-పాలకపక్షంపై, ప్రభుత్వంపై అభాండాలు వేశారు, ఇప్పుడు వాలంటీర్లపై నిందలు
-పసుపు పార్టీకి, పచ్చ మీడియాకు వారానికో దురాలోచన!
నిన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ పాలకపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన, ప్రభుత్వంపైన, చివరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిపైనా పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. ఇంకా చేస్తున్నారు. అంతులేని అభాండాలు వేశారు. జనం ఛీకొట్టినా ఇలాంటి పనులు మానుకోవడం లేదు ప్రతిపక్ష తెలుగుదేశం, దాని అనుకూల మీడియా సంస్థలు. ఈ దుష్ప్రచారానికి సాక్షాత్తూ ఏపీ చివరి మాజీ ముఖ్యమంత్రే నిర్మాత, దర్శకుడు. పచ్చ మీడియా టీడీపీని అడ్డంపెట్టుకుని పాలకపక్షంపై అవాకులు చవాకులు పేలడంతో సంతృప్తిపడడం లేదు.
వాడవాడలా ప్రజలకు ముఖ్యంగా వృద్ధులకు, పేదలకు పించన్లు మొదలు అనేక ప్రభుత్వ సేవలు అందిస్తున్న వార్డు వాలంటీర్లపై ఇప్పుడు తాజాగా అబద్ధాల ప్రచారం మొదలెట్టారు. ప్రభుత్వం నుంచి అందే వేతనాలపై పనిచేసే ఈ స్వచ్ఛంద సేవకులను పాలక పార్టీ ‘గూఢచారులు’ అని ఈ దగాకోరు మీడియా సంస్థలు, టీడీపీ నేతలు ముద్రవేస్తున్నారు. వైఎస్సార్సీపీ సర్కారు అధికారం చేపట్టగానే ఎంతో పట్టుదలతో, ప్రభుత్వంపై పడే ఆర్థికభారాన్ని సైతం లెక్కచేయకుండా వాలంటీర్ల నియామకం చేపట్టింది.
ఇంటర్వ్యూల ద్వారా, స్థానికత, మెరిట్ ప్రాతిపదికన నిబంధనల ప్రకారం వారిని ఎంపిక చేసి నియమించింది. రెండున్నర లక్షలకు పైగా ఉన్న ఈ వాలంటీర్ల నియామకంతో ప్రభుత్వం తెలుగునాట ఇంటింటికి దగ్గరైంది. ప్రజల వద్దకే పాలన వచ్చినట్టయింది. గ్రామ, వార్డు సచివాలయాలు కూడా రావడంతో అధికార వికేంద్రీకరణ జరిగింది. వయసు పైబడిన వారు, బడుగు వర్గాల ప్రజలు ప్రభుత్వం నుంచి అందే సౌకర్యాలు, సాయం కోసం కాళ్లరిగేలా తిరిగే అవసరం లేకుండా పోయింది. ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏకకాలంలో ప్రభుత్వం తరఫున పనిచేస్తూ ప్రజలకు నిత్యం కనిపించే సేవకులుగా మారారు. వాలంటీర్ల వ్యవస్థ ఇంత నిర్మాణాత్మకంగా పనిచేస్తోంది. సర్కారుకు, జనానికి మధ్య చక్కటి వంతెనలా ఉపయోగపడుతోంది.
వాస్తవాలు తెలిసి కూడా పచ్చ ముఠాల విష ప్రచారం
ఈ వాస్తవాలు తెలిసి కూడా టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు భజనతోపాటు పాలకపక్షంపై విషప్రచారం చేసే పసుపు రంగు ‘గోబెల్స్ మీడియా’ ఈ వార్డు వాలంటీర్లపై విషం చిమ్మడానికి ప్రయత్నిస్తోంది. వారిని పాలకపక్షం ‘గూఢచారులు’ అని నిస్సిగ్గుగా ముద్రవేసి వారి విశ్వసనీయతను దెబ్బదీయడానికి శాయశక్తులా కుట్రలు పన్నుతోంది. ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ముందే ఆలోచించి వాలంటీర్ల వ్యవస్థను రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసిందని అడ్డగోలు ఆరోపణలు చేస్తోంది.
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వాలంటీర్లు నడుచుకుంటున్నారు. వారేమీ రాజకీయపక్షాల కార్యకర్తలు కారు. టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సర్కారు చెల్లించే వేతనాలతో వారు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సేవలు జనం లోగిళ్లకు చేర్చే ఒక్క వాలంటీర్లనే ఈ పచ్చ మీడియా, ప్రతిపక్షాలు నిందించడం వాటి దివాళాకోరుతనాన్ని తేటతెల్లంచేస్తోంది.
వివిధ ప్రాంతాలు, విభిన్న రాజకీయ, సామాజిక నేపథ్యాలున్న కుటుంబాల నుంచి వచ్చిన ఈ వాలంటీర్లకు రాజకీయ ఉద్దేశాలు అంటగట్టడంతోపాటు, వారు పాలకపక్షం తరఫున పనిచేసే కార్తకర్తలుగా అభివర్ణించడం టీడీపీ, దాని భజనపరులు ఆడుతున్న వికృత రాజకీయ క్రీడ తప్ప మరేమీ కాదు. చంద్రబాబు అండ్ కంపెనీ అసలు బాధ ఏమంటే–వాలంటీర్ల వ్యవస్థ క్రియాశీలంగా పనిచేస్తుండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు రావడం. ప్రభుత్వమనే చెట్టుకు వేర్లు మాదిరిగా విస్తరించిన ఈ నూతన వ్యవస్థను మానసికంగా దెబ్బదీయడానికి చేస్తున్న కుట్రలు ఫలించవు.