చొప్పున ఏడాదికి ఎంతవుతుందో లెక్కలు వేసుకుని ప్రశ్నించాలని సూచించారు. పార్టీ కార్యకర్తలకు, ఓటర్లకు మధ్య అనుసంధానాన్ని మా పార్టీ నాయకత్వం తుంచి వేసింది.

కేవలం వాలంటీర్లను నమ్ముకొని పార్టీ క్యాడర్ ను విస్మరించడం వల్ల, పార్టీ కుప్పకూలిపోవడం ఖాయం. పార్టీ కోసం పని చేసిన వారు తమ ఆస్తులను అమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి స్థానిక సంస్థల్లో పోటీ చేసిన సర్పంచులకు వంటి మీద బట్టలు కూడా లేకుండా పోయాయి. తక్షణమే సర్పంచులకు నిధులను విడుదల చేయాలని రఘు రామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.

అశోకుడికి యాంటీ ఫార్ములా పాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి

అశోకుడు చెట్లు నాటించెను అంటే దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి చెట్లను నరికించెను అన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎపుగా ఎదిగిన వృక్షాలను నేలమట్టం చేశారు. చెట్లను నరికి వేయడం మంచి పద్ధతి కాదన్నా హైకోర్టు ఆదేశాలు నాకు స్వాంతన చేకూర్చాయి. జనసేన నాయకుడు మూర్తి యాదవ్, ఇదే విషయమై ప్రధాన న్యాయమూర్తి కోర్టులో పిల్ వేయాలి.

ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తిరిగిన ఊర్లలో చెట్లను నేలమట్టం చేశారు. ఎన్నికలల్లో ఆయన మరిన్ని ఊర్లు తిరిగే అవకాశం ఉన్నందున ఆ ఊర్లలో చెట్లను కూడా నేలమట్టం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి నుండి భారీ చెట్లను కాపాడాలంటే హైకోర్టును ఆశ్రయించడం ఒక్కటే మార్గం. తెలంగాణలోని రెండు దేవాలయాలకు ఆ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేశారు. అలాగే మరొక దేవాలయానికి 86 లక్షల రూపాయలను విడుదల చేశారు.

జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కేటీఆర్ ల మధ్య అడగగానే నిధులు ఇచ్చుకునేంత అన్యోన్యమైన సంబంధం ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన సమస్యలను కూర్చొని పరిష్కరించుకోకుండా, తరచూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి విద్యుత్ బిల్లుల బకాయిలు ఇప్పించాలని, వినతి పత్రాలు అందజేయడం ఆశ్చర్యంగా ఉందని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు.

 

LEAVE A RESPONSE