Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగం పేరుతో రూ. 25 లక్షలు కొట్టేసి లండన్ తీసుకెళ్ళి వదిలేశారు..

– బిల్లులు రాక అప్పులు చెల్లించలేక ఆత్మహత్య
– గ్రీవెన్స్ లో బోరుమన్న బాధితులు

మంగళగిరి: తన అల్లుడికి లండన్ లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తమ వద్ద రూ. 25 లక్షలు తీసుకుని మోసం చేశారని… తన అల్లుడిని లండన్ తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పించకుండా అక్కడ వదిలేయడంతో 18 నెలల పాటు నానా ఇబ్బందులు పడి రావాల్సి వచ్చిందని.. ఈ మోసం తెలిసి తన అల్లుడి తండ్రి గుండెపోటుతో మరణించారని… ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన మాజేటి అశోక్ పై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని, తమకు న్యాయం చేసి డబ్బులు ఇప్పించాలని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అమినా బాదు గ్రామానికి చెందిన బత్తుల గ్రాయత్రీ దేవి గ్రీవెన్స్‌లో వేడుకున్నారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన గ్రీవెన్స్ లో నేతలను కలిసి అర్జీ ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు వెంటనే డీఎస్పీకి ఫోన్ చేసి సమస్యను తెలిపి పరిష్కరించాలని కోరారు. ఉద్యోగాలపేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొని అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు.

• వినుకొండ నియోజకవర్గంలో 2014-2019 సంవత్సరంలో MGNREGS గ్రాంటు కింద సిమ్మెంట్ రోడ్ల పనులు చేశామని.. ఆ బిల్లులు నేటికి రాలేదని.. బిల్లులు రాక అప్పులు కట్టలేక ఈపురుపాలెం మండలంలో ఒక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకున్న పరిస్థితి కూడా ఉందని బాధితులు తెలిపారు. దయ చేసి తమకు రావాల్సిన బిల్లుల బకాయిలు రూ. 36.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని, వినుకొండ నుండి వచ్చిన బాధితులు గ్రీవెన్స్ లో నేతలకు వినతి పత్రం ఇచ్చి అభ్యర్థించారు. గంగినేని చంద్రశేఖర్, ముండ్రు సుబ్బారావు తమ గోడును వినిపిస్తూ.. బిల్లలు రాకపోవడంతో పిల్లల్ని బడులకు కూడా పంపలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
• ఎన్టీఆర్ జిల్లా విజయవాడ న్యూ రాజీవ్ నగర్ 63వ డివిజన్ కు చెందిన పొదిలి తిరుపతయ్య విజ్ఞప్తి చేస్తూ.. మొన్నటి వరదల్లో ఇల్లు మొత్తం మునిగిపోయి కట్టుబట్టలతో మిగిలామని.. రూ. 2 లక్షల రూపాయాలు నష్టం జరిగిందని పరిహారం ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు.
• కృష్ణా జిల్లా కానూరుకు చెందిన కొక్కిలిగడ్డ ఏసోబు విజ్ఞప్తి చేస్తూ.. తనకు పుట్టుకతోనే పోలియో ఉందని.. తనకు చెప్పుల షాపు పెట్టుకోవడానికి స్సబిడీపై రుణం ఇప్పించాలని అభ్యర్థించారు.
• తాము 1985 లో కొనుగోలు చేసి రిజిస్టర్ అయిన భూములను చుక్కల భూములగా మార్చడంతో ఇబ్బంది పడుతున్నామని.. ఈ విషయాన్ని తహశీల్దార్ వద్దకు తీసుకెళ్తే పట్టించుకోవడంలేదని.. కానీ ఊరిలో చాలా మందికి ఇలాంటి భూములను చుక్కల భూమల నుండి తీసి రెగ్యులర్ చేశారని.. వైసీపీ నేతలు తహశీల్దార్ కు చెప్పడంతోనే తమ భూమిని రెగ్యులర్ చేయడంలేదని నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పాటిబండ్ల శ్రీనివాసులు తెలిపారు. తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు.
• నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొత్తపల్లి గ్రామానికి చెందిన గుర్రం రాజశేఖర్ విజ్ఞప్తి చేస్తూ.. గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో తమ భూములను 22 ఏలోకి మార్చారని.. దాన్ని తొలగించి తమకు ఫ్రీహోల్డ్ చేయాలని అతను గ్రీవెన్స్ లో నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు.
• కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన బి.పెద్ద విరూపాక్షి విజ్ఞప్తి చేస్తూ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హౌసింగ్ బోర్డు తరఫున ఇళ్ళు కట్టుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో వారికి బిల్లులు పడకుండా అడ్డుకున్నారని, బిల్లులు పడకపోవడంతో 54 మంది కార్యకర్తలు అప్పుల పాలయ్యారని వారికి బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకున్నారు.
• అధికారుల అండతో తన భూమిని ఆక్రమించుకుని అక్రమంగా తన భూమిలో మట్టిని తోడి పొలాన్ని చెరువును చేశారంటూ.. గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం నంబూరు గ్రామానికి చెందిన విజయ భాస్కరరావు గ్రీవెన్స్ లో లబోదిబోమన్నారు. తన భూమిని ఆక్రమించి మట్టిని తోడేసిన భూ కబ్జాదారులు, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
• కడప జిల్లా, కడపకు చెందిన పి.రమాదేవి విజ్ఞప్తి చేస్తూ.. రాజీవ్ గృహకల్ప కింద వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కట్టిన డ్రైన్ లు నిండిపోయి మురుగు ఎటూ పోవడంలేదని.. గత ఐదేళ్ళు ఆ డ్రైన్ల ను ఎవరూ పట్టించకోకపోవడంతో పాములు, తేళ్ళు బయటకు వస్తున్నాయని.. వాటి కాటుకు గురై పిల్లలు పెద్దలు ఆసుపత్రుల పాలు కావాల్సి వస్తోందని.. దయచేసి సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు.
• గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నవులూరులో తమ ఇల్లు కబ్జా చేశారని.. కబ్జాదారుడి నుండి తమ ఇంటిని విడిపించాలని గ్రీవెన్స్ లో సరోజిని వేడుకున్నారు.
ఈ అర్జీలతో పాటు పలువురు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అర్జీలు అందించగా.. సీఎంఆర్ఎఫ్ అందించి ఆదుకోవాలని మరికొందరు వేడుకున్నారు. నామినేటెడ్ పదవుల కోసం పలువురు నేతలు అర్జీలు ఇచ్చారు.

LEAVE A RESPONSE