ప్రతి హిందువూ వి.హెచ్.పి కార్యకర్త కావాలి
దేశ రక్షణ, దేవాలయ , గో సంరక్షణకు కృషి చేయాలి
– దక్షిణాంధ్ర ప్రాంత సత్సంగ ప్రముఖ సోమా సుబ్బారావు
ఒంగోలు: హిందూ ధర్మం చాలా పురాతనమైనది, ఇది మానవ ధర్మం, హిందూ ధర్మం నిత్య నూతనమైనది. మతం కాదు, కులం కాదు ఇది మానవాళికి భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మం. ఋషులు మహాత్ములు తమ తపస్సు ద్వారా దీన్ని మరింత బలోపేతం చేశారు. ఇట్టి ధర్మాన్ని మరింతగా ప్రజలలో స్థిరపరచడానికి, హిందువులలో ఐక్యతను పెంపొందించడానికి, గో సంరక్షణ, ఆలయాల సంరక్షణకై పాటుపడుతున్న ధార్మిక సంస్థ విశ్వహిందూ పరిషత్. సమాజ కళ్యాణాన్ని, లోక హితాన్ని కాంక్షిస్తూ, అంటరానితనాన్ని నిర్మూలించి, విద్య వైద్య సేవల ద్వారా సమాజంలో సరికొత్త భావాలను పెంపొందించడానికి గత 58 సంవత్సరాలుగా విశ్వహిందూ పరిషత్ కృషి చేస్తుంది. రాబోయే 2024 సంవత్సరం లో 60 సంవత్సరాల వేడుకలకు వి.హెచ్.పి సిద్ధమవుతుంది.
ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ కేంద్ర ప్రముఖుల ఆదేశానుసారం దేశవ్యాప్తంగా 61 లక్షల మందిని విశ్వహిందూ పరిషత్ కు జోడించాలని, ఈ నవంబర్ 6వ తేదీ నుండి 20వ తేదీ వరకు 15 రోజులపాటు ‘హితచింతక్ అభియాన్’ కార్యక్రమాన్ని రూపొందించారు. సమాజంలోని ప్రతి హిందూ కుటుంబాన్ని కలసి హితచింతక్ అభియాన్ వివరాలు తెలుపుతామని, దేశ సమగ్రతను రక్షణను, హిందూ ధర్మాన్ని అభిమానించే ఆరాధించే ప్రతి ఒక్కరు నామమాత్రపు ఇరవై రూపాయల రుసుముతో విశ్వహిందూ పరిషత్ హితచింతకులుగా మారాలని దక్షిణాంధ్ర ప్రాంత సత్సంగ ప్రముఖ సోమ సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ప్రతి మూడు సం.లకు ఒకసారి నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ మేరకు నగరంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో కరపత్ర ఆవిష్కరణ, హితచింతక్ రసీదు పుస్తకాలను ఆవిష్కరించారు.
కరపత్ర ఆవిష్కరణలో విభాగ కార్యదర్శి పందరబోయిన పున్నారావు, ఒంగోలు జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, కార్యదర్శి ఐ సీతారామయ్య, ఉపాధ్యక్షులు జిల్లెల్లమూడి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షులు పసుమర్తి వెంకటేశ్వర్లు, నేరెళ్ల శ్రీనివాసరావు, సాదు శ్రీనివాస గుప్తా, బి. రవి, రాంబాబు, అనంత లక్ష్మి, చల్లా నాగేశ్వరమ్మ ప్రచార ప్రముఖ్ రాధా రమణ గుప్తా జంధ్యం తదితరులు పాల్గొన్నారు.