-వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
అప్పులపై ఎల్లో మీడియాది కాకిగోల అని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై కాకిలెక్కలతో గోలచేస్తున్న చంద్రబాబు అనుకూల మీడియా.. టీడీపీ పాలనలో లక్ష కోట్లకుపైగా ఖర్చులకు లెక్కల్లేవని తెలిసినా ఎందుకు ప్రశ్నించడంలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీలంక ఆర్థిక పరిస్థితిని ఏపీతో పోల్చడం అవివేకమని నీతి ఆయోగ్ మాజీ వైస్‌చైర్మన్ అరవింద్ పనగారియా వ్యాఖ్యలను ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎల్లో మీడియా నిస్సిగ్గుగా, నగ్నంగా నర్తిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇక టీడీపీకి ఓటేస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని, స్కాంలే మిగులుతాయని ప్రజలందరికీ తెలుసునని, కానీ.. ఆ విషయం పచ్చ మీడియాకు తెలియడంలేదన్నారు.
ఏపీలోనే అత్యధిక పెన్షన్లు
మరోవైపు.. దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే అత్యధిక పెన్షన్లు ఇస్తున్నది ఏపీలోనేనని.. అలాగే, కేంద్రం ఇచ్చే డబ్బునే పేరుమార్చి పంచుతున్నారనే అజ్ఞానులు ఇది తెలుసుకోవాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు. ఇక పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే ఎదురైన వెన్నుపోటును ప్రజాభిమానంతో తిప్పికొట్టిన ఎన్టీ రామారావు.. చంద్రబాబు వెన్నుపోటుకు మాత్రం కోలుకోలేకపోయారని వివరించారు. కాబట్టి, ఎన్టీఆర్ పేరెత్తే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు.
లోకేశ్ ప్రకటనలు హాస్యాస్పదం
ఇదిలా ఉంటే.. విలీన మండలాల పరిస్థితి చూసి తన తండ్రి చలించిపోయారంటూ లోకేశ్ ప్రకటించుçకోవడం హాస్యాస్పదంగా ఉందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అలాగే, తండ్రి పిలుపునకు స్పందించి మంగళగిరి నుంచి తన వంతుగా బియ్యం, కూరగాయలను వరద బాధితులకు పంపినట్లు లోకేశ్ గొప్పలు చెప్పుకోవడం కూడా విడ్డూరంగా ఉందన్నారు. ఈ మాత్రం సాయం అందించడానికి చినబాబు రెండ్రోజుల క్రితమే మంగళగిరికి వచ్చారన్నారు. ఇక్కడకు హఠాత్తుగా ఆయన రావడానికి ప్రధాన కారణం రెండేళ్లలోపు వచ్చే ఎన్నికలేనన్నారు. ప్రభుత్వం పెట్టే కేసులంటే తమకు భయంలేదని పదేపదే చెప్పే లోకేశ్.. తన తండ్రి చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణల మీద సీబీఐ దర్యాప్తు జరగకుండా ఎందుకు స్టేలు తెచ్చుకుంటున్నారో చెప్పగలడా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.