– ఉద్యోగులూ ప్రభుత్వంలో భాగమే
-ఒకడుగు ముందుకేసి చర్చలకు రావాలి
– ప్రభుత్వం నాలుగు అడుగులు వేస్తుంది
– ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దని హితవు
– మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
ఉద్యోగులు ప్రతిపక్షాల ట్రాప్ లో పడరాదని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు ఒక అడుగు ముందుకేసి చర్చలకు వస్తే.. ప్రభుత్వం నాలుగు అడుగులు ముందుకేస్తుందని అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని, భారీ ర్యాలీలు చేసినంత మాత్రాన తమపై పైచేయి సాధించినట్టు కాదని ఆయన అన్నారు.
సీఎం జగన్ మంచి మనసున్న నేత అని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగులందరికీ 27 శాతం ఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం, సీఎంపై నోటికొచ్చినట్టు మాట్లాడడం తగదని హితవు చెప్పారు. ఉద్యోగులను చూసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు పడ్డాయని, జీతాల్లో తగ్గుదలగానీ, ప్రభుత్వం వెనక్కు తీసుకున్నట్టుగానీ పే స్లిప్పుల్లో ఉందా? అని ప్రశ్నించారు. కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని, ఆ విషయాన్ని ఉద్యోగులు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల గురించి అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ మండిపడ్డారు. కరోనా వల్ల ఎవరూ ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే ర్యాలీ వద్దన్నామని, ప్రభుత్వం ఆంక్షలు పెడితే ఇంత మంది వచ్చేవారా? అని ప్రశ్నించారు. ఉద్యోగులను వేధించి బాధపెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదని వెల్లంపల్లి స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఉద్యోగులు చర్చలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.