– గ్రామీణ న్యాయవాదులకు అభినందనలు
ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ప్రాముఖ్యత కలిగిన న్యాయవాద వృత్తిలో గతంలో పట్టణాలకు చెందిన సంపన్నులు మాత్రమే కొనసాగే వారని ఇటీవల కాలం నుండి గ్రామీణ, మారుమూల ప్రాంతాల విద్యార్థులు కూడా న్యాయవాద వృత్తిలోకి వస్తున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి దూరంగా నెట్టబడిన గ్రామీణ ప్రాంతాల్లో ఆధిపత్య వర్గాల జులుము కొనసాగుతున్న నేటి తరుణంలో గ్రామీణ యువత న్యాయవాద వృత్తిలోకి రావడం మంచి పరిణామమని తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ అన్నారు. శనివారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నూతనంగా న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టిన న్యాయవాదులకు ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్లు అందించి ఆయన మాట్లాడారు.
గ్రామీణ న్యాయవాదులకు అభినందనలు
నూతనంగా న్యాయవాద వృత్తిలోకి అడుగిడిన న్యాయవాదులకు పలువురు నాయకులు, బార్ కౌన్సిల్ సభ్యులు అభినందనలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాలకు చెందిన యగ్గడి సుందర్ రామ్ కు, ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన సంకే మౌనిక, పెద్దపెల్లి జిల్లా మంతిని మండలానికి చెందిన అప్రోజు, సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన భాషబోయిన వేణురాజ్ యాదవ్ లకు బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్లు అందించి అభినందనలు తెలిపారు. తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్లు చలకాని వెంకట యాదవ్, ఫణీంద్ర భార్గవ్, తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు రఘునందన్, న్యాయవాదులు సాయిని నరేందర్, రాచకొండ ప్రవీణ్, కిషోర్ కుమార్, నూనవత్ రవీందర్ లు అభినందనలు తెలిపి మాట్లాడారు.
సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న అసమానతలు, నేరాలను అదుపు చేయడంలో న్యాయవాద వృత్తి చాలా కీలకమైందని, మానవీయ విలువలను పెంచడంలో న్యాయవాద వృత్తి ఎంతో ఉపయోగపడుతుందని అలాంటి వృత్తిలోకి గ్రామీణ ప్రాంత యువత రావడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని వారన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రజలు ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ నేటికీ మహిళలు ఎన్నో రకాలుగా అవమానాలకు, హింసలకు గురవుతున్నారని అవనిలో సగభాగమైన మహిళల రక్షణకు మహిళా న్యాయవాదులు ఎంతో మేలు చేస్తారని అలాంటి న్యాయవాద వృత్తిలోకి ఇటీవల కాలంలో మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారని, గ్రామీణ మహిళలు వృత్తి లోకి రావడం వల్ల మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని వారన్నారు.
మారుమూల అట్టడుగు ప్రాంతాల నుండి పేదరికం నుండి అభివృద్ధి చెందుతున్న వారు న్యాయవాద వృత్తిలోకి రావడం వల్ల నిరక్షరాస్యులకు, నిస్సహాయకులకు, పేదలకు ఎంతో మేలు జరుగుతుందని వారన్నారు. నూతనంగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన వారికి వివిధ సంఘాల నాయకులు పూజారి వెంకన్న, వెలుగు వనిత, పటేల్ వనజ, సోమ రామమూర్తి, న్యాయవాద సంఘ నాయకులు గునిగంటి శ్రీనివాస్, అచ్యుత్, చంద్రశేఖర్, న్యాయవాదులు మధుసూదన్ రెడ్డి, అంబరీష్, అల్లం నాగరాజు, చింతం ధనుంజయ, ఇజ్జగిరి చంద్రశేఖర్, నిఖిల్ కుమార్, అర్షం రాంబాబు, వలిశెట్టి గాంధీ, నల్లపు రాజు, శ్యాం ప్రసాద్, జె జె స్వామి, రాజబాబు, రఫిక్, అన్వర్ తదితరులు అభినందనలు తెలిపారు.