పల్లెకు జ్వరం వచ్చింది-  జ్వర పీడితులు కరువేలేదు

వర్షాకాలం మొదలై నెల రోజులవుతుంది, సీజన్ మొదలవకముందే జిల్లాలో  వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. గుత్తి, పెద్దవడుగూరు, పామిడి, కల్లూరు, యాడికి మండలాల్లాలో  గ్రామీణ వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద రోగులు పెద్ద ఎత్తున గుమికూడుతున్నారు.   వర్షాకాలంలో ప్రధానంగా ఐదు రకాల వైరల్ ఫీవర్లు వస్తాయని వైద్యులు  హెచ్చరిస్తున్నారు. ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఈ సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.  ప్రజలు బయట తిండి మాని ఇంటి తిండి వేడిగా తింటే సగం జబ్బులనుండి దూరంగా ఉండవచ్చు. ప్రజలు గుమికూడిన ప్రదేశాలలో   ప్రసాదాలు, భోజనాలు చేయడం తగ్గించాలి.  ప్రతి ఇంట్లో  దగ్గు  జలుబు  జ్వరం బారిన పడిన వ్యక్తులు ఒకరు లేక ఇద్దరు ఉంటున్నారు.  హాస్టల్ లో ఉండే విద్యార్థులు డెబ్భై శాతం జ్వర పీడితులు .

 మలేరియా.. 
దోమల ద్వారా వచ్చే విష జ్వరాల్లో మలేరియా ఒకటి. చలితో జ్వరం, ఒళ్లు నెప్పులు, రోజు మార్చి రోజు జ్వరం రావడం దీని లక్షణాలు. సాధారణ జ్వరానికి చేసే చికిత్సతోపాటు.. మలోరియా కు ప్రత్యేకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే మలేరియా వ్యాధి నిర్థారణ తర్వాతే వీటి ద్వారా చికిత్స అందిస్తారు. రోజు మార్చి రోజు జ్వరం వస్తూ, తగ్గినట్టే తగ్గి జ్వరం వస్తున్నా మలేరియాలాగా అనుమానించాలని అంటున్నారు.

పైలేరియా
దీన్నే బోధకాలు అంటారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జ్వరం, కాళ్లు చేతులు వాపు, బోదకాలు దీని లక్షణాలు. బోదకాలుకి నివారణ మందు ఉన్నా.. అది తీవ్రమైన తర్వాత దాన్ని తగ్గించడం కాస్త కష్టసాధ్యమేనంటున్నారు వైద్యులు. క్యూలెక్స్ దోమకాటు ద్వారా బోదకాలు వ్యాధి వస్తుంది. దీన్ని నివారణ విషయంలో ఎంత త్వరగా వైద్య చికిత్స మొదలు పెడితే అంత మంచిదని సలహా ఇస్తున్నారు.

 చికెన్ గున్యా
విపరీతమైన ఒళ్లు నెప్పులు, కీళ్ల నొప్పులు దీని లక్షణాలు. దీనికి ప్రత్యేకమైన చికిత్స ఏదీ ఉండదని, రెండు వారాల్లో చికెన్ గున్యా సాధారణ మందులతో తగ్గుతుందని, కీళ్ల నొప్పులు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు. కొంతమందిలో మాత్రం దీర్ఘకాలికంగా ఈ నొప్పులు బాధిస్తుంటాయి.

డెంగీ
సీజనల్ వ్యాధుల్లో అతి ప్రమాదకరమైనది, ప్రాణాంతకమైనది డెంగీ వ్యాధి. ఆగస్ట్ లో మొదలై డిసెంబర్ వరకూ డెంగీ కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు వైద్యులు. డెంగీని ముందుగా గుర్తించి వైద్యం మొదలు పెడితే ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశముంది. ర్యాపిడ్ టెస్ట్ లు, ఎలీసా పరీక్షతో డెంగీని నిర్థారించవచ్చు. సాధారణ జ్వరం, డెంగీ జ్వరానికి తేడా  ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గిపోవడం, బీపీ తగ్గిపోవడం, షాక్ కి గురికావడం. నాలుగైదు రోజుల్లో డెంగీ జ్వరం తగ్గకపోతే, ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గిపోతే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 20వేలకు తక్కువగా ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గిపోతే.. బాధితుడికి ప్లేట్ లెట్స్ అందించాల్సి ఉంటుంది.

మెదడు వాపు.. 
మెదడు వ్యాపు వ్యాధి.. ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. ఇది పందుల ద్వారా వ్యాపిస్తుంది. వర్షాకాలంలో మెదడు వాపు వ్యాధి కేసులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ దీనికి ఇటీవల కాలంలో టీకా విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. దీంతో మెదడు వ్యాధి కేసులు తగ్గిపోయాయి. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు రాకుండా నివారించాలంటే దోమకాటుకి దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాలు శుభ్రపరచుకోవాలి. నీళ్లు నిల్వ ఉండకూడదు. మురుగు కాల్వల్లో చెత్త వేయకూడదు. సాయంత్రం వేళలో దోమలు ఇళ్లలోకి వస్తాయి కాబట్టి ఆ సమయంలో ఇంటి తలుపులు, కిటీకీ తలుపులు వేసుకుని ఉండాలి. కాయిల్స్, ఆలౌట్ వంటివి అందుబాటులో ఉన్నా.. దోమతెరలు వాడటం శ్రేష్టం. కాయిల్స్ వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. వేపాకుని ఎండబెట్టి పొగ వేసుకోవడం కూడా ఖర్చులేని మంచి పని.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక