Suryaa.co.in

Andhra Pradesh

పల్లా ఇలాకాలోనే ఇలా జరిగితే ఎలా?

– విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా
– కోరం లేక ఎన్నిక వాయిదా.. మళ్లీ నేడు
– డిప్యూటీ మేయర్ జనసేనకు ఇవ్వడంపై టీడీపీలో అసంతృప్తి
– ఆ అసంతృప్తితోనే ఎంపిలు, ఎమ్మెల్యే, కార్పొరేటర్ల సహా 17మంది గైర్హాజర్
– ఎన్నికకు ఎంపి సీఎం రమేష్, భరత్, ఎమ్మెల్యే గంటా డుమ్మా
– యాదవులకు ఇవ్వాలని గంటా, వెలగపూడి పట్టు
– తమ్ముళ్ల ధిక్కారంపై లోకేష్ ఆగ్రహం
– ధిక్కార నేతలకు షోకాజ్ నోటీసులివ్వాలని ఆదేశం
– సమన్వయలోపమే కారణమన్న పల్లా శ్రీనివాస్
( సుబ్బు)

విశాఖ: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సొంత జిల్లాలోనే తమ్ముళ్లు గీత దాటిన వైనం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ ఆగ్రహానికి గురయింది. విశాఖ డిప్యూటీ మేయర్ పదవికి జరగాల్సిన ఎన్నిక.. కోరం లేక వాయిదా పడటాన్ని టీడీపీ యువనేత లోకేష్ సీరియస్‌గా తీసుకున్నారు. హాజరుకాని కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసులివ్వాలని ఆదేశించినట్లు సమాచారం. క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని విశాఖ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఇదంతా సమన్వయం లేకనే జరిగిందని, ఇకపై అలా జరగదని దానికి తానే బాధ్యత వహిస్తానని పల్లా మీడియాకు చెప్పారు.

విశాఖ డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టిన నేపథ్యంలో మళ్లీ ఎన్నిక జరగాల్సి ఉంది. ఆ మేరకు జరిగిన ఎన్నిక, కోరం లేక వాయిదా పడింది. టీడీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు గైర్హాజరవడమే దానికి కారణం. నేడు జరిగిన సమావేశానికి 74 మంది సభ్యులకు గాను 54 మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్నిక నిర్వహణకు 56 మంది కావలసి ఉండగా, ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లు ముఖం చాటేశారు. డిప్యూటీ మేయర్ స్థానాన్ని జనసేనకు కేటాయించడంపై నెలకొన్న అసంతృప్తి కార్పొరేటర్ల గైర్హాజరుకు దారితీసింది.

డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నిక జరుగుతుందని ముందే తెలిసినప్పటికీ, విశాఖ జల్లా టీడీపీ అగ్రనేతలు ఆ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవడంలో విఫలమయ్యారు. స్వయంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విశాఖ కార్పొరేషన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఆయన ఇలాకాలోనే తమ్ముళ్లు కట్టుదాటి వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ‘‘ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను సమన్వయం చేసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. డిప్యూటీ మేయర్ అభ్యర్ధి వ్యవహారాన్ని ఇన్ని రోజులు నాన్చి, చివరకు నిన్న రాత్రి 11 గంటలకు ప్రకటించడం ఏమిటి? అప్పటిదాకా ఏం చేస్తున్నారు? ఆ పదవి ఆశిస్తున్న వారితోనయినా మాట్లాడి బుజ్జగించారా అంటే అదీ లేదు. అందుకే ఈ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారి, కార్పొరేటర్లు ధిక్కారస్వరం వినిపించేంతవరకూ వెళ్లింద’’ని విశాఖ జిల్లా టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కీలకమైన ఎన్నికకు సంబంధించి, అభ్యర్థిని నిర్ణయించేందుకు ఇన్ని రోజులు సమయం తీసుకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

అయితే ఇదంతా సమన్వయలోపం వల్ల జరిగిందేనని, ఇకపై అన్నీ సవ్యంగా జరుగుతాయని.. అందుకు తాను బాధ్యత వహిస్తానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మీడియాతో చెప్పారు. డిప్యూటీ మేయర్ అభ్యర్ధి ఎంపికలో ఆలస్యం జరిగినమాట నిజమేనని, గత రాత్రి 11 గంటలకు ఆ పదవి జనసేనకు ఇవ్వాలని నిర్ణయించినట్లు పల్లా వెల్లడించారు. నేటి సమావేశానికి సభ్యులంతా హాజరవుతారని చెప్పారు. ఈ పదవిని టీడీపీ కార్పొరేటర్లు కూడా ఆశించినప్పటికీ, నాయకత్వ నిర్ణయం ప్రకారం జనసేనకు కేటాయించినట్లు పల్లా వివరించారు.

జనసేనకు చెందిన డల్లి గోవర్దన్‌రెడ్డికి డిప్యూటీ మేయర్ ఇవ్వాలని నిర్ణయించడంపై టీడీపీ కార్పొరేటర్లలో అసంతృప్తి వ్యక్తమయింది. అయితే దానిని తమకే ఇవ్వాలని టీడీపీ కార్పొరేటర్లు తొలి నుంచీ ఒత్తిడి చేస్తున్నారు. కానీ విశాఖలో తమకు ప్రాతినిధ్యం ఉండటంతోపాటు, వైసీపీ నుంచి కార్పొరేటర్లు తమ పార్టీలో చేరినందున ఆ సీటు తమకే ఇవ్వాలని అటు జనసేన సైతం పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో డిప్యూటీ మేయర్ సీటు, జనసేనకే ఇవ్వాలని నిన్న రాత్రి నిర్ణయించారు. అయితే టీడీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎంపీలు ఎన్నికకు ముఖం చాటేశారు.

ఈరోజు జరగాల్సిన ఎన్నికకు అనకాపల్లి బీజేపీ ఎంపి సీఎం రమేష్, విశాఖ ఎంపి భరత్, టీడీపీ ఎమ్మెల్యే గంటా సహా 17 మంది సభ్యులు డుమ్మా కొట్టారు. ఇందులో జనసేనకు మద్దతునిస్తూ, ఆ పదవి ఆశిస్తున్న మరో సభ్యుడు కూడా ఉన్నారు. నిజానికి మేయర్ పదవిని గవర కులానికి కేటాయించినందున, డిప్యూటీ మేయర్ పదవిని యాదవులకు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ పట్టుదలతో ఉన్నారు. ఆ క్రమంలో గంటా శ్రీనివాసరావు తన వర్గీయురాలయిన హేమలత కోసం, వెలగపూడి తన వర్గీయురాలయిన మంగ కోసం ప్రయత్నాలు చేశారు.

కాగా కార్పొరేషన్‌లో 17 మంది సభ్యుల బలం ఉన్న జనసేన.. మేయర్ ఎన్నికకు తాము టీడీపీకి సహకరించినందున, డిప్యూటీ మేయర్ తమకే ఇవ్వాలని వాదిస్తోంది. మరో డిప్యూటీ మేయర్‌కు త్వరలోనే ఎన్నిక జరుగుతున్నందున, దానిని టీడీపీ తీసుకోవాలని జనసేన సూచిస్తోంది. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం.. రెండో డిప్యూటీ మేయర్ పదవినే జనసేన తీసుకుని, దీనిని తమకు విడిచిపెట్టాలని వాదిస్తున్నారు. ఈ క్రమంలో నేడు జరగనున్న ఎన్నికకు ఎంతమంది హాజరవుతారో చూడాలి.

LEAVE A RESPONSE